Pawan Kalyan: ఒక్కసారి పవన్ కళ్యాణ్‌ని కలిస్తే.. ఆయన అభిమాని అయిపోతాం

ABN , First Publish Date - 2022-09-02T22:45:57+05:30 IST

సర్దార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh) అనే సినిమాకి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనే కథ అందించడమే కాకుండా, దాని నిర్మాతల్లో ఒకరుగా కూడా ఉన్నారు. ఆ సినిమా కోసం చాలా..

Pawan Kalyan: ఒక్కసారి పవన్ కళ్యాణ్‌ని కలిస్తే.. ఆయన అభిమాని అయిపోతాం

-సురేష్ కవిరాయని

సర్దార్ గబ్బర్ సింగ్ (Sardaar Gabbar Singh) అనే సినిమాకి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తనే కథ అందించడమే కాకుండా, దాని నిర్మాతల్లో ఒకరుగా కూడా ఉన్నారు. ఆ సినిమా కోసం చాలా సంవత్సరాల విరామం తరువాత.. పవన్ కళ్యాణ్ మీడియా వాళ్ళని కలవటం జరిగితే, అందులో నేను ఒకడిని. అదే మొదటి సారి నేను ఆయనని ఇంటర్వ్యూ చేయడం. నాకు ఉదయం 9 గంటలకు అని చెప్పారు, నేను లేట్ అవకుండా ఉండాలని ఒక పావుగంట ముందే వెళ్లి కూర్చున్నా. ఇంకో 5 నిముషాల తర్వాత కళ్యాణ్ గారు వచ్చారు. కూర్చున్న నన్ను చూసి, ‘అయ్యో సారీ.. నేను లేట్‌గా వచ్చాను’ అన్నారు. అదేంకాదని నాకు 9 గంటలు అనే చెప్పారని, నేను కావాలనే ముందు వచ్చాననీ చెప్పాను. “అయితే నేను కూడా ముందుగా వచ్చేవాడిని కదా..” అన్నారాయన బదులుగా. ఎందుకంటే ఆయనకి ఎవరినైనా వెయిట్ చేయించటం ఇష్టం లేదు. అది ఆయన మనస్తత్వం.


పవన్ కళ్యాణ్ గురించి మనం ఏదేదో వింటాం బయట. కళ్యాణ్ ఇలా చేస్తారు, అలా చేస్తారు, తిక్క వుంది, అతనికి ఏమి తెలీదు, ఇంకా ఏవేవో అంటూ వుంటారు. కానీ ఒక్కసారి పవన్‌తో మాట్లాడితే మాత్రం ఎవరైనా ఆయనకి అభిమాని (Fan) అయిపోవాల్సిందే. అంతటి ఉన్నతమైన వ్యక్తి, ఏమాత్రం భేషజం లేకుండా, అతి సామాన్యంగా వుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే.. ఆయన రూమ్‌లోకి వెళ్ళగానే, తానే కిటికీరెక్కలు, కర్టెన్లు తీసి, కిటికీలు ఓపెన్ చేస్తారు. నాతో సుమారుగా ఒక అయిదారు గంటలు మాట్లాడారు. తన చిన్నప్పటి నుండి ఎలా పెరిగారు, ఎలాంటి వాతావరణం ఉండేది, సమాజంలో జరుగుతున్న, చూసిన కొన్ని సంఘటనలకు ఎంత బాధ పడేవారో... అప్పట్లో ఏమి చేయలేని నిస్సహాయస్థితి... అని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచే సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఆయనది. ఏమి చేయాలో ఆలోచిస్తారు, తదనుగుణంగా రియాక్ట్ కూడా అవుతారు. అదీ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం.


కొద్ది సమయం తర్వాత “ఏ సి వేసుకుందాం” అని తానే మళ్ళీ కిటికీ తలుపులు మూసి, కర్టెన్స్ వేసి, ఏసి ఆన్ చేశారు. మధ్య మధ్యలో తానే ‘కాఫీ తాగుతారా’ అని అడిగి,  బయటకి వెళ్లి కుర్రాడితో ‘కాఫీ తీసుకురా’ అని చెప్పారు. ఆ కుర్రాడు కాఫీ తీసుకురాగానే తనే మధ్యలో ఆ ప్లేట్ అందుకొని, నాకు తనే కాఫీ ఇచ్చారు. అంత పెద్ద స్టార్ అయి ఉండి.. మన ముందు ఒక సామాన్యుడిలా, మన ఇంట్లో మనిషిలా ఉండటం నిజంగా ఆశ్చర్యం వేసింది. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అలానే వుంటారు, మారరు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావటానికి కూడా తన చిన్నప్పటి నుండి విరివిగా చదివిన  పుస్తకాలు, అవి అందించిన ప్రగతి శీలక భావాలే కారణం.


‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) అనే సినిమా చేయడం పవన్ కళ్యాణ్‌కి ఇష్టం లేదట. హిందీలో ఆ సినిమా (దబాంగ్) అంత పెద్ద హిట్ అయింది అంటే అది కేవలం సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇమేజ్ వల్లే.. అతని పర్సనాలిటీకి సరిపోయే విధంగా ఆ క్యారెక్టర్ ఉండటం. తెలుగులో చేయాలంటే.. చాలా మార్పులు చేయాలని చెప్పి.. ఆ సినిమా చేయనని మొదట చెప్పారు. ఆ సినిమాకి ముందు పవన్ కళ్యాణ్ అప్పుల్లో వున్నారు. దానికి తోడు అన్నయ్య నాగబాబు (Nagababu) ఒక సినిమా నిర్మాణం చేసి డబ్బులు చాలా పోగొట్టుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ ఫైనాన్షియల్ గ్యారంటీ‌గా  వున్నారు, అందుకని ఆ నష్టం కూడా పూడ్చాలి. అందుకే.. ఇక చేసేది లేక ‘దబాంగ్’ హిందీ సినిమా మళ్ళీ చూశారు. ‘గబ్బర్ సింగ్’ అని పేరు పెట్టి మన తెలుగు వాళ్లకి అనువుగా మొత్తం కథని మార్చటం జరిగింది. అలా ఆ సినిమా పెద్ద హిట్టయింది.


ఏమీ దాచుకోకుండా, నిర్మొహమాటంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఒక సామాన్య వ్యక్తిలానే మాట్లాడటానికి, ఉండటానికి ఇష్టపడతారు. ఆయనతో మాట్లాడుతుంటే కాలం కూడా తెలియదు. సుమారు అయిదారు గంటలు మాట్లాడాక, అప్పుడు నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. మధ్య మధ్యలో అతని మేనేజర్ వచ్చి మిగతా వాళ్ళకి కూడా ఇంటర్వూస్ చెప్పాం అంటే, “మేము ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేదు వేణూ, మాట్లాడుతూనే వున్నాం” అని ఆయన్ని వెనక్కి పంపేవారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘సినిమాలకి, రాజకీయాలకి ఎక్కువ రోజులు కేటాయించాలి. ఈ విషయంలో నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు మా అమ్మగారికి నచ్చవు. కానీ ఆమెని సంతోషంగా ఉంచటానికే నేను ఎక్కువ ప్రయత్నిస్తాను..’’ అంటూ.. సినిమా అనేది తన జీవితంలో ఒక చిన్న పార్ట్ మాత్రమేనని, సినిమానే జీవితం కాదని అంటారు పవన్ కళ్యాణ్. తనకి, తన స్టాఫ్, తన ఫాంహౌస్‌లో పనిచేసే వారందరి కోసమే తాను సినిమాలని చేస్తున్నట్టు చెప్తారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమి చెప్పారంటే, తాను సక్సెస్‌లో కన్నా, ఫ్లాపుల్లో వున్నప్పుడే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పారు.


అసలు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతూ ఉంటే.. ఆయన పట్ల ఉన్న ప్రిజుడీస్ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. అంత పెద్ద స్టార్ అయి.. ఇంత సామాన్యంగా ఉంటాడు అనిపించటమే కాకుండా, ఒక సామాన్యుడు ఎలా రియాక్ట్ అవుతాడో అలానే రియాక్ట్ అవుతారు అనిపించి మనసుకి ఎంతో దగ్గరగా తోచడం వల్లనే బహుశా ఆయనకి అభిమానుల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ అభిమానులు అందరూ ఓటర్లుగా మారితే పవన్ కళ్యాణ్ తాను అనుకున్నది సాధిస్తారేమో అని కూడా అనిపిస్తుంది. (Pawan Kalyan Birthday Special)

Updated Date - 2022-09-02T22:45:57+05:30 IST