P Sushila: ఘంటసాల పురస్కారంతో జన్మ ధన్యం

ABN , First Publish Date - 2022-08-14T16:37:08+05:30 IST

అమరగాయకుడు ఘంటసాల పురస్కారంతో తన జన్మ ధన్యమైందని ప్రఖ్యాత నేపథ్య గాయని పద్మభూషణ్‌ పీ సుశీల(P Sushila) పేర్కొన్నారు.

P Sushila: ఘంటసాల పురస్కారంతో జన్మ ధన్యం

                                   - ప్రముఖ గాయని పి సుశీల 


బెంగళూరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అమరగాయకుడు ఘంటసాల పురస్కారంతో తన జన్మ ధన్యమైందని ప్రఖ్యాత నేపథ్య గాయని పద్మభూషణ్‌ పీ సుశీల(P Sushila) పేర్కొన్నారు. బెంగళూరు తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలోని శ్రీకృష్ణ దేవరాయ కళామందిరంలో శనివారం ఆమెకు ఘంటసాల పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కన్నడ, తెలుగు ప్రజలు తోబుట్టువులని అభివర్ణించారు. అన్ని భాషల ప్రజలు తనను గౌరవించి ఆదరించారన్నారు. 12 భాషల్లో పాటలు పాడానని, ప్రేక్షకుల అభిమానమే తనకు ఊపిరిగా ఉందన్నారు. ఇదే సందర్భంగా పీ సుశీల స్వాతంత్య్ర అమృత మహోత్సవాల సందర్భంగా జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ప్రముఖ కన్నడ నటుడు దివంగత డాక్టర్‌ రాజ్‌కుమార్‌, తాను ఒకేసారి రఘుపతి వెంకటరత్నం(Raghupathi Venkataratnam) పురస్కారాన్ని స్వీకరించినట్టు గుర్తు చేసుకున్నారు. లవకుశ, భక్తప్రహ్లాద చిత్రాల్లోని పాటలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయన్నారు. ఘంటసాల తనకు గురువు, దైవం లాంటివారని ఆయన ఆశీస్సులతో తాను ఈ స్థితికి వచ్చానన్నారు. 90వ వడిలోకి ప్రవేశిస్తున్నా ఇంకా పాడాలనే తపన తగ్గలేదన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత చంద్రశేఖర కంబార మాట్లాడుతూ ఉత్తరాదిన లతా మంగేష్కర్‌, దక్షిణాదిన పీ సుశీల సంగీతసామ్రాజ్యంపై చెరగని ముద్ర వేశారని ప్రశంసలు గుప్పించారు. కన్నడ భాషా సంస్కృతుల వారధిగా డాక్టర్‌ ఏ రాధాకృష్ణరాజు అందిస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతకుముందు సమితి అధ్యక్షుడు డాక్టర్‌ రాధాకృష్ణరాజు మాట్లాడుతూ ఘంటసాలతో కలసి వందలాది పాటలు పాడిన పి సుశీలను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక చేశామన్నారు. ఈ సందర్భంగా సుశీల కొన్ని తెలుగు, కన్నడ(Telugu, Kannada) పాటలను ఆలపించారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షుడు కే గంగరాజు, ప్ర ధాన కార్యదర్శి ఇడమకంటి లక్ష్మిరెడ్డి, కోశాధికారి సీఏ వరదరాజు, సంయుక్త కార్యదర్శి చంద్రమోహన్‌, మహిళా కార్యదర్శి లక్ష్మీ శరత్‌, కార్యవర్గ సభ్యులు జీ రమణ బాబు, ఉమాపతి నాయుడు, కేఎన్‌ నరసింహమూర్తి, కృష్ణమనాయుడు, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై భాస్కరుని సత్యజగదీశ్‌ రాసిన మన ఘంటసాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. నవీన్‌, ధనలక్ష్మి బృం దం గానలహరి సాగింది. ఇందులో ఘంటసాల, పీ సుశీల హిట్‌గీతాలను బృందం ఆలపించింది. 

Updated Date - 2022-08-14T16:37:08+05:30 IST