నా బలాలే నా బలహీనతలు

ABN , First Publish Date - 2022-07-03T09:25:50+05:30 IST

చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను.

నా బలాలే  నా బలహీనతలు

పెద్ద ప్రిపరేషనేదీ లేకుండానే  వెండితెర మీదకొచ్చేసి... ప్రేక్షకుల ఊహల్తో గుసగుసలాడారు రాశీ ఖన్నా. ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఆధ్యాత్మికత నుంచి ఓటీటీల వరకూ ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లివి... 


పరిశ్రమలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఎలా అనిపిస్తోంది? 

చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంత దూరం ప్రయాణిస్తానని నేను అనుకోలేదు. ఎందుకంటే మా కుటుంబంలో సినీ పరిశ్రమకు సంబంధించినవారు ఎవరూ లేరు. నా కెరీర్‌కు సంబంధించి ఏ నిర్ణయమైనా నేనే తీసుకున్నా. నన్ను ఇంతగా ప్రోత్సహిస్తున్న పరిశ్రమకు, అభిమానులకు రుణపడి ఉంటాను. ఇటీవల విశాఖపట్నం వెళ్లినప్పుడు నన్ను ఎంతగా అభిమానిస్తున్నారో కళ్లారా చూశాను. ఇది నా కష్టానికి దక్కిన ఫలితం. చాలా సంతోషంగా ఉంది. 


మీరు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో కూడా చేశారు. ఏ ఇండస్ర్టీని దగ్గరగా ఫీలవుతారు? 

నాకు అలాంటిదేమీ లేదు. కొన్ని రోజులు చెన్నై, కొన్ని రోజులు హైదరాబాద్‌, ముంబయి, ఢిల్లీ... ఇలా అన్నింటితో నాకు అనుబంధం ఉంది. నా మాతృభాష హిందీనే అయినా నాకు అవకాశాలు ఎక్కువగా తమిళ్‌, తెలుగు నుంచే వాచ్చాయి. అందరి ప్రేమనూ పొందడం గొప్ప అనుభూతినిస్తోంది. 


మీ ఈ జర్నీలో మధుర జ్ఞాపకం? 

‘ఊహలు గుసగుసలాడే’లో నటించడం. ఎందుకంటే అది నాకు మొదటి తెలుగు సినిమా. ఆ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. అప్పుడు నాకు తెలుగు రాదు. పరిశ్రమ గురించి ఏమీ తెలియదు. అంతా కొత్త. కష్టపడి తెలుగు నేర్చుకున్నాను. అయితే సినిమా చూసిన తరువాత ఆ కష్టం మరిచిపోయాను. అది చక్కని ప్రేమ కథ. బాగా వచ్చింది. అందరికీ నచ్చింది. తరువాత నన్ను చాలామంది అడిగారు... ‘మీరు తెలుగు అమ్మాయా’ అని! ఇక్కడ ఎంతో మంది అభిమానులయ్యారు. అందుకే ఆ చిత్రం నాకు అంత ప్రత్యేకం... మధురమైన జ్ఞాపకం. 


హిట్‌ అవుతుందనుకున్న సినిమా సరిగా ఆడక... నిరాశపడిన సందర్భాలున్నాయా? 

చాలా ఉన్నాయి. జీవితంలో ఎన్నో అనుకొంటాం. అన్నీ జరగవు. నేను ఫలితాల గురించి పట్టించుకోను. స్పోర్టివ్‌గా తీసుకొంటా. ఇవన్నీ జర్నీలో భాగమని అనుకొంటానంతే! 


మీ బాల్యం గురించి చెప్పండి? 

నా బాల్యమంతా చాలా సంతోషంగా సాగిపోయింది. మాది మధ్యతరగతి కుటుంబం. పుట్టింది, పెరిగింది ఢిల్లీలో. మాకు అంత డబ్బు లేదు. కానీ... ఇంట్లో అనుబంధాలకు, ఆనందానికి కొదవలేదు. సంతోషంగా జీవించడానికి డబ్బు అక్కర్లేదు కదా. అలాగే నేను టైమ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను. క్రమశిక్షణతో నడుచుకోవడం మా అమ్మా నాన్న చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఏ సమయంలోనైనా వారు నాతో ఉంటారు. నేను నా కుటుంబానికి విలువనిస్తాను. 


చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారా? 

స్కూల్లో, కాలేజీలో నేను చాలా సిగ్గరిని. అల్లరి పిల్లను కాను. 


మరి సినిమాల్లోకి ఎలా వచ్చారు? 

నటిని అవుతానని నేను అస్సలు అనుకోలేదు. చదువులో టాప్‌. ఐఏఎస్‌ కావాలనుకునేదాన్ని. అయితే కాలేజీలో ఉన్నప్పుడు ఓ ఏజెన్సీకి మోడలింగ్‌ చేశాను. తరువాత యాక్టర్‌ కావాలనుకుంటున్న మా ఫ్రెండ్‌తో కలిసి సరదాగా నేను కూడా ముంబయి వెళ్లాను. అక్కడ ‘మద్రాస్‌ కేఫ్‌’ ఆడిషన్స్‌ జరుగుతున్నాయి. ‘మోడలింగ్‌ చేస్తున్నావు... నువ్వు కూడా ఆడిషన్స్‌ ఇవ్వచ్చు కదా’ అని నన్ను అడిగారు. పట్టించుకోలేదు. రెండు రోజుల తరువాత నాకు ఫోన్‌ చేశారు... ఫలానా పాత్రకు నేనైతే సరిపోతానని! ‘నటి కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. నాకు నటన కూడా రాదు’ అన్నాను. మూడోసారి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ‘వచ్చి ఆడిషన్స్‌ ఇవ్వచ్చు కదా’ అని! ఇక కాదనలేక వెళ్లాను. అలా నటినయ్యాను. ఇదే విధి (డెస్టినీ) అంటే! అయితే నేను ఎందులో ఉంటే అందులో నా శక్తివంచన లేకుండా కష్టపడటం అలవాటు.

 

ఒక్క ముక్కలో మీ గురించి చెప్పమంటే..?

పీస్‌ఫుల్‌. కోపం వస్తుంది కానీ.. చాలా అరుదు. వచ్చినా వెంటనే పోతుంది. నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. 


మీ బలం, బలహీనతలేమిటి?

నా జీవితంపై నాకు మక్కువ ఎక్కువ. కష్టపడడం, నా నిర్ణయాలు నేనే తీసుకోవడం... ఇవే నా బలాలు అనుకొంటున్నాను. నా బలాలే నా బలహీనతలు కూడా! ఎందుకంటే కొన్నిసార్లు ఒక నిర్ణయం తీసుకొంటే దాన్ని మార్చుకోను. మొండి పట్టుదలతో ఉంటాను. అలాగే నేను టైమ్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తాను. దానివల్ల మంచి జరుగుతుంది... కొన్నిసార్లు సమస్యగానూ మారుతుంది. కానీ నేను నేనుగా ఉన్నందుకు సంతోషంగా, గర్వంగా భావిస్తాను. 


ఒక మంచి ప్రాజెక్ట్‌ను వదులుకున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? 

ఒక్కసారి నేను కాదన్నానంటే ఇక దాని గురించి ఆలోచించను. వేరే ఎవరైనా చేస్తే అది హిట్‌ అయ్యుండవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం తప్పయి ఉండవచ్చు. దాని గురించి బాధపడను. ఎందుకంటే ప్రతి విజయాన్నీ... అలాగే ప్రతి అపజయాన్నీ ఒక పాఠంగా భావిస్తాను. 


మీరు చేసిన వాటిల్లో మీకు దగ్గరగా ఉన్న కేరెక్టర్‌ ఏదైనా ఉందా?

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో ప్రభావతి పాత్ర. అలాగే ‘తొలి ప్రేమ’లో వర్ష రోల్‌ నాకు బాగా దగ్గరగా అనిపిస్తుంది. 


మీ డ్రీమ్‌ రోల్‌ ఏంటి? 

చాలా ఉన్నాయి. ఒక యాక్షన్‌ సినిమా చేయాలి. థ్రిల్లర్‌, హారర్‌ లాంటివి కూడా చేయాలి. థ్రిల్లర్స్‌ నాకు చాలా ఇష్టం. అలాగే ఒక పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర. 


కొవిడ్‌ తరువాత ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయింది కదా! అలాగే మీరు కథలను ఎంచుకొనే విధానంలో కూడా ఏదైనా మార్పు వచ్చిందా?

ఇప్పుడంతా అయోమయం... ఏవి వర్కవుట్‌ అవుతాయో... ఏవి కావోనని! నటులుగా మేము కూడా ప్రస్తుత ట్రెండ్‌కు ఎలాంటి కథలు సరిపోతాయనేది తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నాం. తెలుగులో ఇప్పుడు ఓ ప్రాజెక్ట్‌ ఉంది. అది అవుటాఫ్‌ ది బాక్స్‌ కంటెంట్‌. దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సబ్జెక్ట్‌ను ఆదరిస్తారో చెప్పలేకపోతున్నాం. కానీ ఒక నటిగా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఇదే సరైన సమయం అనుకొంటున్నా. 


ఓటీటీల వల్ల మీరు చెప్పిన అవుటాఫ్‌ బాక్స్‌ చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేశాయి. మన చిత్రాల్లో ఇంకా హీరోయిను గ్లామరస్‌ పాత్రలకే పరిమితమవుతున్నారు. ఒక నటిగా దీన్ని మీరెలా చూస్తారు? 

ఇప్పుడు పరిస్థితి మారింది. కథానాయిక తన భుజాలపై నడిపించే కథలు కూడా వస్తున్నాయి. ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. ఓటీటీ వల్ల మంచి మార్పులు కూడా వచ్చాయి. సినిమా చూడాలంటే ప్రేక్షకులు థియేటర్‌కే వెళ్లక్కర్లేదు ఇప్పుడు. అయితే థియేటర్‌లో చూసిన అనుభూతి రాదనుకోండి. 


ఓటీటీ కోసం ఏవైనా ప్రాజెక్ట్‌లు చేస్తున్నారా?  

ప్రస్తుతం ‘ఫర్జీ’ చేస్తున్నాను. షూటింగ్‌ పూర్తయింది ప్రస్తుతం డబ్బింగ్‌ జరుగుతోంది. దాని విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఓటీటీలో ఎంత వరకు విజయవంతం అయ్యామనేది తెలుస్తుంది కదా! 


చాలామంది హీరోయిన్లు గ్లామర్‌ రోల్స్‌నే ఎందుకు ఎంచుకొంటారు? అభద్రతా భావం వల్లా? 

అభద్రతా భావం కాదనుకొంటున్నాను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటూ వెళ్లడమే ప్రధానం. ఎవరైనా వచ్చిన స్ర్కిప్ట్స్‌లో బాగున్నది ఎంచుకోవాలి అంతే. సో... ప్రతి నటికీ మంచి పాత్రలు రావాలని లేదు. కమర్షియల్‌... కంటెంట్‌ ఓరియంటెడ్‌ సినిమాలకు బ్యాలెన్స్‌ చేయాలని ఉంటుంది. కానీ అది మన చేతుల్లో ఉండదు. ఒకవేళ మనం టాలెంటెడ్‌ అని డైరెక్టర్‌ భావిస్తే బరువైన పాత్రలు ఇస్తారు. కనుక ప్రతి సినిమాలో మంచి నటిగా నిరూపించుకోవాలి. నేనైతే రెండు రకాల సినిమాలూ చేశాను. ఇప్పుడు నాకు హీరోయిన్‌కు ప్రాధాన్యమున్న పాత్రలు కూడా చాలా వస్తున్నాయి. 


సివిఎల్‌ఎన్‌ ప్రసాద్‌


నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఎలాంటి పరిస్థితి ఎదురైనా పారిపోను... ఎదుర్కొంటాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నాకు నా కుటుంబం, నా మిత్రులు ఉన్నారు. ఇంట్లో కూడా నేను సినిమాల గురించి అస్సలు మాట్లాడను. నా స్నేహితులు కూడా ఆ విషయాలు చర్చించరు. వ్యక్తిగత జీవితం... వృత్తిగత జీవితం... రెండూ వేర్వేరు. నా వృత్తిగత జీవితం ఎప్పుడూ నా వ్యక్తిగత జీవితాన్ని శాసించకూడదనేది నా సిద్ధాంతం. అందుకే బహుశా నేను ప్రశాంతంగా ఉంటానేమో! 


నా దృష్టిలో ఆధ్యాత్మికత అంటే జీవితంలో దేన్నయినా ఒకేలా తీసుకోవాలి... జయమైనా... అపజయమైనా! నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నాకు ఏదైతే వస్తుందో అది నా కర్మను అనుసరించే. అందుకే విజయం వరిస్తే తలకు ఎక్కించుకోను. అపజయం ఎదురైనప్పుడు బాధపడను. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటా. భావోద్వేగాలను బ్యాలెన్స్‌ చేసుకోవడమే జీవితమనేది నా భావన. బ్రహ్మకుమారి బీకే శివాని ప్రబోధాలను నేను అనుసరిస్తాను. బ్రహ్మకుమారీస్‌ ఆలోచనా విధానం నాకు బాగా నచ్చింది. మా కుటుంబానికి కూడా ఒక గురువు ఉన్నారు. ఆయన్ను ఫాలో అవుతాం. 

Updated Date - 2022-07-03T09:25:50+05:30 IST