సదా.. ఎన్టీఆర్‌ ఒక్కడే!

Twitter IconWatsapp IconFacebook Icon

తెలుగునాట చలనచిత్ర సీమలోనూ, రాజకీయ రణరంగంలోనూ మరపురాని, మరచిపోలేని, మరువకూడని ఘనవిజయాలను సాధించిన ఘనత నందమూరి తారక రామారావుకే సాధ్యమైంది. ‘తెలుగుదేశం’ పార్టీ నెలకొల్పి, అనతికాలంలోనే ఆయన సాధించిన అపురూపమైన విజయాన్ని ఉటంకిస్తూ ఆ రోజుల్లో ‘విజయచిత్ర’ మాస పత్రిక ‘ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌’ శీర్షికతో ఎడిటోరియల్‌ ప్రచురించింది. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఆ వ్యాసాన్ని పునస్మరించుకోవాల్సిన అవసరం ఉంది. 


‘తొలి నుంచీ ఆయనకు పట్టుదల ఎక్కువ. కృషి ఎక్కువ, అనుకున్నది సాధించాలనే మొండిపట్టు మరీ ఎక్కువ. ఆ సాధన కోసం అహోరాత్రులు దీక్షతో కృషి చేయడం ఎప్పటినుంచో ఆయనకు అలవాటు. క్రమశిక్షణ, నియమనిష్టలు జీవితంతో పెనవేసి, విడివడని ముడివేసి సాగడం ఆయన అలవాటు. లేకపోతే, అంతకుముందెన్నడూ రాజకీయాలతో ఏ విధంగానూ ప్రతక్ష, పరోక్ష సంబంధాలు లేని వ్యక్తి, అనుకున్న వెంటనే ‘పార్టీ’ ఆరంభించి, తొమ్మిది మాసాల గడవులో ఆ పార్టీని ‘రూలింగ్‌ పార్టీ’గా చెయ్యగలగడం సాధ్యమా? తానే ప్రచారకుడై, ఊరు, గ్రామం, పల్లె తిరిగి 35 వేల కిలోమీటర్ల దూరం పర్యటించి, తన సిద్ధాంతాలు, ఆశయాలూ ప్రజలకు విన్నవించి, తనవైపు తిప్పుకోగలగడం సాధ్యమా? ఎండ, వానా లక్ష్యపెట్టకుండా, చెట్టూపుట్టా తనదిగానే చేసుకుని, కటిక నేల మీద విశ్రాంతి తీసుకుంటూ, వేళ, పద్ధతీ లేకుండా ఆహారం తీసుకుంటూ లక్ష్యసాధన కోసం కృషి చెయ్యడం ఇంకొకరికి సాధ్యమా? అదీ.. ఆయన మొండి పట్టు! అరవై ఏళ్ల వయసులో ఆ పట్టునే నమ్ముకుని, ఆయన ప్రజాబలం సంపాదించారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో, సినిమా తార నందమూరి తారక రామారావుది అపూర్వమైన విజయం.


సినిమాల ద్వారా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఆయనకు ఉన్న పేరుకు మరింత పేరు తెచ్చి, ‘సూపర్‌స్టార్‌ ఆఫ్‌ ఫిల్మ్స్‌’ అనిపించుకున్నట్లు, రాజకీయాల్లోకి ప్రవేశించి, అందరినీ మించి పోయి ‘సూపర్‌ స్టార్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌’ అనిపించుకున్నారు. ఒక ధ్యేయం, లక్ష్యం, ఆదర్శం ఉన్నట్లయితే సాధించలేదని ఏమీ లేదని ఎన్టీఆర్‌ జీవితం మరోసారి పాఠం చెప్పింది. చలనచిత్రాలు వినోద సాధనాలే అయినా, వాటిలో ఉన్నవారు... తలుచుకుంటే దేశాలే ఏలగలరనీ, రాజకీయ చరిత్రలను తారుమారు చేయగలరనీ మరోసారి ఆయన జీవితం చెప్పింది. 30 ఏళ్ల సినిమా జీవితం ఒక ఎత్తు, ‘ముఖ్యమంత్రి’గా రావడానికి ముందు జరిగిన కృషి ఒక ఎత్తు. మొత్తం ప్రపంచ సినిమారంగం గుండె చరచుకుని దర్జాగా చెప్పుకోగల ఘనతను ఆయన సాధించి పెట్టారు. సినిమాకు, ప్రజలకు ఉన్న పొత్తు ఎలాంటిదో ఆయన చూపెట్టగలిగారు. రామారావు విజయం చలనచిత్ర రంగ విజయం. ఆ కార్యసాధకుడికి అభినందనలు!


నిజమే. ఆ కార్యసాధకుడు రాజకీయ ప్రవేశం చేయక ముందు దేశంలో ముగ్గురు, నలుగురు నటులు మాత్రమే చట్ట సభలలోకి అడుగుపెట్టారు. అయితే ఎన్టీఆర్‌ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత యావద్భారతంలోనే ఓ రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ఒకప్పుడు సినిమా నటులంటేనే  సమాజంలో ఒక చిన్న చూపు ఉండేది. అంతెందుకు సినిమా వాళ్లకు పిల్లను ఇవ్వడానికి సైతం వెనుకాడే పరిస్థితులు ఉండేవి. అలాంటి సినీ తారలకు మన దేశంలోనే ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఎన్టీఆర్‌ నట, రాజకీయ జీవితాలు ప్రేరణగా నిలిచాయని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. అంతకుముందు రాజకీయ నాయకులను సినిమా వాళ్లు కలవడానికి పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశానంతరం సినిమా తారలకూ విలువ పెరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ చూసినా రాజకీయ నాయకులు సినిమా వాళ్లకు ‘రెడ్‌ కార్పెట్‌’ పరుస్తున్న సంగతి తెలిసిందే! మన దేశ రాజకీయ చరిత్రలో ఎన్టీఆర్‌ రాజకీయ ప్రవేశం తర్వాత ఆయన స్ఫూర్తితో చట్టసభల్లో ప్రవేశించిన సినిమా వాళ్ల సంఖ్య నాలుగు అంకెలకు చేరుకుంటోంది. ఈనాటికీ తెలుగు నేలపై చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్‌ పేరుని స్మరించని వారు ఉండరు. రాజకీయాల్లోనూ రామారావు చూపిన ప్రభావాన్ని పాలిటిక్స్‌లో ప్రవేశించాలనుకున్న ప్రతి నటి, నటుడు స్మరించుకొని తీరాల్సిందే. సినిమా జనానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకు వచ్చిన ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చిత్రసీమ తరలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.


కొమ్మినేని వెంకటేశ్వరావు

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.