Theatre వద్దు.. OTT ముద్దు.. వెండితెరపై సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోవడానికి కారణాలివే..

ABN , First Publish Date - 2022-06-02T15:32:05+05:30 IST

వినోదం అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది సినిమా. అందుకే వీకెండ్ లేదా సెలవు దొరికిందంటే చాలు చాలామంది కుటుంబాలతో..

Theatre వద్దు.. OTT ముద్దు.. వెండితెరపై సినిమాలు చూసే ప్రేక్షకులు తగ్గిపోవడానికి కారణాలివే..

వినోదం అంటే అందరికీ మొదట గుర్తొచ్చేది సినిమా. అందుకే వీకెండ్ లేదా సెలవు దొరికిందంటే చాలు చాలామంది కుటుంబాలతో కలిసి థియేటర్స్ వెళ్లి మూవీస్ చూస్తుంటారు. అప్పట్లో సినిమాలు చూడాలంటే ప్రేక్షకులకి థియేటర్స్ ఒక్కటే దిక్కు. కానీ.. ఈ డిజిటల్ యుగంలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా కరోనా తర్వాత OTTలకి బాగా ప్రాచుర్యం పెరిగింది. దీంతో వాటిలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అంటూ రకరకాల వినోదాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్స్‌కి వెళ్లడం తగ్గించేశారు. ఇంకా చెప్పాలంటే.. ఏదైనా మూవీ విడుదలైతే మొదటి రోజు స్క్రీనింగ్ తర్వాత రివ్యూలు చూసి థియేటర్‌కి వెళ్లలా లేక ఓటీటీలో వచ్చిన తర్వాత చూడాలా అని నిర్ణయం తీసుకుంటున్నారు.


నిశితంగా పరిశీలిస్తే.. ఈ మధ్య టిక్కెట్ల ధరలు బాగా పెరిగిపోవడం కూడా ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లకపోవడానికి ఓ ముఖ్యకారణం. గతంలో.. తమ అభిమాన తారల చిత్రాలను పలుమార్లు చూసే ఫ్యాన్స్ సైతం.. టిక్కట్ రేట్ల కారణంగా థియేటర్లకు వెళ్లడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు.. జనాలకు ఉన్న ఏకైక వినోదం థియేటర్లలో సినిమాలు చూడటం. కానీ.. ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. OTTలో IPL ప్రత్యక్ష ప్రసారం, వెబ్ సిరీస్ వంటి అనేక మార్గాలు కనిపిస్తున్నాయి.


ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని ఓ థియేటర్‌కి చెందిన ఉద్యోగి ఒకరు దీని గురించి మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌కు ముందు మొదటి వారం రోజుల్లో రెగ్యులర్ ప్రేక్షకులు ఉండేవారు. అందులో.. విద్యార్థులు, ఆఫీస్‌కి సెలవు తీసుకున్న ఉద్యోగులు, కుటుంబాలు, చివరికీ ఉద్యోగం కోసం వెదుక్కునేవారు సైతం ఉండేవారు. ఇప్పుడు ఎవరూ అంతగా రావడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.


టిక్కట్ల ధరపై ఓ నిర్మాత మాట్లాడుతూ.. ‘పరిశ్రమ నిలదొక్కుకోవడానికి కష్టపడుతోంది. ఇండస్ట్రీలో టిక్కెట్ ధరల విషయంలో ఏకాభిప్రాయం రావాలి. భారీ బడ్జెట్, స్టార్ సినిమాల టిక్కట్ల ధరల విషయంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అయితే.. ఎటువంటి ప్రాబల్యం లేని నటుల సినిమాలకు సైతం టిక్కెట్ల రేట్లు అలాగే ఉండటం ఇబ్బంది కలిగిస్తోంది’ అని తెలిపాడు.


ఓ సినీ విశ్లేషకుడు మాట్లాడుతూ.. ‘కోవిడ్-19 మూడు వేవ్స్ తర్వాత చాలామంది కుటుంబాలతో థియేటర్స్‌కి సినిమాలు చూడటం మానేశారు. ఎందుకంటే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ ధరలు చాలా తక్కువ. కుటుంబ సభ్యులను థియేటర్‌కి తీసుకెళ్లి భారీ మొత్తంలో ఖర్చు చేయడం కంటే.. ఏడాదికోసారి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుని ఓటీటీల్లో హాయిగా ఉండే ఇంట్లోనే సినిమాలు చూడడం ఆర్థికంగా ఉపయోగపడుతుంది’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2022-06-02T15:32:05+05:30 IST