ప్రతిరోజూ పండగే!

ABN , First Publish Date - 2022-05-28T05:51:23+05:30 IST

‘స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి శత జయంతి ఉత్సవాలు శనివారం నుంచి మొదలవుతున్నాయి.

ప్రతిరోజూ పండగే!

‘స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి శత జయంతి ఉత్సవాలు శనివారం నుంచి  మొదలవుతున్నాయి. ఆయన్ని ఎంతో అభిమానించి, ఆరాధించేవారికి ఒక సంవత్సరం పాటు ప్రతి రోజూ పండగే. ఎందుకంటే ఆయన తన పుట్టుక ద్వారా విశ్వవిఖ్యాతమయ్యారు. తనని కన్న తల్లితండ్రులకు, బంధువర్గానికి, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, తను అడుగుపెట్టిన ప్రతి రంగానికీ  వన్నెను, ఖ్యాతినీ తీసుకువచ్చిన అరుదైన వ్యక్తి, కారణజన్ముడు ఎన్టీఆర్‌’ అన్నారు దర్శకనిర్మాత వైవీఎస్‌ చౌదరి. ఎన్టీఆర్‌ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టడం వెండితెర చేసుకున్న మహాభాగ్యం అని అభివర్ణించారు చౌదరి. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను అనితర సాధ్యమైన రీతిలో పోషించిన ఎన్టీఆర్‌లాంటి మహానటుడు తమ బెంగాల్‌లో పుట్టి ఉంటే, తమ చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమను శాసించి ఉండేదని ఎన్టీఆర్‌ సినిమాలు చూసి అభిమానిగా మారిన ఓ బెంగాలీ మిత్రుడు తన స్నేహితుడితో అన్నట్లు వైవీఎస్‌ చౌదరి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నటుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించి, తర్వాత నిర్మాతగా, దర్శకుడిగా మారి అన్ని శాఖలకు వన్నె తేవడం అరుదైన విషయమనీ, ఒక వ్యక్తిలో ఇంత బహుముఖ ప్రజ్ఞ ఉండడం చూసి ఆ రోజుల్లో హిందీతో పాటు దక్షిణాది చిత్ర ప్రముఖులు ఎన్టీఆర్‌ను గుర్తించి, కీర్తించారని వైవీఎస్‌ చౌదరి పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకుండా తనే సొంత వనరులతో స్టూడియోను, సినిమా థియేటర్లను నిర్మించిన నిజాయతీ ఎన్టీఆర్‌ సొంతం అని ఆయన కీర్తించారు. అటువంటి వ్యక్తికి అభిమానినని  చెప్పుకోవడం గర్వంగా ఫీలవుతుంటానని అన్నారు. ‘తెలుగు భాషను గౌరవిస్తే ఆ భాషకు ఎంతో ఖ్యాతి తీసుకు వచ్చిన ఆ మహానుభావుడిని గౌరవించుకున్నట్లే అవుతుంది. అందుకే ఇకపై తెలుగులోనే మాట్లాడదాం, మన పిల్లలను కూడా తెలుగులోనే మాట్లాడేలా చేద్దామని ప్రతిజ్ఞ తీసుకుందాం. అదే ఆ మహానుభావుడికి ఇచ్చే దివ్యమైన నివాళి. అలాగే  తెలుగు భాషను అనర్ఘళంగా మాట్లాడేవారికి ఎన్టీఆర్‌ పేరు మీద ప్రోత్సహకరంగా ప్రతి ఏడాది ఓ అవార్డ్‌ ఇస్తే బాగుంటుంది’ అని సూచించారు వైవీఎస్‌ చౌదరి. 


- వైవీఎస్‌ చౌదరి

Updated Date - 2022-05-28T05:51:23+05:30 IST