‘బాహుబలి’ మ్యాజిక్... ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2’... ఎందుకు రిపీట్ చేయలేకపోయాయి?

ABN , First Publish Date - 2022-04-25T22:34:21+05:30 IST

‘బాహుబలి 1’తో మొదలై ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో ఇంకా కొనసాగుతోన్న ట్రెండ్... ప్యాన్ ఇండియా మూవీస్! అయితే, ఒకేసారి అయిదారు భాషల్లో విడుదలయ్యే ఈ ఆలిండియా మూవీస్ నిజంగా వర్కవుట్ అవుతున్నాయా? కేవలం ప్రచార ఆర్భాటమే మిగులుతోందా? వందల కోట్లు ఖర్చు చేసి తీస్తోన్న మల్టీ స్టారర్, మల్టీ లాంగ్వేజ్ మూవీస్ రాబడి ఎంత? రాను రాను ప్యాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతోందా? తగ్గుతోందా?

‘బాహుబలి’ మ్యాజిక్... ‘ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2’... ఎందుకు రిపీట్ చేయలేకపోయాయి?

‘బాహుబలి 1’తో మొదలై ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో ఇంకా కొనసాగుతోన్న ట్రెండ్... ప్యాన్ ఇండియా మూవీస్! అయితే, ఒకేసారి అయిదారు భాషల్లో విడుదలయ్యే ఈ ఆలిండియా మూవీస్ నిజంగా వర్కవుట్ అవుతున్నాయా? కేవలం ప్రచార ఆర్భాటమే మిగులుతోందా? వందల కోట్లు ఖర్చు చేసి తీస్తోన్న మల్టీ స్టారర్, మల్టీ లాంగ్వేజ్ మూవీస్ రాబడి ఎంత? రాను రాను ప్యాన్ ఇండియా చిత్రాల క్రేజ్ పెరుగుతోందా? తగ్గుతోందా? 


రాజమౌళి ‘బాహుబలి’ రూపంలో ఇండియన్ బాక్సాఫీస్‌కి కొత్త థ్రిల్‌ని అందించాడు. దేశం మొత్తం ఎగబడి బాక్సాఫీస్ ముందు క్యూలు కట్టేలా చేశాడు. ‘బాహుబలి’ తరువాత ‘బాహుబలి’ పార్ట్ 2తో మరింత దుమారం రేపాడు. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న జాతీయ చర్చగా మారిపోయింది. దాంతో ‘బాహుబలి, బాహుబలి 2’ రెండు సినిమాలు కలిపి వేల కోట్లు వసూలు చేసి భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలుకొట్టాయి. కానీ, ఆ తరువాత ‘కేజీఎఫ్’ను మినహాయిస్తే మరే ప్యాన్ ఇండియన్ మూవీ కూడా ఆశించినంత అద్భుతం సాధించలేకపోయింది. చివరికి జక్కన్నే దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా ‘బాహుబలి’ని బీట్ చేయలేకపోయింది! 


‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ప్రస్తుతం భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అయినా యశ్ స్టారర్ మాస్ యాక్షనర్ కూడా ‘బాహుబలి’ ఫ్రాంఛైజ్‌కి దరిదాపుల్లో కూడా లేదు. ‘కేజీఎఫ్ 2’ కన్నడ మార్కెట్లో ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేదని చెబుతున్నారు. హిందీలో మాత్రం సూపర్ కలెక్షన్స్ సాధిస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ కూడా కరోనా అనంతర కాలంలో థియేటర్లకు కొత్త ఊపునిచ్చింది. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా మాత్రం చరిత్రలో నిలువలేదు. వీటి సంగతే ఇలా ఉంటే ‘రాధేశ్యామ్’ లాంటి మల్టీ లాంగ్వేజ్ సినిమాలు ప్యాన్ ఇండియా ట్యాగ్ వేసుకొచ్చినా ఎంత మాత్రం అలరించలేకపోయాయి. ఈ పరిణామానికి కారణం ఏంటి? 


‘బాహుబలి’ సినిమాల విషయంలో వర్కవుట్ అయిన మ్యాజిక్ తరువాతి చిత్రాలకు వీలుకాకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. అప్పట్లో కరోనా మహమ్మారి ఎవ్వరికీ తెలియదు. జనం మూడ్ వస్తే థియేటర్‌కు వచ్చేసేవారు. అంతే కాదు, ప్రస్తుతం పెట్రోల్ మొదలు వంట నూనె వరకూ అన్నిటి ధరలు మండిపోతున్నాయి. సో... ఆడియన్స్ జేబుల్లో సినిమా కోసం మిగులుతోన్న డబ్బులు చాలా తక్కువ. అవి కూడా విపరీతంగా పెరిగిపోతోన్న టికెట్ రేట్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంత మాత్రం సరిపోవటం లేదు. ఎటొచ్చీ భారీ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాలు, ప్యాన్ ఇండియా మూవీస్... ఎవరు చూస్తున్నారంటే... హార్డ్‌కోర్ ఫ్యాన్స్. వారితోబాటూ వీకెండ్‌లో తప్పకుండా సినిమాకు వెళ్లాలనే కోరిక ఉన్న మూవీ అండ్ థియేటర్ లవ్వర్స్ మాత్రమే... 


కరోనా కలకలం తగ్గిపోయాక జనం మళ్లీ పెద్ద తెర ముందుకొస్తున్నారు. హౌజ్‌ఫుల్ బోర్డ్‌లు కనిపిస్తున్నాయి. అయినా కూడా 2020, 2021 సంవత్సరాలు లాక్‌డౌన్స్ కాలంలో... ఓటీటీల్ని చాలా మంది నట్టింట్లోకి, నెట్టింట్లోకి తీసుకొచ్చేశాయి. ఈ ఓటీటీ ట్రెండ్ కూడా ‘వందల కోట్ల బడ్జెట్ చిత్రాల’కు కలెక్షన్స్ తగ్గిస్తోందని మనం భావించవచ్చు. ఎలాగంటే, అనేక కారణాల వల్ల థియేటర్‌కు వద్దనుకున్న వారు ప్రస్తుతం ఎంతటి క్రేజీ చిత్రమైనా నెల తరువాత ఓటీటీలో అందుబాటులోకి వస్తుందిలే అనుకుంటూ వేచి చూస్తున్నారు. మల్టీప్లెక్సుల్లో అధిక ధరలు పెట్టటం ఇష్టం లేనివారు, మరీ అంతగా హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కాని వారు ఎంత మాత్రం తొందరపడటం లేదు. అందుకే, ‘బాహుబలి’, ‘బాహుబలి 2’కి వచ్చినంత సూపర్ ఎగ్జైట్మెంట్ తాజా ప్యాన్ ఇండియా చిత్రాలకు రావటం లేదు. ‘బాహుబాలి’ బాక్సాఫీస్ వార్ సమయంలో ఓటీటీలు ఇంతగా జనంలోకి రాకపోవటం మనం గుర్తుంచుకోవాలి!


ఓటీటీలు పరోక్షంగా బిగ్ మూవీస్ బాక్సాఫీస్ వసూళ్లు ప్రభావితం చేస్తున్నాయా? ప్రస్తుతానికి కొంత వరకూ అవుననే చెప్పుకోవాలి. కాకపోతే, సినిమా మరీ బావుంటే జనం తప్పకుండా టికెట్ కౌంటర్ వద్ద క్యూ కడతారు. ‘ద కాశ్మీర్ ఫైల్స్’ లాంటి చిన్న సినిమా అదే నిరూపించింది. కానీ, ‘బాహుబలి, ద కాశ్మీర్ ఫైల్స్’ లాంటి మ్యాజిక్ వెంటవెంటనే రిపీట్ కాదు. సో... ఓటీటీ... బిగ్ స్క్రీన్ తరువాత ‘నెక్ట్స్ బెస్ట్ థింగ్’ ఆల్రెడీ అయిపోయిందని మనం ఒప్పుకోక తప్పదు!     

Updated Date - 2022-04-25T22:34:21+05:30 IST