‘ల‌క్ష్య’కు రాజమౌళి సినిమానే స్పూర్తి: నాగ‌శౌర్య‌

ABN , First Publish Date - 2021-12-10T03:08:24+05:30 IST

ఈ చిత్ర కథ విన్న వెంటనే నా వైపు నుంచి వందశాతం ఎఫర్ట్ పెట్టాలని అనుకున్నాను. కొత్త నాగశౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా

‘ల‌క్ష్య’కు రాజమౌళి సినిమానే స్పూర్తి: నాగ‌శౌర్య‌

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబర్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హీరో నాగ‌శౌర్య మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.


ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర కథ విన్న వెంటనే నా వైపు నుంచి వందశాతం ఎఫర్ట్ పెట్టాలని అనుకున్నాను. కొత్త నాగశౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను. వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.


ఆర్చరీ విద్య మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. తాజాగా విడుదలైన ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌లోనూ రామ్ చరణ్‌గారు విల్లుతో కనిపించారు. అన్నింటిని ఆటలు అని అంటాం కానీ ఒక్క ఆర్చరీని మాత్రమే విలు విద్య అని అంటాం. దాన్ని మనం ఎడ్యుకేషన్‌గా గౌరవిస్తాం. మన వాళ్లు దాన్ని మరిచిపోయారు. కాస్త గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం. ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. ఈ సినిమా కోసం మూడు రోజులు మాత్రమే శిక్షణ తీసుకున్నాను. చదువు తప్ప నాకు అన్నీ తొంద‌ర‌గా వస్తాయి. దేశంలోనే ఆర్చరీ నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా లక్ష్య. నా కెరీర్‌లోనూ స్పోర్ట్స్ బేస్డ్ సినిమాను చేయడం ఇదే మొదటి సారి. ఇది వరకు కూడా క్రీడా నేపథ్యంలోని కథలు నా వద్దకు వచ్చాయి. కానీ ఇది బాగా నచ్చింది. ఈ చిత్రానికి రాజమౌళిగారి ‘సై’ సినిమానే మాకు స్ఫూర్తి. ఎవ్వరికీ తెలియని ఆటను తీసుకొచ్చి కమర్షియల్‌గా జోడించి అద్బుతంగా చూపించారు. నెరేషన్ బాగుంటే సినిమా అద్బుతంగా వస్తుంది. అందులో సంతోష్ సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది.


ఇప్పుడు ప్రతీ ఒక్క హీరో బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్థు మారాడు అని చెప్పడానికి అలా బాడీలో మార్పులు చూపించాను. ఒక్కసారి అనుకుంటే ఏ యాక్టర్ అయినా సిక్స్ ప్యాక్ చేస్తారు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే అందరం చాలా కష్టపడతాం. ఈ సినిమా కోసం దాదాపు తొమ్మిది రోజులు కనీసం నీళ్లు కూడా ముట్టుకోలేదు. ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు. కేతిక శర్మ రొమాంటిక్ సినిమాతో బాగా అందరికీ రీచ్ అయ్యారు. ఊహలు గుసగుసలాడే సినిమా నాకు చాలా కాలం గుర్తుండిపోయింది. కేతిక శర్మకు రొమాంటిక్ సినిమా అలా గుర్తుండిపోతుంది. కేతిక శర్మ చాలా అందంగా ఉంటుంది. చక్కగా నటించింది. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను.. ’’ అని తెలిపారు.

Updated Date - 2021-12-10T03:08:24+05:30 IST