NTR సినీ జీవితచిత్రం..కొన్ని రీళ్లు

Twitter IconWatsapp IconFacebook Icon

తెలుగు ప్రజల ఇంటి గోడల మీద ఇలవేల్పుగా, గుండెల్లో తెర వేల్పుగా నిల్చిన వ్యక్తి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ (Viswa Vikhyatha Nata Sarvabhouma) నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao). ‘తెలుగు’ అనే పదం ఉన్నంతవరకూ జాతి జనుల మీద చెరగని ముద్ర ఆయనది. ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన ఒక సాధారణ రైతు బిడ్డ అసామాన్య శక్తిగా, తిరుగులేని ఏలికగా ఎదిగి  మహోన్నత శిఖరాలు అధిరోహించిన వైనం అద్బుతం, అనన్య సామాన్యం. తెలుగు టాకీ పుట్టడానికి ఎనిమిదేళ్ల ముందు ఎన్టీఆర్‌ జన్మించారు. తెలుగు సినిమా వయసు సంతరించుకుంటున్న దశలో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన దాని వ్యాప్తికి ఎంత కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేసినా, నాయక, ప్రతినాయక పాత్రలను పోషించినా, యువకుడి నుంచి వృద్ధుడి వరకూ ఏ పాత్ర చేసినా వేర్వేరు నటులు పోషించారా అనే రీతిలో అభినయాన్ని ప్రదర్శించడం ఎన్టీఆర్‌ (NTR)కే చెల్లింది. ముందు తరాలకు నిరంతర ఆదర్శప్రాయునిగా నిలిచిన ఎన్టీఆర్‌ సినీ జీవితచిత్రంలోని కొన్ని రీళ్లు..

NTR సినీ జీవితచిత్రం..కొన్ని రీళ్లు

ఎదురులేని మనిషి


తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్టీఆర్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సాంఘిక, పౌరాణిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ మరిచిపోలేనివి. ‘అడవిరాముడు’ (Adavi Ramudu), ‘యమగోల’ (Yamagola), ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘వేటగాడు’ (Vetagadu), ‘జస్టిస్‌ చౌదరి’, ‘బొబ్బిలిపులి’ వంటి సోషల్‌ హిట్స్‌, ‘లవకుశ’ (Lavakusa), ‘మాయాబజార్‌’, ‘శ్రీకృష్ణపాండవీయం’, ‘దానవీరశూర కర్ణ’ వంటి ఫోక్‌లోర్‌ హిట్స్‌, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘బొబ్బిలి యుద్ధం’ వంటి హిస్టారికల్‌ హిట్స్‌, ‘పాతాళభైరవి’. ‘చిక్కడు దొరకడు’, ‘అగ్గిపిడుగు’ వంటి ఫోక్‌లోర్‌ హిట్స్‌.. ఇలా అన్ని రకాల చిత్రాల్లో నటించి ఎదురులేని కథానాయకుడు అనిపించుకున్నారు ఎన్టీఆర్‌. ఆయన రాముడు వేషం వేశారు, రావణుడిగానూ నటించారు. శ్రీకృష్ణుడి వేషం వేశారు, దుర్యోధనుడిగానూ మెప్పించారు. ‘ప్రతినాయకుడు’ అనే పదం కనిపెట్టింది ఎన్టీఆరే.  కాకపోతే పౌరాణిక పాత్రల మీద మక్కువతో ఎన్టీఆర్‌ పురాణాలకు కాస్త పక్కకు వెళ్లారనే విమర్శ కూడా లేకపోలేదు. అయితే, ఆయా పాత్రల మానసిక సంచలనాన్ని ఆవిష్కరించాలంటే ఆ మాత్రం చొరవ తీసుకోక తప్పదని అనేవారు ఎన్టీఆర్‌. 


NTR సినీ జీవితచిత్రం..కొన్ని రీళ్లు

అన్నదమ్ముల అనుబంధం


ఆ రామలక్ష్మణులు ఎలా ఉండేవారో జనం ఎరుగరు కానీ ఎంతో అన్యోన్యంగా మెలిగిన నందమూరి సోదరులు రామారావు, త్రివిక్రమరావులను చూసి అందరూ మురిసిపోయేవారు. ఆ రామలక్ష్మణులు వీరేనని నమ్మేవారు. రామారావు కంటే త్రివిక్రమరావు మూడేళ్లు చిన్న. తమ్ముడంటే ఎన్టీఆర్‌కు ప్రాణం.. అలాగే, అన్నయ్య అంటే రామారావుకు అంతులేని అభిమానం. ఆలోచన ఒకరిది, ఆచరణ మరొకరిది అన్నట్లుగా మెలిగేవారు. ఎన్టీఆర్‌ బి.ఎ. చదివారు కానీ, త్రివిక్రమరావుకు చదువు అబ్బలేదు. చదువును అశ్రద్ధ చేయవద్దని, బాగా చదువుకుంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని తమ్ముడితో రామారావు తరచూ చెబుతుండేవారు. అయినాసరే చదువు తప్ప మిగిలిన అన్ని విషయాల్లో త్రివిక్రమరావు ముందుండేవారు. అన్నగారికి సినిమాల్లో ఛాన్స్‌ వచ్చినప్పుడు వెళ్లాలా, వద్దా అనే మీమాంసలో ఉన్నప్పుడు వెళ్లమని ప్రోత్సహించింది త్రివిక్రమరావే. అంతేకాదు, పరిశ్రమకు వచ్చిన తొలి రోజుల్లో ఎన్టీఆర్‌కు వేషాల వేటలో నిరుత్సాహం కలిగినప్పుడు ఆయనకు నైతిక బలం ఇచ్చింది కూడా ఆయన తమ్ముడే! సంపాదన లేని త్రివిక్రమరావుకు పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకురాని తరుణంలో ఆస్తిలో తన వంతు వాటాను కూడా తమ్ముడికే రాసిచ్చిన ఎన్టీఆర్‌ ఔన్నత్యాన్ని ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకొనేవారు. అంతేకాదు, తను సంపాదనాపరుడైన తర్వాత తన కుటుంబానికి ఎంత ఖర్చు పెట్టేవారో, తమ్ముడి కుటుంబానికి కూడా అంతే ఖర్చు పెట్టేవారు ఎన్టీఆర్‌. తన 73 వ ఏటా 1996లో  కన్ను మూశారు. త్రివిక్రమరావు కూడా తన 73 వ ఏట 1998 సెప్టెంబర్‌ 13న మరణించారు. 


NTR సినీ జీవితచిత్రం..కొన్ని రీళ్లు

రజనీకాంత్‌కు ఎన్టీఆర్‌ సలహా


తమిళ చిత్రరంగ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాల్లోకి రాకముందు బస్‌ కండెక్టర్‌గా పనిచేసేవారు. ఆయన ఎన్టీఆర్‌ అభిమాని. ‘మాయాబజార్‌’, ‘పాండవవనవాసం’ చిత్రాలు లెక్కలేనన్నిసార్లు చూశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిమంటే రజనీకాంత్‌ ఆర్టిస్ట్‌ కావడానికి కారణం ఎన్టీఆరే! అదేలాగంటే ఆయన కండెక్టర్‌గా పనిచేసే రోజుల్లో ఒకసారి స్టాఫ్‌ అంతా కలసి ఒక పౌరాణిక నాటకం ప్రదర్శించారు. అందులో దుర్యోధనుడి వేషం రజనీది.  ఇందుకోసం ఎన్టీఆర్‌ ‘శ్రీకృష్ణ పాండవీయం’ చిత్రం చూసి అందులో ఎన్టీఆర్‌ ఎలా నటించారో తను అలాగే చేయడానికి రజనీ ప్రయత్నించారు. ఆ నాటక ప్రదర్శన విజయవంతం కావడంతో సినిమాల్లో ప్రయత్నించమని అందరూ సలహా ఇచ్చారు. ఆ సలహా నచ్చి మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రజనీకాంత్‌ చేరడం, శిక్షణ పూర్తయ్యాక దర్శకుడు కె.బాలచందర్‌ దృష్టిలో పడడం, ఆయన హీరోని చేయడం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తన అభిమాన నటుడు ఎన్టీఆర్‌తో కలసి ‘టైగర్‌’ అనే చిత్రంలో నటించారు రజనీకాంత్‌. ఆ సమయంలో ఆయన తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండేవారు. అటు సినిమాలు, ఇటు తన అలవాట్లు.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేయలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యేవారు రజనీకాంత్‌. దీని వల్ల మనిషి అన్‌ బ్యాలెన్స్‌ అయి, చీటికిమాటికీ ప్రతి ఒక్కరితో తగదాలకు దిగేవారు. ఎన్టీఆర్‌ ఇది గమనించి, ఒక రోజు దగ్గరకు పిలిచి ‘బ్రదర్‌.. తెల్లారి మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల మధ్య  సమయాన్ని బ్రహ్మ కాలం అంటారు. ఆ సమయంలో నువ్వు ప్రాణాయామం చేస్తే పూర్తిగా కోలుకుంటావు.. అని సలహా ఇచ్చారు. కొంతకాలం ఆయన చెప్పినట్లే చేయడంతో రజనీకాంత్‌ మాములు మనిషి అయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన  ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఆడియో ఫంక్షన్‌కు అతిధిగా హాజరైన రజనీకాంత్‌ ఎన్టీఆర్‌ సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించారు.


NTR సినీ జీవితచిత్రం..కొన్ని రీళ్లు

యుగపురుషుడు


ఎన్టీఆర్‌కు అద్భుత జ్ఞాపక శక్తి ఉండేది. ఒకటికి నాలుగు సార్లు చదివితే ఎంత పెద్ద డైలాగ్‌ అయినా ఆయనకు కంఠతా వచ్చేది. హీరోలకు సొంత కుర్చీలు, పర్సనల్‌ అసిస్టెంట్స్‌ అనే సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయనకంటే ముందు ఆయన కుర్చీ సెట్‌లోకి వచ్చేది. దాని మీద టవల్‌ వేసేవాడు ఆయన అసిస్టెంట్‌. ఆ కుర్చీకి ఉన్న క్లాత్‌ మీద ఎన్టీఆర్‌ పేరు అందంగా డిజైన్‌ చేసి ఉండేది. ఆ కుర్చీ సెట్‌లోకి వచ్చిందంటే ఎన్టీఆర్‌ వస్తున్నారని సంకేతం. వెంటనే సెట్‌లో ఉన్న వాళ్లంతా అలర్ట్‌ అయి లేచి నిల్చునేవారు. రామారావు రాగానే నిర్మాతకు, దర్శకుడికి నమస్కరించి తన పనిలో నిమగ్నమయ్యేవారు. 

తొలి చిత్రం ‘మనదేశం’లో ఎన్టీఆర్‌ తీసుకున్న పారితోషికం రెండు వందల రూపాయలు. ఆ తర్వాత నటుడిగా డిమాండ్‌ పెరగడంతో పారితోషికం కూడా పెరిగింది. అగ్ర కథానాయకుడిగా ఎదిగినా కూడా 22 ఏళ్ల పాటు ఆయన పారితోషికం వేలల్లోనే ఉండేది. నిర్మాతలకు నిర్మాణ వ్యయం తగ్గించడానికి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ పారితోషికాలు పెంచేవారు కాదు. 1972 నుంచి సినిమాకు లక్ష రూపాయలు తీసుకోవడం ప్రారంభించారు ఎన్టీఆర్‌. ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంలో కోటి రూపాయల పారితోషికం తీసుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా రికార్డ్‌ నెలకొల్పారు. 300 చిత్రాల్లో దాదాపు 700 పాత్రలను పోషించారు ఎన్టీఆర్‌. ఆ పాత్రలన్నీ తనని ప్రజల దగ్గరకు తీసుకెళ్లడంతో ప్రతి పాత్రా తనకు ప్రత్యేకం అనేవారు ఎన్టీఆర్‌. 


వినాయకరావు
AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.