నేను యుద్ధం చేయాల్సి వస్తే.. : పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-03-02T23:25:49+05:30 IST

మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడికి వంద తప్పుల వరకు అవకాశం ఇచ్చాడని అంటుంటారు. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొంభైతొమ్మిది అవకాశాలు ఇస్తానంటున్నారు. ‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే..

నేను యుద్ధం చేయాల్సి వస్తే.. : పవన్ కల్యాణ్

మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడికి వంద తప్పుల వరకు అవకాశం ఇచ్చాడని అంటుంటారు. అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొంభైతొమ్మిది అవకాశాలు ఇస్తానంటున్నారు. ‘ఒక మార్పు కోసం యుద్ధం చేయాల్సి వస్తే.. తొంభైతొమ్మిది సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను, నూరవసారే యుద్ధం చేస్తాను’ అంటూ తాజాగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఒకవైపు రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య భీకరమైన పోరు జరుగుతోంది. మరో వైపు ఏపీలోని ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారి వ్యవస్థలను నాశనం చేసే దిశగా నడుస్తోంది. మరి వీటిని ఉద్దేశించి చేశారో.. లేక తన మనస్తత్వం ఇదని తెలియజెప్పాలని అనుకున్నారో తెలియదు కానీ.. మార్పు కోసం ఇంకా ఎంత కాలమైనా వేచి చూస్తాననే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. 


ఇటీవల వచ్చిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలోనూ సరిగ్గా ఇలాంటి డైలాగే ఒకటుంది. పోలీస్ ఉద్యోగం నుండి సస్పెండ్ అయిన తర్వాత బస్సులో వెళుతున్న భీమ్లా నాయక్‌‌ను‌ రెచ్చగొట్టేందుకు డానియల్ శేఖర్ ప్రయత్నించిన సందర్భంలో.. ‘‘నువ్వు పీకేయ్.. నేను మొలుస్తా. నువ్వు తొక్కేయ్.. నేను లేస్తా. నువ్వు తీసేస్తే.. నేను మళ్లీ వస్తా.. నీకు ఆపలేని యుద్ధం ఇస్తా..’’ నంటూ పవన్ కల్యాణ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయి. అలాగే ఇటువంటి డైలాగే పూరీ జగన్నాధ్.. తన ‘నేనింతే’ చిత్రంలో రవితేజతో చెప్పించారు. ‘తుడుచుకుంటే పోతుంది అనుకుంటే.. నూటికి తొంభైతొమ్మిది సార్లు నేను తుడుచుకోవడానికి సిద్ధం. కానీ నేనే పోతాను అనుకుంటే.. ముందు నువ్వు పోతావ్’ అనే డైలాగ్ ఇప్పటికీ అక్కడక్కడ వినబడుతూనే ఉంటుంది. అలాగే ‘యుద్ధంలో గెలవడమంటే శత్రువుని చంపడం కాదు.. శత్రువుని ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం.. చంపడం కాదు’ అని ‘జల్సా’ సినిమాలో పవన్ కల్యాణే చెప్పారు. ఈ డైలాగ్స్‌ అన్నింటికి అర్థం దాదాపుగా ఒకటే. ఇదంతా సినిమా. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ చెప్పిన మాటలో.. ప్రస్తుతం సందర్భాన్ని బట్టి చాలా లోతైన అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ ఉందని పలువురు భావిస్తున్నారు.



Updated Date - 2022-03-02T23:25:49+05:30 IST