Mukhachitram Film Review: ప్రియ వడ్లమాని నటన అదరగొట్టింది, కానీ...

ABN , First Publish Date - 2022-12-09T23:28:15+05:30 IST

‘కలర్ ఫోటో’ (National Award winning film Colour Photo) అనే సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj). ఇప్పుడు అదే సందీప్

Mukhachitram Film Review: ప్రియ వడ్లమాని నటన అదరగొట్టింది, కానీ...

సినిమా: ముఖచిత్రం 

నటీనటులు: వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, అయేషా, చైతన్య రావ్, రవిశంకర్, విశ్వక్ సేన్ తదితరులు

సంగీతం: కాలభైరవ

కథ, కథనం, మాటలు: సందీప్ రాజ్

నిర్మాతలు: ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల

దర్శకత్వం: గంగాధర్

విడుదల తేదీ: 09-12-2022


-- సురేష్ కవిరాయని 


‘కలర్ ఫోటో’ (National Award winning film Colour Photo) అనే సినిమాకి జాతీయ అవార్డు వచ్చింది. ఆ సినిమాకి దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj). ఇప్పుడు అదే సందీప్ ఈ ‘ముఖచిత్రం’ (Mukhachitram) అనే సినిమాకి కథ, కథనం, మాటలు అందించాడు. మరో యువ దర్శకుడు గంగాధర్ దర్శకుడిగా ఈ సినిమాతో వచ్చాడు. ‘సినిమా బండి’లో చేసిన వికాస్ వశిష్ట, ‘హుషారు’ సినిమాలో చేసిన ప్రియ వడ్లమాని ఇందులో జంటగా నటించారు. చైతన్య రావు, ఆయేషా ఖాన్ మిగిలిన ప్రధాన పాత్రల్లో కనిపించారు. విశ్వక్ సేన్ (Vishwak Sen) ఒక ప్రత్యేక పాత్రలో కనిపించిన.. ఈ సినిమా ప్రచార చిత్రాలు బాగా ఉండటం, ఈ సినిమాకి కథ రాసిన సందీప్ ముందు సినిమా జాతీయ అవార్డు గెలుచుకోవటం వంటివి ఈ ‘ముఖచిత్రం’ సినిమా పట్ల ఆసక్తిని రేపాయి. ఇక సినిమా ఎలా ఉందో చూద్దాం. 


కథ (Mukhachitram story): 

హైదరాబాద్‌లో రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట) పేరున్న ప్లాస్టిక్ సర్జన్. అతనికి వాట్సాప్‌లో అనుకోకుండా ఒక పెళ్లిళ్ల పేరయ్య.. వడ్లమాని మహతి (ప్రియా వడ్లమాని) అనే అమ్మాయి ఫోటో పంపిస్తాడు. రాజ్ ఆమెని చూసి ఇష్టపడి ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. థానే స్వయంగా తన అన్న వదినలను తీసుకెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడి ఖాయం చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నాక మహతిని హైదరాబాద్ తీసుకు వస్తాడు. మాయా ఫెర్నాండేజ్ (ఆయేషా ఖాన్) అనే అమ్మాయి రాజ్‌కి స్కూల్ నుండి స్నేహితురాలు. ఆమె రాజ్‌కి సడన్‌గా హాస్పిటల్‌లో పరిచయం అవుతుంది, ఆ తరువాత తరచూ కలుస్తూ ఉంటుంది. ఒక రోజు మాయా ఫెర్నాండేజ్ తన టూ-వీలర్ మీద వెళుతూ యాక్సిడెంట్‌కి గురై.., కోమాలోకి వెళ్ళిపోతుంది. డాక్టర్లు ఆమె బతకటం సగం సగం ఛాన్స్ అని చెప్తారు. ఆ మరునాడు పొద్దున్నే తన ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మహతి కిందపడిపోతుంది, ఆసుపత్రికి తీసుకెళ్ళాక మరణిస్తుంది. ఆమెది సహజ మరణమా? లేక ఎవరైనా చంపేశారా? కోమాలోకి వెళ్లిన మాయ బతికి బయటకి వచ్చిందా? చనిపోయిన మహతి, డాక్టర్ రాజ్ మీద కోర్టులో ఎలా కేసు వేస్తుంది? ఇవన్నీ తెలియాలంటే ‘ముఖచిత్రం’ సినిమా చూడాల్సిందే. (Mukhachitram Review)


విశ్లేషణ:

సందీప్ రాజ్ ఈ ‘ముఖచిత్రం’ సినిమాకి కథ అందించారు. అయితే ఇందులో చెప్పే మెసేజ్ పాతదే అయినా, కాస్త కొత్తగా చెప్పారు అంతే. హిందీ సినిమా ‘పింక్’, అదే సినిమాని తెలుగులో ‘వకీల్ సాబ్’ అనే పేరుతో తీశారు. ఇందులో వున్న మెసేజ్ ఒక అమ్మాయి, భార్య అయినా, వేశ్య అయినా, ప్రియురాలు అయినా లేదా ఇంకెటువంటి అమ్మాయి అయినా శృంగారానికి మగవాడికి ఒకసారి ‘నో’ చెబితే ‘నో’ అనే అర్థం. అలా చెప్పినప్పుడు ఆ మగవాడు కనుక బలవంతం చేస్తే అది ‘రేప్’ కిందకి వస్తుంది. అయితే ఇదే మెసేజ్‌తో ఈ ‘ముఖచిత్రం’ సినిమా కూడా తీశారు. కాకపోతే కాస్త కొత్తగా చూపిద్దాం అనుకున్నారు. కాన్సెప్ట్ బాగుంది కానీ, ఇంకా కథ మీద, కథనం మీద ఇంకాస్త దృష్టి పెడితే.. కచ్చితంగా ఇది మంచి సినిమా అయ్యేది. 

చివరిలో రవిశంకర్, విశ్వక్ సేన్ వంటి నటులు కోర్టు‌లో వాదించే సన్నివేశాలు అంత రక్తి కట్టించలేకపోయాయి. సందీప్ రాజ్ ఈ సినిమాకి కథతో పాటు మాటలు కూడా రాశాడు. మాటలు అయితే మాత్రం చాలా పదునుగా వున్నాయి. అలాగే దర్శకుడు గంగాధర్ సినిమా బాగానే తీసాడు కానీ, సినిమా చూశాక మామూలుగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం కథ మీద దృష్టి పెట్టి వుంటే.., చివర అరగంట ఇంకా ఆసక్తికరంగా తీస్తే బాగుండేది అనిపిస్తుంది. ఏమైనా ఈ సినిమాకి చాలామంది యువకులు పని చేశారు, వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని హర్షించాలి.  (Mukhachitram Telugu Review)


ఇక నటీనటుల విషయానికి వస్తే, సినిమాకి ప్రియ వడ్లమాని హైలైట్ అని మాత్రం చెప్పొచ్చు. ఆమెకు రెండు షేడ్స్ వుండే పాత్ర దొరికింది. మొదటి దానిలో అమాయకంగా వుండే పల్లెటూరి అమ్మాయిలా కనిపించేది, రెండో పాత్ర మొదటి దానికి పూర్తి భిన్నంగా వుండే పాత్ర. అయితే రెండో షేడ్ వున్న పాత్రలో మాత్రం ప్రియ అదరగొట్టింది అని మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నప్పుడు ఆమె చెప్పే డైలాగ్స్, అభినయం చాలా బాగా చేసింది. సినిమా అంతటికీ ఆమె పాత్ర మంచి పేరు తెచ్చేలా చేసింది. చాలా కాలం తరువాత ఒక తెలుగు అమ్మాయికి ఇంత మంచి పాత్ర లభించటం సంతోషకరం. అలాగే వికాస్ వశిష్ట కూడా సహజంగా చేశాడు. అతని కంఠస్వరం చాలా బాగుంది. మంచి నటుడు అయ్యే సూచనలు కనపడుతున్నాయి. చైతన్య రావు వికాస్ స్నేహితుడుగా బాగా చెయ్యడమే కాకుండా, నవ్వించాడు కూడా. అయేషా ఖాన్ కూడా ఆమెకి ఇచ్చిన పాత్ర తనకున్న పరిధిలో బాగా నటించింది. చివర్లో విశ్వక్సేన్ లాయర్ గా ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తాడు కానీ అతని ప్రభావం ఏమి సినిమా మీద పడదు. అలాగే రవి కుమార్ తన కంచు కంఠంతో  మంచి డైలాగ్స్ చెప్పాడు. మిగతా వాళ్ళు కూడా బాగా చేవారు అని చెప్పాలి. ఈ సినిమాకి సంగీతం కాల భైరవ ఇచ్చాడు, సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సాంకేతికపరంగా సినిమా బాగుంది. (Mukhachitram Movie Review)


చివరగా ‘ముఖచిత్రం’లో ఒక సందేశం వుంది. అయితే సందీప్ కథ, గంగాధర్ చెప్పే విధానం ఇంకా కొంచెం గొప్పగా చెప్పి ఉంటే, సినిమా ఇంకో లెవెల్‌లో ఉండేది. అక్కడక్కడా మంచి మంచి సన్నివేశాలు వున్నాయి. శుక్రవారం విడుదలైన చాలా చిన్న సినిమాల్లో ఈ ‘ముఖచిత్రం’ కాస్త బాగుంది, టైం పాస్ సినిమా అని చెప్పొచ్చు. (Telugu Movie Mukhachitram Review)

Updated Date - 2022-12-09T23:28:15+05:30 IST