Tollywood: హీరోయిన్ల డిమాండ్స్ చిట్టా... నిర్మాతల ప్యాకేజీ చిట్కా!

ABN , First Publish Date - 2022-08-23T22:13:24+05:30 IST

ప్రతీ నటీమణి వెనకాల వ్యక్తిగత సిబ్బంది పేరిట సుమారు ఆరు నుండి పది మంది వరకు వస్తున్నారు. వాళ్ళ ఖర్చులు సదరు నిర్మాతే భరిస్తున్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ పద్దతిని మార్చి, గుత్తంగా..

Tollywood: హీరోయిన్ల డిమాండ్స్ చిట్టా... నిర్మాతల ప్యాకేజీ చిట్కా!

ప్రతీ నటీమణి వెనకాల వ్యక్తిగత సిబ్బంది పేరిట సుమారు ఆరు నుండి పది మంది వరకు వస్తున్నారు. వాళ్ళ ఖర్చులు సదరు నిర్మాతే భరిస్తున్నాడు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆ పద్దతిని మార్చి, గుత్తంగా ప్యాకేజీ (ఇందులోనే వ్యక్తిగత సిబ్బంది జీతాలు కూడా)  ఇవ్వటానికి నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ ప్యాకేజీ విధానానికి ఆ నటీమణులు అంగీకరిస్తారో.. లేదో చూడాలి..


తెలుగు సినిమా బడ్జెట్ ఎలా తగ్గించాలి అన్న విషయం మీద మన తెలుగు నిర్మాతలు గత కొన్ని రోజుల నుండి మల్లగుల్లాలు పడుతున్నారు. ఎడతెగని చర్చల్లో తలమునకలౌతున్నారు. విశ్వసనీయంగా తెలిసిన విషయం ఏమంటే, నిర్మాతలు సినిమాల్లో నటిస్తున్న లీడ్ పెయిర్ అయిన నాయికా నాయకులకి రెమ్యూనరేషన్ ప్యాకేజీ‌లు ఇచ్చే ప్రతిపాదనలు చేస్తున్నారని తెలిసింది. హిందీ సీమల నుండి తెలుగు నేలకి వస్తున్న చాలామంది నటీమణులకు వాళ్ళ పారితోషికమే కాకుండా, వాళ్ళ వెంట వస్తున్న వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా సంబంధిత నిర్మాతలే భరించవల్సి వస్తోంది. ఈ విధంగా కూడా బడ్జెట్ తడిసి మోపెడైనట్టు భరించరానిదిగా అవుతోంది.


ఒక్కో నటీమణి (Heroine)కి కనీసం ఆరు నుంచి పది మంది వ్యక్తిగత సిబ్బంది వుంటారు. కొంతమంది నటీమణులైతే, వాళ్ళతో పాటుగా వాళ్ళ సిబ్బందికి కూడా తాము బస చేసిన హోటల్‌లోనే పక్కనే ఇంకో రూమ్‌లో ఉంచాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే ఈ నటీమణి ప్రయాణం చేసేటప్పుడు తనతో పాటు వ్యక్తిగత సిబ్బంది‌కి కూడా బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని పట్టుబడుతున్నారు. ఇలాంటి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి తలప్రాణం తోక కొస్తుందని నిర్మాతలు (Producers) వాపోతున్నారు.


ఈ విధానానికి విరుగుడుగా ప్యాకేజీ మంత్రం వేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ‘ప్యాకేజీ రూపంలో సినిమాకి ఇంత పారితోషికం అని గుండుగుత్తంగా ఇచ్చేస్తాం, అందులో నుంచే వ్యక్తిగత సిబ్బంది జీతభృత్యాలు, వసతి సదుపాయాల వ్యయాలు కూడా ఆ నటీమణులే చూసుకోవల్సి ఉంటుంది’ అని ప్రతిపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా చేయడం వల్ల ఇక ఆ అధిక భారం నిర్మాత మీద పడబోదు. దానికి తోడు ఒత్తిడి కూడా తగ్గుతుంది.


మన తెలుగు సినిమా రంగంలో హీరోయిన్లు- రకుల్, తమన్నా, కియారా అద్వానీ, మృణాల్ ఠాకూర్, రష్మిక, పూజ హెగ్డే, లావణ్య త్రిపాఠి ఇంక చాలామంది పర భాష నుండి వచ్చిన వారే. కొత్త ప్యాకేజీ (package) ప్రతిపాదనతో నిర్మాతలు వస్తే ఈ నటీమణులు ఒప్పుకుంటారా, లేదా, సినిమా తిరస్కరిస్తారా? అన్న విషయం ముందు ముందు చూడాలి. ఏదిఏమైనా, ఇంకా ప్రతిపాదన స్థాయిలోనే ఉన్న ఈ ప్యాకేజీ విషయం మీద అధికారికంగా సమాచారం రావల్సి ఉంది. (Tollywood)

Updated Date - 2022-08-23T22:13:24+05:30 IST