‘సర్కారు వారి పాట’ సంక్రాంతి సినిమా అన్నందుకు.. రాజమౌళిపై ట్రోలింగ్

ABN , First Publish Date - 2021-12-22T03:21:32+05:30 IST

జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని నిర్మాతలు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. మొదటి నుండి ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపుతున్నామని చిత్ర నిర్మాత నాగవంశీ

‘సర్కారు వారి పాట’ సంక్రాంతి సినిమా అన్నందుకు.. రాజమౌళిపై ట్రోలింగ్

జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని నిర్మాతలు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. మొదటి నుండి ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపుతున్నామని చిత్ర నిర్మాత నాగవంశీ చెబుతూ వచ్చారు. రీసెంట్‌గా కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఈ విషయం తెలియజేసి.. అభిమానులను ఖుషి చేశారు. నిర్మాత చెప్పిన దాని ప్రకారం ఈ చిత్రం సంక్రాంతికి పక్కా అని అంతా భావిస్తున్న టైమ్‌లో నిర్మాతలంతా ఒక్కటై.. ‘పరిశ్రమ బాగుకోసం’ అనే ట్యాగ్ వాడి చిత్ర నిర్మాతలని, హీరోని ఒప్పించి సినిమాని వాయిదా వేయించారు. దీంతో జనవరి 7న విడుదల కాబోతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’, జనవరి 14న విడుదల కాబోతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధేశ్యామ్’ చిత్రయూనిట్లు ఊపిరి పీల్చుకున్నాయి. ఎంత పాన్ ఇండియా సినిమాలైనా కూడా.. పవన్ కల్యాణ్ సినిమా బరిలో ఉందనేసరికి.. ఇరు చిత్రాల నిర్మాతలు కాస్త కంగారు పడుతున్న విషయం కొన్ని రోజులుగా తెలుస్తూనే ఉంది. అందులోనూ ఈ రెండు చిత్రాల మేకింగ్‌కి మూడు సంవత్సరాల టైమ్ పట్టింది. అందుకే ‘భీమ్లా నాయక్’ సినిమాని వాయిదా వేయమని కోరుతూ ఇప్పటికే పలుమార్లు చిత్ర నిర్మాతలకు రిక్వెస్ట్‌లు వెళ్లినా.. ‘మేము ముందే డేట్ ప్రకటించాం.. తగ్గేదేలే’ అన్నట్లుగా నాగవంశీ చెబుతూ వచ్చారు. కానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రిక్వెస్ట్‌తో చిత్రాన్ని ఫిబ్రవరి 25కి వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. 


దీంతో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ నిర్మాతలు.. ‘భీమ్లా నాయక్’ నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దర్శకుడు రాజమౌళి ‘భీమ్లా నాయక్’ టీమ్‌కి ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్స్‌లో ఓ ట్వీట్‌‌కి పవన్ కల్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మహేశ్‌ ‘సర్కారువారి పాట’ సంక్రాంతికి పర్ఫెక్ట్‌ సినిమా. అయినా గౌరవంతో సమ్మర్‌కి షిఫ్ట్‌ చేసినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను..’’ అని రాజమౌళి ట్వీట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ అభిమానులు.. అంటేభీమ్లా నాయక్’ సంక్రాంతి సినిమా కాదని అంటున్నారా?. అసలు షూటింగే ఇంకా ఓ కొలిక్కి రాక వారు సినిమా వాయిదా వేసుకుంటే.. దానిని, దీనికి లింక్ చేస్తూ రాజమౌళి ట్వీట్ చేయడం ఏంటి? అనేలా వారు ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ‘‘ ‘పరిశ్రమ బాగుకోసం’ మా హీరో పవన్ కల్యాణ్ ఏదైనా చేస్తాడని మరోసారి నిరూపించాడు.. ఆయన సినిమా పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. రేపు ఆయన సినిమాకి మళ్లీ ఏపీ ప్రభుత్వం అడ్డుపడి.. ఇబ్బందులు సృష్టిస్తే ఒక్కరైనా మాట్లాడతారా? అప్పుడు ఒక్కరు కూడా బయటికి రారు. మీలాంటి వారి కోసం పవన్ కల్యాణ్ ఎందుకు త్యాగం చేయాలి..’’ అంటూ ‘భీమ్లా నాయక్’ వాయిదాపై కాస్త ఘాటుగానే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.   

Updated Date - 2021-12-22T03:21:32+05:30 IST