అల్లూరిపై అభూత కల్పనలు వద్దు.. ‘RRR’పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

ABN , First Publish Date - 2022-01-18T02:55:32+05:30 IST

అల్లూరి, కొమరం భీమ్‌లు కలిసినట్టు చరిత్రలో లేదని, అటువంటిది వీరిని కలిపి చిత్రంగా తీస్తుండడం భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు చరిత్రను భ్రష్టుపట్టించినట్టు అవుతుందని పడాల అభిప్రాయపడ్డారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన

అల్లూరిపై అభూత కల్పనలు వద్దు.. ‘RRR’పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

విశాఖపట్నం: విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని అల్లూరి యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ఆయన విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో చరిత్ర వక్రీకరణ జరిగిందని ఆయన ఈ ప్రకటనలో ఆరోపించారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన సీతారామరాజును బ్రిటీష్‌ పోలీసుగా చూపడం దారుణమని పేర్కొన్నారు. ఈ విషయమై సినిమా మేకర్స్‌పై సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని వివరించారు. 


అల్లూరి, కొమరం భీమ్‌లు కలిసినట్టు చరిత్రలో లేదని, అటువంటిది వీరిని కలిపి చిత్రంగా తీస్తుండడం భావితరాలకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు చరిత్రను భ్రష్టుపట్టించినట్టు అవుతుందని పడాల అభిప్రాయపడ్డారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాలోని కొన్ని ఘట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు కొంతమంది రాజమౌళి దృష్టికి తీసుకువెళ్లగా.. ‘ఇది కల్పిత కథ అని, స్వాతంత్య్ర పోరాటంలో ఆ మహా వీరులిద్దరూ కలిసి పోరాటం చేస్తే ఎలా వుంటుందనే కోణంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని’  ఆయన సమాధానం చెప్పడం తగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అల్లూరి చరిత్రను వక్రీకరిస్తూ తెరకెక్కించిన ఘట్టాలను తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-01-18T02:55:32+05:30 IST