తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-02-25T01:29:32+05:30 IST

హైదరాబాద్‌లో నిర్వహించిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో..

తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

హైదరాబాద్‌లో నిర్వహించిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్. కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్ బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు అతిథులుగా హాజరయ్యారు. అలాగే వేలాదిగా అభిమానులు ఈ వేడుకకు తరలిరావడంతో.. పోలీసులు శ్రమకోర్చి, ఈ కార్యక్రమం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తెలంగాణ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. అందులో..


‘‘అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా.. అదే విధంగా జన సామాన్యానికి అవాంతరాలు లేకుండా చేయడంలో, ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో పోలీసులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సి.వి.ఆనంద్ గారు, సిటీ జాయింట్ కమిషనర్ (ట్రాఫిక్) శ్రీ ఎ.వి.రంగనాథ్ గారు, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీ జోయెల్ డేవిస్ గార్లతోపాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులకు, పోలీసు సిబ్బందికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం సాఫీగా సాగడంలో ఎంతో శ్రమించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేలా లైవ్ కవరేజీలు, వార్తా కథనాలు అందించిన పాత్రికేయులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ వేడుకలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొని క్రమశిక్షణతో మెలిగిన అభిమానులకు అభినందనలు. అభిమానులు ఇదే క్రమశిక్షణను, స్ఫూర్తిని కొనసాగించాలి..’’ అని తెలిపారు.



Updated Date - 2022-02-25T01:29:32+05:30 IST