నాజర్‌ ప్యానెల్‌ ఘన విజయం

ABN , First Publish Date - 2022-03-21T15:38:12+05:30 IST

సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం)కు 2019లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల్లో సీనియర్‌ నటుడు నాజర్‌

నాజర్‌ ప్యానెల్‌ ఘన విజయం

- నడిగర్‌ సంఘ ఎన్నికల్లో  రెండోసారి గెలిచిన విశాల్‌, కార్తి

- హైకోర్టు తీర్పుతో ఓట్ల లెక్కింపు పూర్తి


అడయార్‌(చెన్నై): సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం)కు 2019లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల్లో సీనియర్‌ నటుడు నాజర్‌ సారథ్యంలోని పాండవర్‌ ప్యానెల్‌ విజయభేరీ మోగించింది. మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు ఆదివారం ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల అధికారి, రిటైర్డ్‌ జడ్జి ఇ.పద్మనాభన్‌ పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో అధ్యక్షుడిగా నాజర్‌, ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, కోశాధికారిగా కార్తీ, ఉపాధ్యక్షులుగా పూచ్చి మురుగన్‌, నటుడు కరుణాస్‌ గెలుపొందారు. ఇందులో విశాల్‌, కార్తీ వరుసగా రెండోసారి గెలిచారు. 


పాండవర్‌ ప్యానెల్‌ విజయం 

ఈ ఎన్నికల్లో పాండవర్‌ ప్యానెల్‌ తరపున పోటీ చేసిన అభ్యర్థులు విజయం సాధించారు. అధ్యక్ష పదవికి నాజర్‌, భాగ్యరాజ్‌ పోటీ పడ్డారు. ఇందులో భాగ్యరాజ్‌పై నాజర్‌ (ఓట్లు 1,701), ప్రధాన కార్యదర్శిగా ఐసరి గణేశ్‌పై విశాల్‌ (ఓట్లు 1,720), కోశాధికారిగా ప్రశాంత్‌పై కార్తీ (ఓట్లు 1,827) విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా పాండవర్‌ జట్టు నుంచి పూచ్చి మురుగన్‌ 1,612, కరుణాస్‌ 1,605 ఓట్లతో గెలుపొందారు. అలాగే, మిగిలిన పదవులను కూడా పాండవర్‌ ప్యానెల్‌ వారే గెలుచుకున్నారు. 


కౌంటింగ్‌ను బహిష్కరించిన ప్రత్యర్థి జట్టు 

అయితే, ఈ ఎన్నికల్లోనే కాకుండా, ఓట్ల లెక్కింపులో కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ కె.భాగ్యరాజ్‌ సారథ్యంలోని స్వామి శంకర్‌దాస్‌ ప్యానెల్‌ కౌంటింగ్‌ను బహిష్కరించింది. ఎన్నికల సమయంలో పోలైన ఓట్ల కంటే లెక్కింపుల్లో అధిక ఓట్లు ఉన్నాయనీ, ఇలా ఎలా వచ్చాయంటూ వారు ప్రశ్నించారు. ఇదే అంశంపై ఎన్నికల అధికారి ఇ.పద్మనాభన్‌కు ఒక లేఖ కూడా రాశారు. పోస్టల్‌ ఓట్లు 1042 పోలైనట్టుగా గతంలో ఎన్నికల అధికారి ప్రకటించారనీ, ఇపుడు ఈ ఓట్ల సంఖ్య 1180గా పేర్కొన్నారనీ, అంటే 138 ఓట్లు అదనంగా ఎలా వచ్చాయని వారు ప్రశ్నించారు. అలాగే, మొత్తం పోలైన ఓట్లు 1602 కాగా, లెక్కించిన ఓట్లు 1609 అని, అదనంగా 7 ఓట్లు ఎలా వచ్చాయని వారు నిలదీసి, కౌంటింగ్‌ను బహిష్కరించారు. 


2019లో జరిగిన ఎన్నికలు... 

నడిగర్‌ సంఘానికి 2019 జూన్‌ 23న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నటుడు కె.భాగ్యరాజ్‌ సారథ్యంలోని స్వామి శంకర్‌దాస్‌ ప్యానెల్‌, నటుడు నాజర్‌ సారథ్యంలోని పాండవర్‌ ప్యానెల్‌ పోటీ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖల య్యాయి. వీటిని విచారించిన హైకోర్టు గత నెలలో తుది తీర్పు ఇచ్చింది నడిగర్‌ సంఘం ఎన్నికల ఓట్లను నాలుగు వారాల్లో లెక్కించి ఫలితాలు వెల్లడించాలంటూ ఆదేశించింది.  దీంతో మూడున్నరేళ్ళ తర్వాత బ్యాంకు లాకర్లలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సులను ఆదివారం తెచ్చి నుంగంబాక్కం లోని గుడ్‌షెఫర్డ్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎన్నికల అధికారి రిటైర్డ్‌ జడ్డి పద్మనాభన్‌, ఇరు ప్యానెళ్ళకు చెందిన ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓట్లు లెక్కించారు.


భవన నిర్మాణంపై దృష్టి?

ఈ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో పాండవర్‌ జట్టు గెలుపొందడంతో నడిగర్‌ సంఘం భవన నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసేలా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే 70 శాతం మేర ఈ భవనం పూర్తయింది.. కాగా, ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి తమిళనాడు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటనలో అభినందనలు తెలిపింది. 


Updated Date - 2022-03-21T15:38:12+05:30 IST