‘కేజీఎఫ్-2’ తోనే ల్యాండ్ అవుతానంటున్న ప్రభాస్

ABN , First Publish Date - 2022-04-07T22:00:12+05:30 IST

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2’. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కింది

‘కేజీఎఫ్-2’ తోనే ల్యాండ్ అవుతానంటున్న ప్రభాస్

రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన సినిమా ‘కేజీఎఫ్: చాప్టర్-2’. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కింది. యశ్ ఈ మూవీలో రాకీ భాయ్ అనే పాత్రలో కనిపించనున్నాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ‘కేజీఎఫ్: చాప్టర్-1’కు సీక్వెల్‌గా ‘చాప్టర్-2’ తెరకెక్కింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, రవీనా టండన్, సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్: చాప్టర్-2’ సినిమాతో ప్రభాస్ అభిమానులకు కానుక అందబోతున్నట్టు తెలుస్తోంది.  


ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా టీజర్‌ను ‘కేజీఎఫ్-2’తో విడుదల చేయనున్నారని బాలీవుడ్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘సలార్’ కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘కేజీఎఫ్’ను నిర్మించిన హోంబలే ఫిలింసే ‘సలార్‌’ను కూడా రూపొందిస్తుంది. ‘సలార్’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రభాస్ మోకాలికి గాయమైనట్టు బీ టౌన్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. దీంతో అతడు స్పెయిన్‌కు వెళ్లి సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం. కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న అనంతరం షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడని కథనాలు వెలువడుతున్నాయి. గతంలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’తో పాటే ‘సాహో’ టీజర్‌ను విడుదల చేశారు. అందుకే ‘సాహో’ బంపర్ ఒపెనింగ్స్‌ను సాధించింది.

Updated Date - 2022-04-07T22:00:12+05:30 IST