‘83’ని ప్రశంసించిన న్యూజిలాండ్ క్రికెటర్

ABN , First Publish Date - 2022-03-26T22:39:24+05:30 IST

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన

‘83’ని ప్రశంసించిన న్యూజిలాండ్ క్రికెటర్

భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘83’. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాన్ ఇండియాగా రూపొందింది. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది.


‘83’ సినిమాను తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రిచర్డ్ హ్యాడ్లీ వీక్షించాడు. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించాడు. కపిల్ దేవ్‌ను పొగుడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తాను ‘83’ని ఎంతగానో ఎంజాయ్ చేశానని హ్యాడ్లీ చెప్పాడు. ఈ చిత్రం అందరికీ స్ఫూర్తిదాయకం అని వివరించాడు. ‘‘కెప్టెన్‌గా జట్టులో ఏ విధంగా స్ఫూర్తిని నింపావో నాకు అర్థమయింది. జింబాబ్వేతో నువ్వు ఆడిన మ్యాచ్ ఇప్పటికీ నాకు గుర్తుకుంది. ఆ మ్యాచ్‌లో నువ్వు చేసిన పరుగులను నేను ఇప్పటికీ చెప్పగలను. ఫైనల్‌లో ఇండియన్ క్రికెట్ టీమ్ తక్కువ స్కోర్ చేసినప్పటికీ  వెస్టిండీస్‌ను ఏ విధంగా ఓడించిందో నాకు తెలుసు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ నీ పాత్రను అద్భుతంగా పోషించాడు. నేను కథలో లీనమైపోయాను. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇండియన్ క్రికెట్ టీమ్‌కు సరిహద్దులో కూడా అభిమానులు ఉండటం ఆసక్తికరంగా ఉంది. ఇండియన్, వెస్టిండీస్ టీమ్ క్రికెటర్ల పాత్రలకు నటుల ఎంపిక బాగుంది. మాల్కం మార్షల్ బౌలింగ్ యాక్షన్ అచ్చం అలాగే ఉంది’’ అని రిచర్డ్ హ్యాడ్లీ చెప్పాడు. ‘83’ చిత్రంలో రణ్‌వీర్‌కు జోడీగా దీపిక నటించింది. తాహీర్ రాజ్ భాసిన్, జీవా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. టాలీవుడ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున విడుదల చేశాడు.



Updated Date - 2022-03-26T22:39:24+05:30 IST