మన స్వేచ్ఛ కోసం త్యాగాలు చేసిన వీరుల చరిత్ర అందరికీ తెలియాలి: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2022-02-27T02:00:00+05:30 IST

ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా భారతీయులు ఆయుధాలతోనూ పోరాడగలరని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంగ్రామ చరిత్ర ఎంత మహాజ్వలమైనదో తెలియచెప్పే ‘నేతాజీ’ గ్రంథాన్ని రచించిన ప్రముఖ రచయిత

మన స్వేచ్ఛ కోసం త్యాగాలు చేసిన వీరుల చరిత్ర అందరికీ తెలియాలి: పవన్ కల్యాణ్

‘ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా భారతీయులు ఆయుధాలతోనూ పోరాడగలరని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంగ్రామ చరిత్ర ఎంత మహాజ్వలమైనదో తెలియచెప్పే ‘నేతాజీ’ గ్రంథాన్ని రచించిన ప్రముఖ రచయిత, సంపాదకులు ఎం.వి.ఆర్.శాస్త్రిగారికి హృదయపూర్వక అభినందనలు’ అని తెలిపారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్ర‌ముఖ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రీ ర‌చించిన ‘నేతాజీ’ పుస్తక ఆవిష్క‌ర‌ణ స‌భ హైదరాబాద్‌లోని ర‌వీంద్ర భార‌తీ ఆడిటోరియంలో ఫిబ్రవరి 25, శుక్ర‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స‌ర్ కార్య‌వాహ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే, రామ‌కృష్ణ మ‌ఠానికి చెందిన పూజ్య స్వామి శితికంఠానందాజీ, జ‌స్టిస్ ఎల్‌.న‌ర్సింహ రెడ్డి, ప‌ద్మ అవార్డు గ్ర‌హీత హ‌నుమాన్ చౌద‌రి, దుర్గా ప‌బ్లికేష‌న్స్ అధినేత దుర్గ.. పుస్త‌క ర‌చ‌యిత, ప్ర‌ముఖ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి త‌దిత‌రులు పాల్గొన్నారు. ‘ఈ గ్రంథావిష్కరణకు నేనూ హాజరుకావాల్సింది.. ఇతర షెడ్యూల్స్ వల్ల సాధ్యం కాలేదు’ అని తెలుపుతూ.. పవన్ కల్యాణ్ ఓ లేఖను విడుదల చేశారు. అందులో..


‘‘స్వతంత్ర భారతావని కోసం వీర మార్గంలో పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతిగా భారతీయులు ఆయుధాలతోనూ పోరాడగలరని ధీరత్వాన్ని ప్రపంచానికి చాటారు. ఆ ధీశాలి సంగ్రామ చరిత్ర ఎంత మహోజ్వలమైనదో తెలియచెప్పే ‘నేతాజీ’ గ్రంథాన్ని రచించిన ప్రముఖ రచయిత, సంపాదకులు శ్రీ ఎం.వి.ఆర్.శాస్త్రిగారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే ఎందరో వీరులు స్వతంత్ర పోరాటంలో తమ ఊపిరిని తృణప్రాయంగా వదిలారు. అటువంటి ధీరోదాత్తుల పోరాటపటిమ.. వారి అచంచలమైన దేశభక్తిని నవతరానికి.. భావి తరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ బాధ్యతతోనే నేతాజీ జీవితాన్ని అక్షరబద్ధం చేసిన శ్రీ శాస్త్రిగారిలో ఉన్న జాతీయవాద దృక్పథం ప్రశంసనీయమైనది. ఈ గ్రంథావిష్కరణకు నేను హాజరుకావాల్సింది.. ఇతర షెడ్యూల్స్ వల్ల సాధ్యం కాలేదు. మరో ప్రత్యేక సందర్భంలో శ్రీ శాస్త్రిగారిని కలుస్తాను. 


‘నేతాజీ’ పుస్తకంలోని విశేషాల గురించి తెలుసుకుంటే, 2001లో నేను జపాన్ పర్యటనకు వెళ్లినప్పటి సంఘటనలు గుర్తుకొచ్చాయి. టోక్యోలోని భారత హై కమిషనర్ కార్యాలయంలోని నా సన్నిహితుల ద్వారా రెంకోజీ టెంపుల్‌లోని నేతాజీ ఆనవాళ్లను, అక్కడి స్మారకాన్ని దర్శించాను. విజిటర్స్ బుక్‌లో.. రెంకోజీ టెంపుల్‌ను సందర్శించినపుడు శ్రీ అటల్ బిహారీ వాజపేయిగారు తను సుభాష్ చంద్రబోస్ నుంచి పొందిన స్ఫూర్తిని చెబుతూ రాసిన అభిప్రాయం చదివాను. 


నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన ‘సిద్దాంతం కోసం ఒక మనిషి తన ప్రాణాన్ని కోల్పోవచ్చు. అయితే, ఆ సిద్ధాంతం.. అతడి మరణం తర్వాత వేలాది మందిలో స్ఫూర్తి నింపుతుంది. కోట్లాది మంది ప్రజానీకానికి మేలు చేస్తుంది’ అనే మాటలను ప్రతి ఒక్కరూ గుండెల్లో నింపుకోవాలి. అందుకు శ్రీ శాస్త్రిగారు లాంటివారి నుండి మరిన్ని రచనలు రావాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.



Updated Date - 2022-02-27T02:00:00+05:30 IST