అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను పొగడ్తలతో ముంచెత్తిన వెట్రిమారన్

ABN , First Publish Date - 2022-03-18T22:14:37+05:30 IST

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలను

అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను పొగడ్తలతో ముంచెత్తిన వెట్రిమారన్

బాక్సాఫీస్ హిట్‌లతో సంబంధం లేకుండా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు వెట్రిమారన్. ‘ఆడు కాలం’, ‘విసరాణై’, ‘వడ చెన్నై’, ‘ఆసురన్’ వంటి హిట్  చిత్రాలకు అతడు దర్శకత్వం వహించాడు. అతడు తెరకెక్కించిన ‘ఆడుకాలం’ సినిమా ఆరు నేషనల్ అవార్డులను గెలుపొందింది. వెట్రి మారన్ దగ్గర మతి మారన్ అనే వ్యక్తి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ప్రస్తుతం మతి మారన్ దర్శకుడిగా మారాడు. ‘సెల్ఫీ’ అనే క్యాంపస్ యాక్షన్ థ్రిల్లర్‌‌ను తెరకెక్కించాడు.  


తాజాగా ‘సెల్ఫీ’ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్‌లో మార్చి 17న ‌జరిగింది. ఈ వేడుకలోనే చిత్ర ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వెట్రిమారన్ హాజరయ్యి మాట్లాడాడు. ఈ సందర్భంగా మతి మారన్ తనకు బంధువు అవుతాడని చెప్పాడు. ‘‘మతిమారన్ నాకు బంధువు అవుతాడు. అతడి తండ్రికి మారన్ అనే పేరు చాలా ఇష్టం. అందుకే నాకు వెట్రిమారన్, అతడి కొడుకుకీ మతి మారన్ అని పేరు పెట్టాడు. మతి మారన్ కష్టపడి పనిచేస్తాడు. షార్ట్ కట్‌ల మీద అతడికి నమ్మకం లేదు. అతడికి నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరే అవకాశం ఉన్నప్పటికీ దానిని ఉపయోగించుకోలేదు. వేరే దర్శకుడి దగ్గర పని చేసి ఓ షార్ట్ ఫిలింను తెరకెక్కించాడు. ఆ షార్ట్ ఫిలిం నాకు నచ్చడంతో నాదగ్గర అసిస్టెంట్‌గా చేరాడు’’ అని వెట్రిమారన్ చెప్పాడు. 


‘ఆడు కాలం’ చిత్రం నేషనల్ అవార్డులను గెలుపొందడంలో మతి మారన్ పాత్ర ఎంతో ఉందని వెట్రిమారన్ కొనియాడాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా తొమ్మిది నెలలు జరిగిందని అతడు గుర్తు చేసుకున్నాడు. మతి మారన్  ఆ సమయంలో తనకు ఎంతో సహాయం చేశాడని పేర్కొన్నాడు. ‘సెల్ఫీ’ చిత్రంలో జీవీ. ప్రకాష్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - 2022-03-18T22:14:37+05:30 IST