Will Smith : నేను హద్దు మీరాను... నేను చేసింది తప్పు...

ABN , First Publish Date - 2022-03-29T23:51:56+05:30 IST

94వ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఎప్పటిలాగా ఈసారి చర్చంతా విజేతల గురించి సాగటం లేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన క్రిస్ రాక్ గురించే జనం మాట్లాడుకుంటున్నారు. అతడ్ని అందరూ చూస్తుండగా వేదిక మీద చాచి చెంపదెబ్బ కొట్టిన విల్ స్మిత్....

Will Smith : నేను హద్దు మీరాను... నేను చేసింది తప్పు...

94వ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే, ఎప్పటిలాగా ఈసారి చర్చంతా విజేతల గురించి సాగటం లేదు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన క్రిస్ రాక్ గురించే జనం మాట్లాడుకుంటున్నారు. అతడ్ని అందరూ చూస్తుండగా వేదిక మీద చాచి చెంపదెబ్బ కొట్టిన విల్ స్మిత్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు. కాకపోతే, తాను చేసిన తప్పుని తెలుసుకున్న ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ 24 గంటల్లోనే ‘సారీ’ చెప్పేశాడు... 


విల్ స్మిత్ భార్య జాడా పింకెట్. ఆమెకు అలోపేసియా అనే వ్యాధి ఉంది. దాని వల్ల తలపై జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. అందుకే, మిసెస్ విల్ స్మిత్ తలపై వెంట్రుకలు లేకుండా బాల్డ్ హెడ్‌తోనే అకాడమీ అవార్డ్స్ వేడుకకి హాజరైంది. తన లుక్స్ గురించి ఆస్కార్స్‌ని హోస్ట్ చేస్తోన్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ చేశాడు. అది కాస్తా విల్ స్మిత్‌కి నచ్చలేదు. తన భార్య వ్యాధిని కూడా హాస్యానికి వాడుకోవటం ఆగ్రహం తెప్పించింది. వెంటనే వేదిక మీదకి వెళ్లి చెంప ఛళ్లుమనిపించాడు!


ఆస్కార్స్ వేడుక మొత్తానికి... ఇప్పుడు క్రిస్ రాక్‌ని విల్ స్మిత్ కొట్టటమే పెద్ద హైలైట్‌గా మారింది. అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే, అత్యధికులు మాత్రం విల్ స్మిత్ ప్రవర్తనని తప్పుబడుతున్నారు. ఎదుటి వ్యక్తి మాట్లాడింది నచ్చకపోతే భౌతిక దాడికి దిగటం సరికాదంటున్నారు. ఇదంతా గమనిస్తూనే ఉన్న స్మిత్ త్వరగానే తేరుకున్నాడు. ఒక్క రోజు తేడాలోనే ‘సారీ’ చెప్పేశాడు. తన సొషల్ మీడియా అకౌంట్లో ‘‘క్రిస్, నేను నీకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నాను. నేను హద్దు మీరాను. నేను చేసింది తప్పే...’’ అంటూ సూటిగా, స్పష్టంగా, బేషరతుగా నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. విల్ స్మిత్ తాను కొట్టిన క్రిస్ రాక్‌కే కాకుండా ఆస్కార్స్ నిర్వాహకులకి, అతిథులకి, ప్రపంచ వ్యాప్తంగా వీక్షించిన ప్రేక్షకులకి కూడా ‘సారీ’ చెప్పేశాడు. తన ప్రవర్తన పట్ల తాను సిగ్గుపడుతున్నట్టు ప్రకటించాడు! చూడాలి మరి, ఈ క్షమాపణలతో ‘చెంపదెబ్బ’ రచ్చ ఇక ముగిసినట్టేనో లేదో...              

Updated Date - 2022-03-29T23:51:56+05:30 IST