అన్నయ్యతో సినిమా అప్పుడే...

ABN , First Publish Date - 2022-08-17T07:16:02+05:30 IST

పక్కింటి కుర్రాడి తరహా పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆనంద్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ లాంటి అగ్రహీరోకు తమ్ముడిగా పరిశ్రమకు పరిచయమైనా తనదైన ముద్రతో ముందుకెళుతున్నారు...

అన్నయ్యతో సినిమా అప్పుడే...

పక్కింటి కుర్రాడి తరహా పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఆనంద్‌ దేవరకొండ. విజయ్‌ దేవరకొండ లాంటి అగ్రహీరోకు తమ్ముడిగా పరిశ్రమకు పరిచయమైనా తనదైన ముద్రతో ముందుకెళుతున్నారు. సగటు ప్రేక్షకులను మెప్పించే కథలతో ఇంటిల్లిపాదిని అలరించిన ఆనంద్‌ ఈసారి ‘హైవే’ చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్‌ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్రజ్యోతితో ఆనంద్‌ పంచుకున్న విశేషాలు


అన్నయ్య ‘లైగర్‌’... మరి మీరు?

విజయ్‌ అన్నయ్యది సినిమాల్లో లైగర్‌ ‘వేగం’, నేను ఇప్పుడే ‘హైవే’ ఎక్కాను. ఇక స్పీడ్‌ పుంజుకోవాలి. 


‘హైవే’ ఎలా ఎక్కారు?

ఫస్ట్‌ లాక్‌డౌన్‌ అయిపోయాక ఈ కథ నా దగ్గరకు వచ్చింది. అప్పటికి ఇంకా సినిమాల థియేట్రికల్‌ రిలీజ్‌పై పరిశ్రమ అయోమయంలో ఉంది. దాంతో తర్వాత చేయబోయే ప్రాజెక్ట్‌ ఓటీటీకి చేద్దాం అని డిసైడ్‌ అయ్యాం. గుహన్‌ సార్‌కు థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌లు అంటే ఇష్టం కావడంతో ‘హైవే’ ప్రారంభమైంది.   


విజయ్‌ను కలసినప్పుడు ఏం మాట్లాడుకుంటారు?

ఇంట్లో అయితే ఇద్దరం కలసి సినిమాలు, సిరీస్‌లు చూస్తాం. లాక్‌డౌన్‌లో అయితే అదే పనిగా పెట్టుకున్నాం. అవి చూస్తూ వాటి గురించి మాట్లాడుకుంటాం. 


అన్నయ్యకు మీరు ఏవైనా సలహాలు ఇస్తారా?

ఫలానా సినిమా బాగుంది చూడు అని చెబుతాను. నాకు నచ్చిన డైరెక్టర్లు, టెక్నీషియన్ల గురించి చెబుతుంటాను. మలయాళ చిత్రం ‘హృదయం’ మ్యూజిక్‌ నాకు బాగా నచ్చింది. ‘ఖుషీ’కి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోసం వెతుకుతుంటే హేషమ్‌ అబ్దుల్‌ వహబ్‌ గురించి అన్నకు చెప్పాను. వారికి నచ్చి ఆయన్ను తీసుకున్నారు. కొన్నిసార్లు అలాంటివి జరుగుతాయి. 


విజయ్‌తో కలసి నటించే ఆలోచన ఉందా?

ప్రస్తుతానికి అయితే అలాంటి ఉద్దేశం లేదు. ముందు హీరోగా నాకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి. అప్పుడు అన్నయ్యతో సినిమా గురించి ఆలోచిస్తాను. 


పాన్‌ ఇండియా మూవీ చేసే ఆలోచన ఉందా?

నాకు ఒక థియేట్రికల్‌ సక్సెస్‌ పడాలి. ఇప్పుడు నా దృష్టంతా దానిపైనే.  లాంగ్‌టర్మ్‌ గోల్స్‌ లేవు. 


ఇంట్లో ఎక్కువగా సినిమా వాతావరణమే ఉంటుందా?

పగలంతా సినిమా పనులతో బిజీగా ఉన్నా రాత్రికి అందరం ఇంటికి చేరుకుంటాం. సినిమా సంగతులు మాట్లాడుకుంటూ కలసి భోజనం చేస్తాం. 


నిర్మాణ సంస్థ పనులను మీరే చూసుకుంటారా?

ఏవైనా సలహాలు ఇస్తాను. నిర్వహణ బాధ్యతలు సిబ్బంది చూసుకుంటారు. ‘పుష్పకవిమానం’ చేశాక చిన్న గ్యాప్‌ ఇచ్చాం. మేం మా సినిమాలతో బిజీగా ఉండడం దానికి కారణం. త్వరలో మా సొంత సంస్థలో ఒక వెబ్‌సిరీస్‌ చేయబోతున్నాం. 


‘హైవే’లో మీకు బాగా నచ్చిన అంశాలు

ఇదొక విజువల్‌ ఫిల్మ్‌ అని చెప్పవచ్చు. డైలాగ్‌లు, డ్రామా కన్నా థ్రిల్లింగ్‌ పాయింట్స్‌, అనుకోని మలుపులు ఆకట్టుకుంటాయి. తెలుగులో ఎక్కువగా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్స్‌ వచ్చాయి. ఇది రోడ్‌ థ్రిల్లర్‌ లాంటిది. తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా  అనుభూతిని ఇస్తుంది. 


మీ పాత్ర  కోసం ఎలా సన్నద్ధమయ్యారు?

ఈ సినిమా చేయడం నాకు ఒక డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. తొలిసారి వర్క్‌షాప్‌ లే కుండా డైరెక్ట్‌గా సెట్స్‌పైకి వెళ్లి చేశాను. ఒక సారి గుహన్‌ లుక్‌టెస్ట్‌ చేశారు. నాకున్న సందేహాలు అడిగితే ‘మొత్తం నాకు వదిలేయ్‌, నేను చూసు కుంటాను’ అనేవారు. సెట్‌కు రావడం, డైలాగ్‌ వర్షన్‌ చూసుకోవడం, సార్‌ చెప్పినట్లు చేయడం అంతవరకే నా పని.


షూటింగ్‌లో మిమ్మల్ని థ్రిల్‌ చేసిన విషయాలు ఏమిటి?

రియల్‌ లొకేషన్స్‌లో రియల్‌గా షూటింగ్‌ చేయడం థ్రిల్‌ ఇచ్చింది. ఓ సీక్వెన్స్‌ కోసం గుహన్‌ గారు బెంగళూరు హైవేలో కారు నడపమన్నారు. ఓ పక్కన వర్షం పడుతోంది. కారుపైన వాక్యూమ్‌ బేస్‌ పెట ్టడంతో నాకు ఎదురుగా వచ్చే లారీలు, బస్సులు కనిపించడం లేదు. బాగా టెన్షన్‌గా ఉందని గుహన్‌కు చెప్పాను. ‘మరేం ఫరవాలేదు, నా పైన నమ్మకంతో నడుపు’ అన్నారాయన. కొద్దిలో ఒక యాక్సిడెంట్‌ తప్పింది. అంత టెన్షన్‌లో సన్నివేశానికి తగిన హావభావాలపైన దృష్టి పెట్టి చేయడం నాకు గుర్తుండిపోయింది. 


ఇప్పటిదాకా చేసిన అన్ని సినిమాల్లోనూ దాదాపు ఒకేలా కనిపించారు?

నేను ఇప్పటిదాకా ఎంచుకున్న పాత్రల వల్ల ప్రేక్షకులకు అలా అనిపిస్తోంది. ఇందులో కూడా నా పాత్ర అలానే ఉంటుంది. కానీ డిఫరెంట్‌ మూవ్‌మెంట్స్‌ ఉంటాయి. నా నెక్స్ట్‌ సినిమా ‘ఓ బేబీ’ లవ్‌స్టోరీ. ‘గం గం గణేశా’లో అన్ని వాణిజ్య హంగులు ఉంటాయి. ఆ సినిమాల్లో డిఫరెంట్‌గా కనిపిస్తాను. 


‘పుష్పక విమానం’ ఫలితాన్ని ఎలా తీసుకున్నారు?

జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు విశ్లేషణ వల్ల ఒరిగేదేం లేదు. ‘బాగా నటించావు’ అనే ప్రశంసలయితే దక్కాయి. 

Updated Date - 2022-08-17T07:16:02+05:30 IST