‘భీమ్లా నాయక్’ ట్రైలర్: నేనొస్తే కష్టం ‘వాడికి’!!

ABN , First Publish Date - 2022-02-22T02:42:54+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్. కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా..

‘భీమ్లా నాయక్’ ట్రైలర్: నేనొస్తే కష్టం ‘వాడికి’!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో సాగర్. కె. చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్‌ప్లే, సంభాషణలను సమాకూర్చారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ పవరేంటో తెలిపేలా ఉన్న ఈ ట్రైలర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనాలను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. 


మళయాలంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ ‘భీమ్లా నాయక్’ చిత్రం ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ నుండి ఒక మ్యూట్‌తో యు బై ఏ సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం 2గంటల 25 నిమిషాలు నిడివితో విడుదలవుతోంది. ఇది ఒరిజినల్ చిత్రం కంటే 30 నిమిషాలు తక్కువ. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ నిడివి 2గంటల 55 నిమిషాలు. అయ్యప్పన్ నాయర్‌గా చేసిన బిజు మీనన్ పాత్రలో పవన్ కల్యాణ్, కోషి కురియన్‌గా చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. పవన్, రానా పోటాపోటీగా ఈ సినిమాలో చేసినట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలిసిపోతుంది. ఇక సినిమా విడుదల తర్వాత బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయం అంటూ అప్పుడే అభిమానులు సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టారు.


ట్రైలర్ విషయానికి వస్తే.. ‘ఏంటి బాలాజీ స్పీడ్ పెంచావ్..’ అనే రానా డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. ‘ఇది పులులు తిరిగే ప్రాంతమట బాబు..’ అని రఘుబాబు చెప్పగా.. ‘పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ.. స్లోగానే పోనీయ్’ అనే డైలాగ్‌తో డానీ.. డానీయల్ శేఖర్‌గా రానాని రివీల్ చేస్తే.. ‘సర్హద్‌ భీమ్లానాయక్‌.. సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్‌ పోలీస్‌.. శ్రీశైలం తహసీల్దారు, హఠకేశ్వరం మండలం, ఆంధ్రప్రదేశ్‌’ అంటూ ‘భీమ్లా నాయక్’గా పవన్ పవర్ ఫుల్ ఎంట్రీని చూపించారు. ఆ తర్వాత రానా, పవన్‌ల మధ్య సీరియస్ సన్నివేశాలతో ట్రైలర్ నడిచింది. ‘ఒంటి మీద యూనిఫాం చూసుకుని పొగర్రా’ అనే రావు రమేష్ డైలాగ్, ‘ఏంటి నాయక్.. నువ్వు పేల్చినప్పుడు వాడు లోపల లేడా? చూసుకోవాలి కదా..’ అని నిత్యా మీనన్ చెప్పే డైలాగ్ ‘భీమ్లా నాయక్’ పవర్ ఏంటో తెలియజేస్తే.. ‘తోలు తీస్తా నా కొ..’ అంటూ ఎమోషనల్‌గా పవన్ చెప్పే డైలాగ్ ట్రైలర్ స్వరూపాన్నే మార్చేసింది. మధ్యలో సముద్రఖని డైలాగ్, రానా బుల్లెట్ డైలాగ్‌తో పాటు.. పవన్, నిత్యా మీనన్‌ల మధ్య వచ్చే కొన్ని ప్రేమ సన్నివేశాలు, భీమ్లా-డానీల పొగరు తెలిపేలా సన్నివేశాలను మిక్స్ చేశారు. ‘భీమ్లా నాయక్’ ఎవరనేది మురళీ శర్మ చెప్పే డైలాగ్‌తో పాటు, ‘నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..’ అని రానా చెప్పే డైలాగ్.. అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉన్నాయి. ఇక చివరిలో ‘నేను ఇవతల ఉంటేనే చట్టం, అవతలికి వస్తే కష్టం.. వాడికి’.. అని పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్‌తో పాటు, భీమ్లా-డానీలు లుంగీపై పోరాడుకునే సన్నివేశాలతో ట్రైలర్‌ని ముగించారు. మొత్తంగా 2 నిమిషాల 30 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేదిగా ఉంది కానీ.. మ్యూజిక్ పరంగా, ఎడిటింగ్ పరంగా మాత్రం మధ్యలో కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. అది తప్పితే ట్రైలర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉందని చెప్పుకోవచ్చు.

Updated Date - 2022-02-22T02:42:54+05:30 IST