oke oka jeevitham review : అమ్మ సెంటిమెంట్ బాగుంది కానీ...

ABN , First Publish Date - 2022-09-09T18:32:43+05:30 IST

శర్వానంద్ కొన్ని సంవత్సరాల నుండీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని దురదృష్టం ఏంటి అంటే కొన్ని సార్లు సినిమా ఎంత బాగున్నా, కమర్షియల్ గా ఆడకపోవడం,

oke oka jeevitham review : అమ్మ సెంటిమెంట్ బాగుంది కానీ...

సినిమా: ఒకే ఒక జీవితం 

నటీనటులు: శర్వానంద్, రీతు వర్మ, అమల, ప్రియదర్శి, వెన్నెల కిశోర్, నాజరర్ తదితరులు  

డైలాగ్స్:  తరుణ్ భాస్కర్

సంగీతం: జేక్స్ బిజోయ్ 

సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్ 

రచన, దర్శకత్వం: శ్రీ కార్తీక్ 

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు

   -సురేష్ కవిరాయని 



శర్వానంద్ కొన్ని సంవత్సరాల నుండీ మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని దురదృష్టం ఏంటి అంటే కొన్ని సార్లు సినిమా ఎంత బాగున్నా, కమర్షియల్ గా ఆడకపోవడం, లేదా సినిమా బాగోలేకపోవటం జరుగుతూ వున్నాయి. అందువల్ల అతనికి హిట్ వచ్చి చాలా కాలం అవుతోంది. చాలా  సినిమాలు కూడా చేశాడు. నిజం చెప్పాలి అంటే, 2016లో వచ్చిన శతమానం భవతి తరువాత అతనికి అంత పెద్ద హిట్ రాలేదు. ఇప్పుడు ఒకే ఒక జీవితం అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. చాలా కాలం తరువాత అమల అక్కినేని మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు. ఇందులో ఆమె శర్వానంద్ తల్లిగా నటించారు. శ్రీ కార్తీక్ అనే అతను ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇది తమిళ్ లో కూడా విడుదలయింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో, భావోద్వేగాలతో కూడిన డ్రామా. మరి ఇది ఎలా ఉందో చూద్దాం. 


కథ:

ఆది (శర్వానంద్), చైతన్య (ప్రియదర్శి) మరియు శ్రీను (వెన్నెల కిషోర్) ముగ్గురూ చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. ఆది ఒక గిటారిస్ట్ కాగా సంగీతం అంటే ప్రాణం. చైతన్య ఎదో చిన్న జాబ్ చేస్తుంటాడు, అలాగే శ్రీను అద్దె ఇల్లు చూపే బ్రోకర్‌గా చేస్తూ వుంటాడు. వీళ్ళ ముగ్గురికీ  ఏవో సమస్యలు, ఆది కి చనిపోయిన వాళ్ళ అమ్మని చూడాలని, చైతన్యకి తన చిన్నప్పటి స్నేహితురాలుని పెళ్లి చేసుకోవాలని, అలాగే శ్రీనుకి బాగా చదువుకోవాలని, కోరికలు. ఇలా వున్న సమయంలో వీళ్ళకి ఒక సైంటిస్ట్ (నాజర్) తారసపడతారు. అతను ఒక టైం మెషిన్ ని కనిపెడతాడు. కానీ దాన్ని ఉపయోగించడానికి మనుషులు కావాలని చూస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో ఈ ముగ్గురు స్నేహితులు తనితో మాట్లాడాలి ఆ టైం మెషిన్ ద్వారా 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళడానికి ఒప్పుకుంటారు. 20 ఏళ్ళు వెనక్కి వెళ్లిన వీళ్ళు ఏమయ్యారు, ఎక్కడ ఎవరిని కలిశారు, మళ్ళీ ఎలా బయట పడ్డారు అన్నదే మిగతా కథ.


విశ్లేషణ:


టైం మెషిన్ లో కాలం వెనక్కి ముందుకి వెళ్ళటం అనే కాన్సెప్ట్ తో సినిమాలు మన తెలుగులో కూడా వచ్చాయి. బాలకృష్ణ నటించిన ఆదిత్య369 ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళంలో సూర్య నటించిన 24 కూడా ఇదే జోనర్‌లో వచ్చిన సినిమానే. అలాగే, ఈమధ్యే వచ్చిన బింబిసార సినిమా కూడా అటువంటిదే. అదీ సక్సెస్ అయింది. అయితే దర్శకుడు శ్రీ కార్తీక్ అదే టైం మెషిన్ కాన్సెప్ట్ తో ఒక కొత్త కథని ఎంచుకున్నాడు. అతను దాంట్లో చాలా భావోద్వేగాలను, చిన్న కామెడీ.. రెండూ కలిపి చూపించాడు. చాలా వరకు విజయం సాధించాడని చెప్పాలి. ముగ్గురు స్నేహితులు వాళ్ళ మధ్య చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు వున్న అనుబంధం బాగా చూపించాడు. అలాగే, కథ అంతా ఒక హీరో చుట్టూనే  కాకుండా, మిగతా వాళ్ళ పాత్రలకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్ల సినిమా ఆసక్తి కరంగా ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే ఈ స్నేహబంధంతో పాటు, అమ్మ సెంటిమెంట్ కూడా దర్శకుడు జోడించడంతో సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా భావోద్వేగంగా ఉంటూ వస్తుంది. టైం మెషిన్, వెనక్కి వెళ్ళడమే కాకుండా, ఇక్కడ దర్శకుడు ఇంకో ఆసక్తికర విషయం జోడించాడు. 


స్నేహితులు ముగ్గురూ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు ఎలా వున్నారో వాళ్ళని ఈ పెద్దయిన ముగ్గురూ కలవటం. వాళ్ళతో వాళ్ళే ఎలా మాట్లాడుకుంటారో అన్నది కొంచెం సరదాగా బాగా చిత్రీకరించారు. మొత్తం మీద దర్శకుడు ఒక రకంగా సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. కొత్త దర్శకుడు అయినా, సినిమా మీద మంచి పట్టు ఉన్నట్టు కనపడుతోంది. దీంతో సెంటిమెంట్ సన్నివేశాలు బాగా వచ్చాయి. విధిని ఎవరూ ఆపలేరు, భగవంతుడు రాసిన గీతని మానవుడు చెరపలేడు అన్న విషయం కూడా. దర్శకుడు బాగా చూపించాడు. అమ్మని బతికిద్దామనుకుంటాడు ఆది. కానీ విధి ముందు తలవంచాల్సిందే ఎవరయినా అని చెప్పాడు దర్శకుడు. 


ఇక నటీనటుల విషయానికి వస్తే, శర్వానంద్‌లో బలం.. భావోద్వేగాలు బాగా  పలికించటం. ఈ సినిమాలో మరోసారి తన ప్రతిభను చూపించాడు. ముఖ్యంగా తన తల్లితో వున్న సన్నివేశాలు అన్నీ బాగా రక్తి కట్టించాడు. ప్రేక్షకులు మంత్రముగ్దులను చేశాడా.. అన్నంత బాగా చేశాడు. అతనికి మరో మంచి సినిమా అవుతుంది ఇది. అలాగే ప్రియదర్శి కి చాలా మంచి పాత్ర దొరికింది, దాన్ని అతను బాగా చేసి చూపించాడు కూడా. 


ఇక సినిమాలో హైలైట్ మాత్రం వెన్నెల కిశోర్. ఇతన్ని ఇంతవరకు ఒక కామెడీ పాత్రలో చూశాము. కానీ ఇందులో కామెడీతో పాటు కొంచెం సీరియస్‌నెస్ ఉంది. అంటే ఆ సీరియస్‌నెస్‌లో కూడా చిన్న సరదాలు వుండే పాత్ర. అతను తన పాత్రని చాలా బాగా చెయ్యడమే కాకుండా, సినిమాకి పెద్ద రిలీఫ్. ఇక అమల అక్కినేని గురించి మనం ఏమి చెప్పాల్సిన పని లేదు. ఆమె మంచి నటి, బాగా చేశారు. కానీ ఎందుకో ఆమెని స్క్రీన్ మీద బాగా చూపించలేదు. మరి సాంకేతిక లోపమో, ఇంకేమయిన లోపమో కానీ ఆమె సన్నివేశాలు ఎందుకో మనం అనుకున్నంతగా రాలేదు అనిపిస్తుంది. ఆమె ముఖం కూడా ఏదోలా వుంది. బయట అంత చక్కగా కనపడే అమల స్క్రీన్ మీద చాలా పేలవంగా కనిపించారు. నాజర్ సైన్టిస్ట్ గా రాణించాడు. రీతు వర్మ కథానాయకురాలిగా బాగా ఆకట్టుకుంది. ఆమెకి కూడా ఇది మంచి సినిమా అవుతుంది. మధ్య మధ్యలో చిన్న తమిళ వాసన కనిపించినా పరవాలేదు  అనిపించింది. ఆ ముగ్గురు చిన్న కుర్రాళ్ళు అద్భుతంగా చేశారు. వాళ్ళు కూడా సినిమాకి హైలైట్. సినిమాటోగ్రఫీ, సంగీతం రెండూ చాలా చక్కగా కుదిరాయి. ఈ సినిమాకి. ఇద్దరూ రెండు స్తంభాల్లా ఈ సినిమాకి మంచి సపోర్ట్ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ బాగున్నాయి. అతన్ని ఎలా మర్చిపోతాం.  


శ్రీ కార్తీక్ మొదటి సినిమా అయినా చాలా చక్కగా సినిమాని ఆసక్తికరంగా నడిపించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో తల్లి కొడుకుల భావోద్వేగాలు, వెన్నెల కిశోర్ పాత్ర మలిచిన తీరు ఆకట్టుకుంటాయి. కానీ ఒక్కటే సందేహం. ఈ సినిమా శర్వానంద్ కి, మిగతా నటులకి, సాంకేతిక నిపుణులకి మంచి పేరు తెస్తుంది. కానీ, డబ్బులు తెస్తుందా..? అన్నదే సందేహం. ఎందుకంటే శర్వానంద్ కి కమర్షియల్ హిట్ కావాలి కదా ఇప్పుడు.. అది ఒకే ఒక జీవితంతో వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.! 



Updated Date - 2022-09-09T18:32:43+05:30 IST