పవిత్ర నా భార్యే..ఆధారాలున్నాయి: Suchendra Prasad

ABN , First Publish Date - 2022-07-03T16:07:23+05:30 IST

సీనియర్ నటుడు వీకే నరేష్ ( VK Naresh).. కన్నడ, తెలుగు చిత్రాలలో మంచి పాత్రలు పోషిస్తూ పాపులర్ అయిన నటి పవిత్ర లోకేష్ (Pavitha Lokesh) పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో

పవిత్ర నా భార్యే..ఆధారాలున్నాయి: Suchendra Prasad

సీనియర్ నటుడు వీకే నరేష్ ( VK Naresh).. కన్నడ, తెలుగు చిత్రాలలో మంచి పాత్రలు పోషిస్తూ పాపులర్ అయిన నటి పవిత్ర లోకేష్ (Pavitha Lokesh) పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో నరేష్, పవిత్రా లోకేష్ స్పందించి తమపై వస్తున్న ఆరోపణలపై మాట్లాడారు. ఇదే క్రమంలో తాజాగా పవిత్రా లోకేష్ భర్త సుచింద్రప్రసాద్ (Suchendra Prasad) స్పందించారు. ఈ వ్యవహారంపై ఏమన్నారో ఆయన మాటల్లోనే..


పవిత్ర లోకేష్, నరేష్ గురించి వైరల్ అవుతున్న న్యూస్ విన్నారా..?


మీడియా ద్వారానే నాకు ఈ విషయం తెలిసింది. మిత్రులు, శ్రేయోభిలాషులు కొందరు నా దృష్టికి తెచ్చారు.


సుచింద్రప్రసాద్, పవిత్ర లోకేష్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది?


పదహారు సంవత్సరాల పరిపూర్ణ దాంపత్యం. 1955 హిందూ చట్టం ప్రకారమే దంపతులయ్యాం. ఇందుకు ఆధారాలు కావాలంటే నా పాస్‌పోర్టులో  ఆమె భార్యగాను, తన పాస్‌పోర్టులో నేను భర్తగాను నమోదయ్యాయి. ఆధార్ కార్డులలో కూడా స్పష్టంగా ఉంది. ఎవరి కుట్ర, కుతంత్రాలతో ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. నావరకైతే చట్టబద్ధమైన వివాహ బంధం. వివాహ రిజిస్ట్రేషన్ మినహా అన్ని ఆధారాలు ఉన్నాయి. దానవసరం రాలేదు కాబట్టి చేయించుకోలేదు.


మీ ఇద్దరికి ఎలా పరిచయం అయ్యిందో చెప్తారా.?


మేమిద్దరం కళాకారులమే. పలు సినిమాలలో నటించడంతో పరస్పరం పరిచయం, ఆకర్షణ, ప్రేమ ఉద్భవించి దంపతులయ్యాం. ఇద్దరు మనసులు కలిశాక దగ్గరయ్యాం. నేనైతే హృదయపూర్వకంగా ఈ మాట చెబుతున్నా.


నరేష్ వైఫ్ కావాలనే మీ ఫ్యామిలీపై నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారా?


ఇది పూర్తిగా కొత్తగా వింటున్నా, నాకు వారి పేర్లు, సంబంధాల గురించి ఏమీ తెలియదు. వారెవ్వరో నిజంగా నాకు తెలియదు. వారు ఏఏ వృత్తుల్లో సంబంధాలు కలిగి ఉన్నారో స్పష్టత లేదు.


పవిత్ర లోకేష్ తో పెళ్లి అయ్యిందా? జస్ట్ లివింగ్ టు గెదర్‌లోనే ఉన్నారా?


నేను పక్కా సంప్రదాయవాదిని. ఈ సహజీవన పద్ధతిపై నాకు నమ్మకాలు లేవు. మేమిద్దరం గత 16 సంవత్సరాలుగా పవిత్ర దాంపత్యాన్ని గడుపుతున్నాం. కర్ణాటక ప్రజలందరికీ ఈ విషయం తెలుసు. సినీరంగంతో పాటు మఠాధిపతులు సైతం మా దంపతులను పలుమార్లు ఆశీర్వదించారు. హిందూ వివాహం చట్టాల ప్రకారమే వివాహం చేసుకున్నాం. ఆధార్ కార్డులలో సైతం మా భార్యాభర్తల వివరాలు ఉన్నాయి. ఆమె పాస్‌పోర్టులో భర్త అని నమోదైంది. నా పాస్‌పోర్టులో భార్య అని నమోదైంది.


లివింగ్‌లో ఉండి కూడా పిల్లలని కన్నా, మీ రిలేషన్ ఎక్కడ చెడింది?


ఆమెతో దాంపత్యజీవితం సంతోషంగా, సాఫీగా సాగింది. ఇందుకు సాక్ష్యంగా ఇద్దరు పిల్లలు. ఆదర్శదంపతులుగానే ఉన్నాం. ఆమె చెప్పిన కొన్ని విషయాలు గమనించా. ఆమెపై ఇప్పటికీ గౌరవం ఉంది. ఎవరో రెచ్చగొట్టిన కారణంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయని భావిస్తున్నా. పవిత్ర లోకేష్‌ను ఉద్దేశించి ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ పరిణామాలతో పవిత్ర మనసు నొచ్చుకుందన్న పరికల్పన నాకూ ఉంది. మిమ్మల్ని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేయదలిచా. ఇవన్నీ పూర్తిగా కల్పితాలు, ఈ మొత్తం పరిణామంపై బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా.


పవిత్ర లోకేష్ డబ్బు మనిషి అనే కామెంట్స్ చేశారు? అది ఎం తవరకూ నిజం?


ఇది చాలా సున్నితమైన అంశం. నేను వ్యాఖ్యానించిన సందర్భం వేరు. మీడియాలో వస్తున్న కథనాలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి.


నరేష్ మీకు వ్యక్తిగతంగా పరిచయం ఉందా? ఎప్పుడైనా కలిసారా?


వారెవ్వరో నాకు తెలియదు. వారి సంబంధాల గురించి కూడా నిజంగా నాకు తెలియదు. నేనెప్పుడు కర్ణాటక దాటి వెళ్లలేదు. కన్నడ సినిమా రంగం దాటి బయటకు వెళ్లలేదు. కాబట్టి నాకు తెలుగు సినిమా రంగానికి సంబంధించి పరిచయాలు లేవు.


పవిత్ర లోకేష్ క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేస్తున్నారు కదా, మరి ఈ విషయంలో నరేష్ గారిని జాగ్రత్తగా ఉండమని సలహా ఇస్తారా?


విచారకరమైన విషయం ఏమిటంటే మీడియా న్యాయస్థానం కాదు, న్యాయం చేకూర్చే విభాగాలు వేరే ఉన్నాయి. న్యాయస్థానాలలోనే తేలాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఇంకొకరి మనోభావాలను దెబ్బతీయడం, ఇంకొకరి పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరికాదు. మీడియా ఈ విషయంలో తన కర్తవ్యపాలన సరిగా చేసి ఉండాల్సి ఉంది. అప్పుడే మీడియా సంస్థలకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మనసుకు కలిగిన గాయాల నుంచి బయటపడడం అంత సులభం కాదని అందరికీ తెలిసిందే. మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా విన్నవించుకుంటున్నాను.


ఫైనల్‌గా సౌత్ ఇండియావైడ్ ట్రెండ్ అవుతున్న ఈ టాపిక్ ఎండ్ కార్డు ఎక్కడ? 


మీ వెర్షన్‌లో మీరు ఇది ఎలా క్లోజ్ చేస్తారు? మీడియా, సోషల్ మీడియా ఈ అసహజ పరిణామాలపై మాట్లాడడంనిలిపివేస్తే సమస్య దానంతటదే పరిష్కారమవుతుంది. 




Updated Date - 2022-07-03T16:07:23+05:30 IST