‘ఇసైజ్ఞాని’కి Narendra Modi శుభాకాంక్షలు..

ABN , First Publish Date - 2022-06-03T19:06:35+05:30 IST

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా (Ilayaraja) గురువారం 80వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సౌత్ భాషలలోని సినీ ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘ఇసైజ్ఞాని’కి Narendra Modi శుభాకాంక్షలు..

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా (Ilayaraja) గురువారం 80వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సౌత్ భాషలలోని సినీ ప్రముఖులు, రాజకీయ రంగానికి చెందిన వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గురువారం ఇళయరాజాకు స్వయంగా ఫోన్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే మైలాడుదురై తిరుక్కడైయూరులోని అమృత్‌ కడేశ్వరాలయంలో శతాభిషేక వేడుకలను జరుపుకున్న విషయం తెల్సిందే. 1943 జూన్‌ 2వ తేదీ జన్మించిన ఇళయరాజా 1976, మే 14వ తేదీన విడుదలైన ‘అన్నకిళి’ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. 


అప్పటి నుంచి 46 సంవత్సరాలుగా ఆయన సంగీత ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇన్నేళ్ళలో ఆయన వెయ్యికిపైగా చిత్రాల్లో కొన్ని వేలపాటలకు స్వరాలు సమకూర్చారు. ఈ 46 యేళ్ళ కాలంలో ఎన్నో విమర్శలు, ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఆయన తన సినీ సంగీత ప్రయాణాన్ని మాత్రం కొనసాగిస్తునే ఉన్నారు. కాగా, పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ విడుదల చేసిన ప్రకటనలో పద్మ విభూషణ్‌ అవార్డు పొందిన ఇళయరాజా భారతరత్నతో పాటు దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాలను అందుకుని మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.


కాగా, ప్రస్తుతం ఈ మ్యూజిక్ మాస్ట్రో పది చిత్రాలకు పైగానే సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు. వీటిలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న 'రంగ మార్తాండ', పా.రంజిత్ దర్శకత్వంలో 'చియాన్' విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా, విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న చిత్రం, ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ రూపొందిస్తున్న చిత్రంతో పాటు కొత్త దర్శకులు పరిచయమవుతున్న సినిమాలు ఉన్నాయి.   

Updated Date - 2022-06-03T19:06:35+05:30 IST