ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదనడం నిజం కాదు: ఎన్సీబీ చీఫ్

ABN , First Publish Date - 2022-03-03T00:25:07+05:30 IST

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్

ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదనడం నిజం కాదు: ఎన్సీబీ చీఫ్

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడు బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక కోర్టు పలుమార్లు తిరస్కరించింది. అనంతరం బాంబే హైకోర్టు మెట్లెక్కి షరతులతో కూడిన బెయిల్‌ను అతడు తెచ్చుకున్నాడు.  


డ్రగ్స్ కేసును ఎన్సీబీ సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే. ఆర్యన్‌కు వ్యతిరేకంగా సిట్‌కు ఎటువంటి ఆధారాలు లభించలేదని పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంపై సిట్ చీఫ్ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ఆర్యన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదనడం నిజం కాదు. అవన్నీ పుకార్లు మాత్రమే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలోనే ఉంది. సిట్ బృందం పలువురి స్టేట్ మేంట్స్‌ను రికార్డ్ చేసింది. ఇంకా ఎటువంటి నిర్ధారణకు రాలేదు’’ అని ఆయన చెప్పారు.   


డ్రగ్స్ కేసును మొదట అప్పటి ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడే దర్యాప్తు చేశారు. అయితే ఈ కేసులో ఆయన పాత్రపై పలువురు బాలీవుడ్ సెలబ్రెటీలు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో దర్యాప్తు నుంచి ఆయన్ను తప్పించారు. ఆ తర్వాత సంజయ్ సింగ్ దర్యాప్తు బాధ్యతలు చేపట్టారు. ‘‘ఈ కేసులో పలు ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. క్రూయిజ్ షిప్‌పై సిబ్బందితో దాడి చేసినప్పుడు వీడియో రికార్డింగ్ చేయాలి. కానీ, సమీర్ మాత్రం అలా రికార్డింగ్ చేయలేదు. ఆర్యన్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు’’అని సిట్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-03-03T00:25:07+05:30 IST