కొత్త బంగ్లాకి మారిన నటుడు.. తన బాత్రూమ్ గురించి ఏం అన్నాడంటే..

ABN , First Publish Date - 2022-02-22T18:54:25+05:30 IST

బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధీఖీ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ఇబ్బందిపడ్డ ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు..

కొత్త బంగ్లాకి మారిన నటుడు.. తన బాత్రూమ్ గురించి ఏం అన్నాడంటే..

బాలీవుడ్‌లోని టాలెంటెడ్ నటుల్లో నవాజుద్దీన్ సిద్ధీఖీ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎంతో ఇబ్బందిపడ్డ ఈయన ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో దూసుకుపోతున్నాడు. అయితే ఈ నటుడు ఇటీవలే కొత్త ఇంటికి మారాడు. ముంబైలోని యారి రోడ్‌లో ఉన్న ఆ బంగ్లాకి తన తండ్రి గుర్తుగా ‘నవాబ్‌’ అని పేరు పెట్టుకున్నాడు. ఈ బంగ్లా గురించి నవాజుద్దీన్ తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.


నవాజుద్దీన్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు నేను అనుభవిస్తున్న లగ్జరీ అంతా కేవలం కష్టపడడం వల్ల వచ్చింది మాత్రమే. నిజంగా ఇలాంటి బంగ్లాలో ఉంటానని కలలో కూడా అనుకోలేదు. నా సోదరుడు ఈ ప్లాట్‌ని చూపించగా ఎంతో ఆసక్తితో ఈ బంగ్లాను డిజైన్ చేయించుకున్నాను. 


ఈ బంగ్లాలో ఏడు గదులు, రెండు భారీ డ్రాయింగ్ రూమ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఓ థియేటర్ హాల్ కూడా ఉంటుంది. వాటిని నాకు నచ్చిన డిజైన్‌లోకి తేవడానికి ప్రాణం పెట్టాను. రంగుల నుంచి నిర్మాణానికి వాడిన కలప వరకూ ప్రతిదానిని ప్రత్యేక శ్రద్ధతో ఎంచుకున్నాను. మీరు ఇంట్లోకి ప్రవేశించగానే ఓ పాతకాలపు బ్రిటిష్ ఇంటిలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. 


నాకు గార్డెనింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే మొదటి అంతస్తులో ప్రత్యేకంగా గార్డెన్ ఏర్పాటు చేయించుకున్నాను. ఇందులో ఓ పల్లెటూరిలో పెంచినట్లు ఎక్కువ చెట్లు పెంచలేకపోవచ్చు. కానీ ఉన్న కొన్ని చెట్లు కూడా ఎంతో ప్రశాంతతనిస్తాయి’ అని చెప్పుకొచ్చాడు.


నవాజుద్దీన్ కెరీర్‌ ప్రారంభంలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘ఈ బంగ్లాలో నా వ్యక్తిగత బాత్రూమ్, నేను గతంలో నివసించిన ఇళ్లంతా పెద్దగా ఉంటుంది. నేను ముంబైకి వచ్చినప్పుడు మరో నలుగురు వర్థమాన నటులతో ఆ ఇంట్లో ఉన్నాను’ అని తెలిపాడు.



Updated Date - 2022-02-22T18:54:25+05:30 IST