Nagarjuna: ఇక్కడ ప్రతి వీధి నాకూ జ్ఞాపకమే!

ABN , First Publish Date - 2022-10-04T21:20:48+05:30 IST

చెన్నైలోనే పుట్టి పెరిగానని, తన విద్యాభ్యాసం కూడా గిండి ఇంజనీరింగ్‌ కాలేజీలోనే జరిగిందని, అందువల్ల ఇక్కడకు వస్తే హోం టౌన్‌కు వచ్చిన అనుభూతి..

Nagarjuna: ఇక్కడ ప్రతి వీధి నాకూ జ్ఞాపకమే!

చెన్నైలోనే పుట్టి పెరిగానని, తన విద్యాభ్యాసం కూడా గిండి ఇంజనీరింగ్‌ కాలేజీలోనే జరిగిందని, అందువల్ల ఇక్కడకు వస్తే హోం టౌన్‌కు వచ్చిన అనుభూతి కలుగుతుందని టాలీవుడ్‌ అగ్రహీరో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) పేర్కొన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘రక్షగన్‌ - ది ఘోస్ట్‌’ (Ratchan The Ghost) (తమిళం). సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్‌. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రవివర్మ, మనీష్‌ చౌదరి, విక్రమాదిత్య ఇతర పాత్రలు పోసించారు. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావ్‌, శరత్‌ మరార్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రచన, దర్శకత్వం ప్రవీణ్‌ సత్తారు. ఈ 5న దసరా సందర్భంగా విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని సోమవారం చెన్నై నగరంలో చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. 


ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ముందుగా బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘పీఎస్‌’ (ponniyin selvan) టీంకు నా అభినందనలు. మణిరత్నం మరోమారు మాస్టర్‌ క్రాఫ్ట్‌మెన్‌ అని నిరూపించుకున్నారు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. విద్యాభ్యాసం కూడా గిండి ఇంజనీరింగ్‌ కాలేజీలో సాగింది. మా నాన్న హైదరాబాద్‌కు వెళ్ళడంతో అక్కడకెళ్ళి స్థిరపడిపోయాను. ఇక్కడ ఉండే ప్రతి వీధి, బ్రిడ్జి ప్రతిదీ నాకు జ్ఞాపకమే. నేను నటించిన ‘గీతాంజలి’ చిత్రం తొలిసారి తమిళంలో విడుదలైంది. ఆ తర్వాత ‘రక్షకన్‌’, ‘తోళా’, ‘పయనం’ వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఇపుడు మరోమారు మీ ముందుకు వస్తున్నాను. ఇది హైఓల్టేజ్‌ యాక్షన్‌ మూవీ ‘రక్షగన్‌ - ది ఘోస్ట్‌’. ఈ చిత్ర కథ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అందుకే తమిళంలో కూడా విడుదల చేస్తున్నాం. కరోనాతో దేశం, ప్రపంచం అంతా చిన్నదైపోయింది. భాషతో నిమిత్తం లేకుండా మంచి కథాంశంతో కూడిన చిత్రాలను ప్రేక్షకులు ఈ కరోనా సమయంలో స్మాల్‌ స్ర్కీన్‌పై చూసి ఎంజాయ్‌ చేశారు. ఇపుడు బిగ్‌స్ర్కీన్‌పై వచ్చే సినిమాలు ఖచ్చితంగా కొత్తదనంతో ఉంటేనే ప్రేక్షకులకు రప్పించి సంతృప్తిపరచగలం. ఆ తరహాలోనే మా చిత్రం ఉంటుంది. ప్రతి ఒక్కరినీ అలరిస్తుంది. ఈ మూవీలో సొంతంగా డబ్బింగ్‌ చెప్పాను’’ అని తెలిపారు.

Updated Date - 2022-10-04T21:20:48+05:30 IST