Nazriya Nazim: అంటే... అలా కలిశాం

ABN , First Publish Date - 2022-06-26T17:27:29+05:30 IST

నజ్రియా పూర్తి పేరు నజ్రియా నజీమ్‌. కేరళలోని త్రివేండ్రంలో పుట్టి పెరిగింది. తండ్రి నజీముద్దీన్‌ వ్యాపారవేత్త. కొంతకాలం ముంబైలో

Nazriya Nazim: అంటే... అలా కలిశాం

నజ్రియా తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. అదే... ‘అంటే సుందరానికీ..’. అయితే అంతకు ముందే నజ్రియాకు టాలీవుడ్‌లో అభిమానులు తయారయ్యారు. అనువాద చిత్రం ‘రాజా- రాణీ’లో కీర్తన పాత్రలో నజ్రియా నటన అంతగా మెప్పించింది. బెంగళూరు డేస్‌, ఓంశాంతి ఓషానా లాంటి మలయాళ చిత్రాలు నజ్రియాలోని నటిని కొత్త కోణంలో చూపించాయి. ‘పుష్ప’లో మెప్పించిన ఫహద్‌ ఫాజిల్‌, నజ్రియా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. అసలు నజ్రియా ఎవరు? ఫాజిల్‌తో ఎప్పుడు ప్రేమలో పడింది? ఈ వివరాల్లోకెళ్తే...


నజ్రియా పూర్తి పేరు నజ్రియా నజీమ్‌. కేరళలోని త్రివేండ్రంలో పుట్టి పెరిగింది. తండ్రి నజీముద్దీన్‌ వ్యాపారవేత్త. కొంతకాలం ముంబైలో ఉన్నారు. ఆ తరవాత కేరళలో స్థిరపడ్డారు. అక్కడే ప్రాఽథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది నజ్రియా. బీబీఏ చేయాలనుకుంది. కానీ కుదర్లేదు. కష్టపడి బీకాం పూర్తి చేసింది. 

 నజ్రియా చిన్నప్పుడు బొద్దుగా, అందంగా ఉండేది. అందుకే సినిమా అవకాశం చాలా తొందరగానే వచ్చేసింది. పన్నెండేళ్లకే మలయాళ చిత్రం ‘పలంకు’తో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టింది. మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అంతకు ముందే కొన్ని టీవీ షోలలో నటించింది. అందుకే మమ్ముట్టిలాంటి వాళ్ల ముందూ ధైర్యంగా నటించగలిగింది. ఆ తరవాత ఒకట్రెండు సినిమాల్లో బాల నటిగా మెరిసింది. 

 2013లో ‘మాడ్‌ డాడ్‌’ అనే మలయాళ చిత్రంతో నజ్రియా కథానాయికగా మారింది. ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడమే కాకుండా, నటిగా నజ్రియాకు మంచి పేరు తీసుకొచ్చింది. ‘రాజా - రాణీ’లోని కీర్తన పాత్రతో తను పాపులర్‌ అయిపోయింది. ఈ సినిమా తెలుగులో డబ్‌ అయి మంచి విజయాన్ని అందుకుంది. ‘బెంగళూరు డేస్‌’ నజ్రియా జీవితాన్ని మార్చేసింది. మలయాళంలో అదో క్లాసిక్‌. ఆ సినిమాతోనే ఫహద్‌ ఫాజిల్‌తో పరిచయమైంది. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకొన్నారు.

 ఫహద్‌ని పెళ్లి చేసుకొనేటప్పటికి నజ్రియా వయసు కేవలం పందొమ్మిదేళ్లు. ‘‘పాతికేళ్ల వరకూ పెళ్లి చేసుకోకూడదని అనుకొనేదాన్ని. కానీ మనం అనుకొన్నవి జరగవు కదా...? నా జీవితంలోకి ఓ అద్భుతంలా వచ్చాడు ఫాజిల్‌. ‘బెంగళూరు డేస్‌’ షూటింగ్‌ సమయంలో నాకు ప్రపోజ్‌ చేశాడు. అప్పటికి తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నేను ఆ క్షణంలో ‘నో’ అంటే తనని మిస్‌ అయిపోతానన్న భయం వెంటాడింది. అందుకే పెద్దల్ని ఒప్పించి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం’’ అని తన ప్రేమకథ గురించి చెప్పుకొచ్చింది నజ్రియా.

 ‘బెంగళూరు డేస్‌’ సెట్లో చాలా గమ్మత్తులు జరిగేవట. ఫహద్‌ మెథడ్‌ యాక్టర్‌. ఓ పాత్ర చేస్తుంటే.. అందులోంచి బయటకు రావడం చాలా కష్టం. సెట్లో నజ్రియా పలకరించాలని చూసినప్పుడల్లా ఫహద్‌ గట్టిగా అరుస్తూ, తాను చేస్తున్న పాత్రలానే ప్రవర్తించేవాడట. దాంతో నజ్రియా కంగారు పడిపోయేదట. ‘‘నేను ఫహద్‌లా మెథడ్‌ యాక్టర్‌ని కాను. ‘కట్‌’ చెప్పగానే పాత్రలోంచి బయటకు వచ్చేస్తా. కానీ ఫహద్‌ అదే పాత్రలో లీనమైపోయేవాడు. అందుకే ‘పెళ్లయ్యాక.. నీ మెథడ్‌ యాక్టింగ్‌ మానుకో. ఇంటికొచ్చినప్పుడు నా భర్తలా ఉంటే చాలు’ అని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చా’’ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది.


ఇన్నేళ్లలో నజ్రియా చేసింది ఒకే ఒక్క తెలుగు సినిమా. అది కూడా నాని స్వయంగా ఫోన్‌ చేసి ‘ఓ మంచి కథ ఉంది.. వింటావా’ అని అడగడంతో నజ్రియా ‘అంటే సుందరానికి’ ప్రాజెక్టులోకి వచ్చింది.   ‘‘నాని నటించిన ‘జెర్సీ’ అంటే నాకు చాలా ఇష్టం. తన కథల ఎంపిక బాగుంటుంది. నానికి నచ్చిదంటే కచ్చితంగా మంచి కథే  అయుంటుంది అని నా నమ్మకం. అందుకే ఈ కథ విన్నా. వినగానే బాగా నచ్చింది. అందుకే ఒప్పుకొన్నా’’ అంది నజ్రియా. నజ్రియాకు తెలుగు రాదు. తొలి రెండు మూడు రోజులూ సెట్లో కాస్త కంగారుగా, గందరగోళంగా అనిపించిందట. అందుకే దివ్య అనే ట్యూటర్‌ని పెట్టుకుంది. మెల్లమెల్లగా తెలుగు నేర్చుకుంది. లీలా పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకుంది.

Updated Date - 2022-06-26T17:27:29+05:30 IST