నగ్నంగా నాయకుడు...

ABN , First Publish Date - 2022-07-07T06:33:17+05:30 IST

సినిమా చిన్నదైనా, పెద్దదయినా... ప్రాంతీయ భాషా చిత్రమైనా పాన్‌ ఇండియా అయినా... ప్రేక్షకుణ్ణి తమ సినిమాకు రప్పించడమే ప్రచార బృందాల పని. తమ సినిమావైపు ప్రేక్షకుడి దృష్టి మరల్చడానికి...

నగ్నంగా నాయకుడు...

కోట్ల రూపాయల ఖర్చుతో రాని ప్రచారం కేవలం ఒకే ఒక పోస్టర్‌తో వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు! 

ముఖ్యంగా ప్రచారానికి పెద్దపీట వేసే చిత్ర పరిశ్రమలో అయితే పబ్లిసిటీ కోసమే ప్రత్యేకంగా  క్రియేటివ్‌ టీమ్స్‌  పనిచేస్తుంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఇప్పుడు ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు హీరోయిన్ల ఎక్స్‌పోజింగ్‌ స్టిల్స్‌తో పోస్టర్స్‌ తయారు చేసి ఊరు, వాడా అంటించేసి ప్రచారం చేసేవారు. ఇప్పుడు హీరోల వంతు అన్నట్లు పరిస్థితులు మారుతున్నాయి. ప్రచార వ్యూహంలో భాగంగా కొందరు హీరోలు  నగ్నంగా, అర్థ నగ్నంగా పోస్టర్లలో కనిపించడానికి వెనుకాడటం లేదు. 


సినిమా చిన్నదైనా, పెద్దదయినా... ప్రాంతీయ భాషా చిత్రమైనా పాన్‌ ఇండియా అయినా... ప్రేక్షకుణ్ణి తమ సినిమాకు రప్పించడమే ప్రచార బృందాల పని. తమ సినిమావైపు ప్రేక్షకుడి దృష్టి మరల్చడానికి,  వారిలో ఆసక్తిని పెంచి  థియేటర్‌ దాకా తీసుకురావడానికి ప్రమోషన్స్‌ టీమ్స్‌ ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆలోచిస్తుంటాయి. కొన్నిసార్లు పాత ఫార్మూలానే మళ్లీ కొత్తగా వాడుతున్నారు. 


పూలగుత్తి పలకల దేహం

‘లైగర్‌’... విజయ్‌ దేవరకొండకు కథానాయకుడిగా తొలి పాన్‌ ఇండియా చిత్రం. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో దానికి తగ్గట్లు హీరో మంచి ఫిజిక్‌ మెయింటైన్‌ చేశాడు. అయితే కథలో భాగమో, లేదా ప్రచారం కోసమే చేశారో తెలియదు కానీ ‘లైగర్‌’ బృందం విజయ్‌ నగ్నంగా దిగిన స్టిల్‌ను విడుదల చేసింది. అందులో ఎనిమిది పలకల దేహంతో బట్టలు లేకుండా  పూలగుత్తిని మాత్రమే  పట్టుకొని విజయ్‌ కనిపించాడు. ఆయన అంత బోల్డ్‌గా కనిపించడంతో ఒక్కసారిగా ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరలయింది. ఇప్పటికే షూటింగ్‌ పార్ట్‌ పూర్తయి, నిర్మాణానంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఆగస్టు 25న ఈ చిత్రం విడుదలవుతోంది. తాజాగా వదిలిన పోస్టర్‌తో ఒక్కసారిగా ఇటు పరిశ్రమలో, అటు ప్రేక్షకుల్లో మళ్లీ ‘లైగర్‌’ చర్చనీయాంశం అయ్యాడు.  దాంతో యూనిట్‌ లక్ష్యం నెరవేరినట్లయింది. 


ఫలించని ప్రచారం 

అయితే ఎన్ని జిమ్మిక్కులు చేసినా కథలో దమ్ము ఉంటేనే ప్రేక్షకుడు ఏ సినిమాను అయినా కనికరిస్తున్నాడు. దానికి ఉదాహరణ సంపూర్ణే్‌షబాబు ‘క్యాలీఫ్లవర్‌’. తనదైన శైలిలో ఓ వర్గం ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు సంపూర్ణే్‌షబాబు.  ‘క్యాలీప్లవర్‌’ సినిమా కోసం ‘లైగర్‌’ తరహా ప్రచారంతో గతేడాది థియేటర్లలోకి వచ్చాడు. సంపూ నగ్నంగా నిలబడి మొల దగ్గర క్యాలీఫ్లవర్‌ గుత్తులు పట్టుకొని కనిపించాడు. సినిమాకు ఇదే మెయిన్‌ పోస్టర్‌. హీరో అలా కనిపించడానికి కథలో ఓ కారణం ఉంటుందని ఏవేవో సమర్థనలు చెప్పారు కానీ ఆ పోస్టర్‌ వల్ల సంపూర్ణే్‌షబాబుకు, ఆ సినిమాకు అదనంగా ఒరిగిందేమీ లేదు. 


కంటెంట్‌ బాగుంటే కొంత ప్లస్‌ 

అయితే అన్ని సినిమాల విషయంలోనూ ఇలాంటి ప్రతికూల ఫలితం రావాలనేం లేదు. సినిమా విడుదలకు ముందు నగ్నంగా హీరోలు కనబడిన పోస్టర్‌లు వదిలితే అవి ప్రేక్షకుల్లో ఎంతో కొంత ఆసక్తిని కలిగించడం ఖాయం. నటుడిగా ప్రయోగాలు చేయడంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోల్లో ఆమిర్‌ ముందుంటారు. ఆయన హీరోగా 2014లో వచ్చిన ‘పీకే’ చిత్రం బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ . ‘పీకే’లో ఆయన గ్రహాంతరవాసిగా తన నటనతో అలరించారు. ఇందులో ఆయన ఓ సన్నివేశంలో నగ్నంగా కనిపించారు. మొలకు రేడియో అడ్డం పెట్టుకున్న ఆమిర్‌ పోస్టర్‌ అప్పట్లో పెద్ద సంచలనం. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి, థియేటర్లదాకా తీసుకురావడంలో ఆ పోస్టర్‌ చాలా బాగా పనిచేసిందనే చెప్పాలి. 


పాత ట్రెండే కొత్తగా

హీరోలు సినిమాల్లో నగ్నంగా కనపడడం ఈ మధ్యనే మొదలైంది కాదు. గతంలోనూ పలువురు హీరోలు కథ డిమాండ్‌ మేరకు నగ్నంగా నటించారు. అల్లరి నరేష్‌ ‘నాంది’ సినిమాలో నగ్నంగా కనిపించారు. ‘ఆపరేషన్‌ దుర్యోదన’లో శ్రీకాంత్‌, ‘బాయ్స్‌’లో సిద్ధార్థ్‌, ‘ఈగ’లో సుదీప్‌ నగ్నంగా కనిపించారు. విలక్షణ నటులుగా గుర్తింపు దక్కించుకున్న కమల్‌హాసన్‌, ప్రకా్‌షరాజ్‌ కూడా కొన్ని సినిమాల్లో దిగంబరంగా కనిపించారు. కొందరు బాలీవుడ్‌ హీరోలూ నగ్నంగా కనిపించారు. ‘సావరియా’లో రణ్‌బీర్‌కపూర్‌, ‘దోస్తానా’, ‘న్యూయార్క్‌’ చిత్రాల్లో జాన్‌ అబ్రహం, ‘షహీద్‌’లో రాజ్‌కుమార్‌రావు కథానుసారం నగ్నంగా కనిపించారు. 


ఒక్క పోస్టర్‌తో 

సినిమా తీయడం ఒకెత్తు, దాన్ని సరైన రీతిలో ప్రేక్షకుల చెంతకు చేర్చడం ఒకెత్తు. ఈ రెండింటి కోసం చిత్రబృందాలు అహర్నిశలు శ్రమిస్తుంటాయి.  ప్రచారంతోనే ప్రేక్షకుణ్ణి థియేటర్‌ దగ్గరకి తీసుకురావాలి. ఎన్ని రకాల కొత్త పోకడలు పోయినా ప్రచారం విషయంలో ఇంకా ఏదో చేయాల్సిందే అని భావిస్తుంటారు. ముఖ్యంగా పాన్‌ ఇండియా సినిమాలకయితే ప్రచారం వేరే లెవల్‌లో ఉంటుంది. సినిమా ఆయుష్షు వారాంతానికి పరిమితమైన నేపథ్యంలో ఏ మాత్రం తేడా వచ్చినా పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే. అందుకే క్రియేటివ్‌ టీమ్‌లు నిరంతరం కొత్త ఆలోచనలకు పదునుపెడుతూ కొంగొత్త మార్గాల్లో తమ సినిమాను ప్రేక్షకుల చెంతకు తీసుకెళ్లాలనుకుంటాయి. స్టార్‌డమ్‌, కాంబినేషన్‌లు కొంతవరకే ప్రచారానికి ఉపయోగపడతాయి. అందుకే  ముందు ప్రేక్షకుణ్ణి థియేటర్‌దాకా రప్పిస్తే చాలనుకుంటున్న యూనిట్‌లు ఇలాంటి కొత్త పోకడలు పోతున్నాయి. 

Updated Date - 2022-07-07T06:33:17+05:30 IST