ఏపీలోని టికెట్ల ధరలపై నాకేమీ ఇబ్బంది లేదు: నాగార్జున

ABN , First Publish Date - 2022-01-06T01:02:14+05:30 IST

ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సినిమా టికెట్ల ధరలతో సినిమాలు విడుదల చేయలేక ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఏపీలో..

ఏపీలోని టికెట్ల ధరలపై నాకేమీ ఇబ్బంది లేదు: నాగార్జున

ఏపీలో సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై కొన్ని రోజులుగా చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన సినిమా టికెట్ల ధరలతో సినిమాలు విడుదల చేయలేక ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. అయితే ఏపీలో సినిమా టికెట్ల ధరపై నాకేమీ ఇబ్బంది లేదంటూ.. తాజాగా నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. ఇంతకుముందు నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జునే నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ‘సోగ్గాడే చిన్నినాయనా’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణే సీక్వెల్‌ని కూడా తెరకెక్కించారు.


ఈ చిత్ర విడుదల వివరాలను తెలియజేసేందుకు బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాగార్జున, ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కూడా ప్రస్తావించారు. ‘‘ సినిమా వేదికపై రాజకీయాల గురించి మాట్లాడను. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడినందుకు చాలా బాధగా ఉంది. కానీ అవి పాన్ ఇండియా సినిమాలు. ఒమైక్రాన్ ప్రభావం కారణంగా ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ సినిమాల కోసం వారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కానీ ఒమైక్రాన్ ప్రభావం అలా ఉంది. ఏపీలోని సినిమా టికెట్ల ధరలపై నాకేమీ ఇబ్బంది లేదు. అంటే నా సినిమా వరకు ఇబ్బంది లేదు. ధరలు ఎక్కువుంటే కొంచెం డబ్బులు ఎక్కువస్తాయి. తక్కువ ఉంటే తక్కువ వస్తాయి. సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలైనా సరే.. మూడు సినిమాలకు స్కోప్ ఉంటుంది. నాన్నగారి టైమ్‌లో, మా టైమ్‌లో సంక్రాంతికి 5 సినిమాలు ఆడాయి. ఆ నమ్మకంతోనే ఇప్పుడు ‘బంగార్రాజు’ని విడుదల చేస్తున్నాం..’’ అని నాగార్జున అన్నారు.  

Updated Date - 2022-01-06T01:02:14+05:30 IST