ఓటీటీ... కాపాడుతోందా? కాటేస్తోందా?

ABN , First Publish Date - 2022-07-24T08:11:44+05:30 IST

లాక్‌ డౌన్‌ రోజుల్లోకి ఒకసారి వెళ్దాం. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు బంద్‌. చేతిలో సినిమా సిద్ధంగా ఉన్నా... విడుదల చేసుకోలేని పరిస్థితి.

ఓటీటీ... కాపాడుతోందా? కాటేస్తోందా?

కరోనాకు ముందు - ఆ తరవాత... చిత్రసీమ చాలా మారిపోయింది. ఊహించని మార్పులొచ్చాయి. వాటిలో కొన్ని మేలు చేసేవి. ఇంకొన్ని ‘సినిమా’ ఉనికినే ప్రశ్నించేవి. నిన్నా మొన్నటి వరకూ ఓటీటీని ఓ కల్ప తరువు అనుకొనేవాళ్లు కూడా.. ఇప్పుడు దాన్ని ఓ భూతంలా చూస్తున్నారు. ఓటీటీ దూకుడు ఆపాలని కళ్లేలు సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఓటీటీ చిత్రసీమని కాపాడుతోందా? కాటేస్తోందా?


లాక్‌ డౌన్‌ రోజుల్లోకి ఒకసారి వెళ్దాం. షూటింగులు ఆగిపోయాయి. థియేటర్లు బంద్‌. చేతిలో సినిమా సిద్ధంగా ఉన్నా... విడుదల చేసుకోలేని పరిస్థితి. జనాలకు కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు. ఈ దశలో ఓటీటీ రూపంలో వినోదానికి వేదిక దొరికింది. రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సినిమాల్ని మంచి రేటుకి కొనేసింది. దాంతో థియేటర్లలో చూడాల్సిన సినిమాని ఇంటి పట్టునే చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కింది. అదే సమయంలో విడుదల అవుతుందా, లేదా? అంటూ బెంగపెట్టుకొని, పెరుగుతున్న వడ్డీ రేట్లు చూసి హడలిపోతున్న నిర్మాతలకు అభయహస్తం దొరికినట్టైంది. దాదాపు యేడాది పాటు థియేటర్లు తెరచుకోలేదు. ఆ సమయంలో ఓటీటీనే పెద్ద దిక్కయిపోయింది. ఓటీటీలో వచ్చిన సినిమాలు హిట్టయ్యాయా? ఓటీటీ సంస్థలకు ఆదాయాన్ని తెచ్చి పెట్టాయా? అనేది పక్కన పెడితే.. థియేటర్‌ కాకుండా సినిమాలకు మరో వేదిక ఉందన్న సంకేతాల్ని కరోనా కాలం గట్టిగా పంపగలిగింది.


ఓటీటీలు వచ్చిన కొత్తలో.. వెబ్‌ సిరీస్‌లే వాటికి కంటెంట్‌ సోర్స్‌. సినిమా విడుదలైన రెండు నెలలకు ఓటీటీలో ప్రదర్శించుకొనే వీలు ఉండేది. శాటిలైట్‌ హక్కులతో పోలిస్తే, ఓటీటీల ద్వారా వచ్చే ఆదాయం తక్కువే ఉండేది. అయితే సినిమాను ప్రధానమైన కంటెంట్‌గా భావించిన ఓటీటీ సంస్థలు కొత్త సినిమాల్ని, స్టార్‌ చిత్రాల్ని పెద్ద సంఖ్యలో కొనడం మొదలెట్టాయి. ఎప్పుడైతే లాక్‌ డౌన్‌ విధించారో, దానివల్ల థియేటర్లు మూతబడ్డాయో.. ఆ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొన్నాయి. లాక్‌ డౌన్‌ సమయంలో నిర్మాతలు గందరగోళానికి గురయ్యారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో, అసలు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయో లేదో అనే అనుమానం. మరోవైపు సినిమా కోసం చేసిన అప్పులు, వాటిని వెంటాడే వడ్డీలూ.. వీటి భయం. దాంతో... ఓటీటీలకు సినిమాని అమ్ముకోవాల్సిన అవసరం ఏర్పడింది. అప్పట్లో ఓటీటీలకు భారీ మొత్తానికే సినిమాల్ని కొన్నాయి. ఓరకంగా చెప్పాలంటే ఓటీటీలకు అమ్ముకోవడం వల్ల ఏ నిర్మాతా నష్టపోలేదు. పైగా టేబుల్‌ ప్రాఫిట్‌తోనే సినిమాల్ని అమ్ముకొన్నారు. దాంతో ఓటీటీలపై నిర్మాతలకు ఓ భరోసా ఏర్పడింది. భవిష్యత్తులో తమ సినిమాని థియేటర్లలో విడుదల చేసుకొనే అవకాశం లేకపోయినా, ఓటీటీలో ఆ సౌలభ్యం ఉంటుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ తరవాత పరిస్థితులు అనుకూలించి, థియేటర్లు తెరుచుకొన్నప్పటికీ ఓటీటీల దూకుడు తగ్గలేదు. కేవలం ఓటీటీలకు అమ్ముకోవడానికే కొన్ని 


సినిమాలు తయారయ్యాయి. వాటితో నిర్మాతలు తాత్కాలికంగా లాభపడిన మాట వాస్తవం. కాకపోతే... అక్కడే పొంచి ఉన్న ముప్పు, పరోక్షంగా ఏర్పడే నష్టాన్ని ఎవరూ అంచనా వేయలేకపోయారు.


లాక్‌ డౌన్‌ సమయంలో ఇంట్లోనే కూర్చుని, అన్ని రకాల సినిమాల్ని, అన్ని భాషల సినిమాల్నీ తక్కువ డబ్బుతో చూడడం ప్రేక్షకులకు అలవాటైపోయింది. అన్ని ఓటీటీ ఛానళ్లూ కలిపి యేడాదికి రూ.3 వేలకు మించి సబ్‌స్ర్కిప్షన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మూడు వేలకు ఇంటిల్లిపాదీ హాయిగా... సినిమాల్నీ, వెబ్‌ సిరీస్‌లనూ చూసేయొచ్చన్నమాట. దాంతో వినోదం చాలా చవకైపోయింది. థియేటర్‌కి వెళ్లి, సినిమా చూస్తే ఎంత అవుతుంది? అదే ఓటీటీలమీద ఆధారపడితే ఎంత మిగులుతుంది? అనే లెక్కలు సగటు ప్రేక్షకులు వేసుకొంటున్నాడు. వాళ్లకు ఓటీటీనే బెస్ట్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు థియేటర్లు బోసిబోతున్నాయి. ఓటీటీల నుంచి చూపు మరల్చి, థియేటర్ల వైపు ప్రేక్షకుడ్ని రప్పించడం నిర్మాతలకు తలకుమించిన పని అవుతోంది. అందుకే టికెట్‌ రేట్లు తగ్గించడం మొదలెట్టారు. కానీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఈమధ్య టాలీవుడ్‌లో ఏ సినిమాకీ సరైన వసూళ్లు రావడం లేదు. థియేటర్లు నిండడం లేదు. స్టార్‌ హీరో సినిమాని సైతం లైట్‌గా తీసుకొంటున్నారు ప్రేక్షకులు. దానికి కారణం.. ఓటీటీలకు అలవాటు పడిపోవడమే. ‘మరో రెండు వారాలు ఆగితే... ఎంచక్కా ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా’ అన్నది ప్రేక్షకుల ఆలోచన. సినిమా విడుదలైన రెండు మూడు వారాలకే ఓటీటీలో ప్రదర్శించడం.. పెద్ద తప్పుగా కనిపిస్తోంది. అందుకే నిర్మాతలంతా ఈ విషయంపై ఒక్క మాటకు వచ్చారు. కనీసం పది వారాల వరకూ ఓటీటీలో సినిమాని ప్రదర్శించకూడదన్న నిర్ణయం తీసుకొన్నారు. ఇది ఓరకంగా కాస్తో కూస్తో మేలు చేసేదే. అయితే దానికి ఓటీటీ సంస్థలు ఎంత వరకూ ఒప్పుకొంటాయి? అనేది అసలు ప్రశ్న. ఎందుకంటే.. ఓ సినిమాని భారీ రేటుకి కొంటున్నప్పుడు, ఓటీటీ సంస్థలు ఈ నిబంధనకు ఒప్పుకోవు. అలాంటప్పుడు ఇంత రేటు పెట్టి మీ సినిమాని ఎందుకు కొనాలి? అనే ప్రశ్న ఎదురు కావొచ్చు. ఓటీటీల ద్వారా వచ్చే నిర్మాతలకు వచ్చే నికరమైన ఆదాయానికి గండి పడినట్టు అవుతుంది. ఇలాంటి షరతులు పెడితే.. సినిమాల్ని కొనడానికి ఓటీటీలు ముందుకొచ్చే అవకాశం కనిపించడం లేదు. సినిమా విడుదలకు ముందే వాటి ఫలితంతో సంబంధం లేకుండా ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అవుతోంది. అదే పది వారాల నిబంధన ఉంటే మాత్రం సినిమా విడుదలైన తరవాత, ఫలితం చూసి, అప్పుడు ఆ సినిమాని కొనే పరిస్థితి మొదలవుతుంది. ఓరకంగా.. అది కూడా నిర్మాతలకు నష్టాన్ని చేకూర్చేదే. 


సినిమాలో దమ్ము ఉంటే ఎన్ని ఓటీటీలు అందుబాటులో ఉన్నా, జనాలు థియేటర్లకు వస్తారు. ‘కేజీఎఫ్‌’, ‘పుష్ప’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’.. ఈ సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు తరలి వచ్చారు. సినిమాలో దమ్ము లేకపోతే మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరు. ఈ నిజాన్ని నిర్మాతలు గ్రహించాలి. ఈ యేడాది థియేటర్లో విడుదలై, ఫ్లాపయిన సినిమాలన్నీ.. కథా పరంగానో, నిర్మాణ పరంగానో బలహీనమైనవి. వాటిని ఒప్పుకొని తీరాల్సిందే. జనాలు థియేటర్లకు రావడం లేదంటే, నిందని ఓటీటీల మీద వేసేయడం సరికాదు. సినిమాలో నాణ్యత ఉందా, లేదా? అనే విషయం చూసుకోవాల్సిన అవసరం నిర్మాతలపై ఉంది.

Updated Date - 2022-07-24T08:11:44+05:30 IST