అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధమిది: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-02-24T05:05:51+05:30 IST

చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతమిది. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదు. అలా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని

అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధమిది: పవన్ కల్యాణ్

‘‘చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతమిది. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదు. అలా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కి తీసుకురావాలని ఎందరో పెద్దలు సంకల్పించి తీసుకువచ్చారు. ఈ రోజు ఈ పరిశ్రమని, బంధాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్రోత్సాహం అందిస్తున్నందుకు ధన్యవాదాలు అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన హీరోగా, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 


‘‘జై తెలంగాణ, జై ఆంధ్ర, జై భారత్. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులందరికీ నమస్కారాలు. నాలుగైదు గంటలుగా అభిమానులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడిన అభిమానులందరూ మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. నా ఆహ్వానం మేరకు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన.. నేను ప్రేమగా రామ్ భాయ్ అని పిలుచుకునే కేటీఆర్‌గారికి కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతమిది. నిజమైన కళాకారుడికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదు. అలా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కి తీసుకురావాలని ఎందరో పెద్దలు సంకల్పించి తీసుకువచ్చారు. ఈ రోజు ఈ పరిశ్రమని, బంధాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ తరపున కేసీఆర్‌గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. చిన్న సమస్య అంటే చాలు అప్యాయంగా దగ్గరకు తీసుకుని పరిష్కరించేలా తోడ్పాటుని అందిస్తున్న తలసానిగారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన దానం నాగేందర్‌గారికి, మాగంటి బాబుగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జనజీవితంలో ఉన్నాగానీ.. నాకు సినిమా అనేది అన్నం పెట్టింది. సినిమా అనేది లేకపోతే.. ఈ రోజు ప్రజల కోసం ఇలా ఉనికి కూడా ఉండేది కాదు. సినిమా నాకు ఇచ్చిన భిక్ష.. ఇంత మంది అభిమానం. ఇంతమంది గుండెల్లో పెట్టుకున్నందుకు.. ఏదో అయిపోతానని కాదు కానీ.. ఎంతోకొంత చేయాలి మన దేశానికి, మన ప్రాంతానికి, మన రాష్ట్రాలకి, మన వాళ్లకి. వేరే వృత్తి నాకు తెలియదు. సినిమానే నాకు డబ్బులు సంపాదించుకునే వృత్తి. ఏదో రాజకీయాల్లో ఉంటున్నాం అని కాకుండా.. చాలా బాధ్యతగా సినిమాలను చేస్తున్నాను. ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ సినిమాల సమయంలో ఎలా అయితే కష్టపడ్డానో.. ఇప్పుడు కూడా అలానే బాధ్యతగా సినిమాలు చేస్తున్నాను.


ప్రతి టెక్నీషియన్ మనసుపెట్టి ఈ చిత్రాన్ని ముందుకు తీసుకువెళ్లారు. నిర్మాతలు చినబాబుగారు, వంశీగారు దగ్గరుండి.. నా పొలిటికల్ మార్గానికి అనుగుణంగా షెడ్యూల్స్ ప్లాన్ చేసి.. నాకు బలమైన మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఒక పరిశ్రమ కదిలితే.. ఎంతమంది కళాకారులు వస్తారు, ఎంతమంది యువశక్తి బయటికి వస్తారనే దానికి ఉదాహరణే తెలంగాణ యువకుడు దర్శకుడు సాగర్‌గారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న సాగర్‌గారికి ధన్యవాదాలు. మారు మూల ప్రాంతాలలోని కళాకారులని చూసినవాడిని. వారంతా సినిమాలలోకి వస్తే బాగుంటుంది కదా.. అని అనుకునే వాడిని. అలానే మొగిలయ్యగారిని గుర్తించి, ఆయనకి అవకాశం ఇచ్చిన థమన్ గారికి ధన్యవాదాలు.


ఈ సినిమా అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధమిది. ఇది మళయాలం చిత్రం. ఒక పోలీసు అధికారికి, రాజకీయ నేపథ్యం ఉండే వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. దీనిని యాడాప్ట్ చేసి, చాలా బాగా రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాకి వెన్నెముక. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన ముందుండి ఈ సినిమాని నడిపించారు. ఈ చిత్రంలో డానియల్ శేఖర్‌గా రానా గారు అద్భుతమైన నటనతో సహకారం అందించారు. సంయుక్తా మీనన్, నిత్యామీనన్ వంటి వారు కూడా అద్భుతంగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ప్రతి చేసిన ప్రతి ఒక్కరూ వారి వంతుగా బలంగా కృషి చేశారు. కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్.. ఇలా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణునికి ధన్యవాదాలు. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఆనందింపజేస్తుంది.. అందరికీ ధన్యవాదాలు..జైహింద్’’ అని తెలిపారు.

Updated Date - 2022-02-24T05:05:51+05:30 IST