పవన్ కల్యాణ్‌‌కి సమాధానమివ్వడానికి మోహన్ బాబుకి ఇంత సమయమా?

ABN , First Publish Date - 2022-01-03T02:37:31+05:30 IST

‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరలపై, అధిక షోల విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ.. ‘అడుక్కోవద్దు.. అది మన హక్కు’ అంటూ సినిమా

పవన్ కల్యాణ్‌‌కి సమాధానమివ్వడానికి మోహన్ బాబుకి ఇంత సమయమా?

‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా టికెట్ల ధరలపై, అధిక షోల విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని ఎండగడుతూ.. ‘అడుక్కోవద్దు.. అది మన హక్కు’ అంటూ సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఆయన హితబోధ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి బంధువులమని చెప్పుకునే మోహన్ బాబు.. ఈ విషయంపై ఎందుకు మాట్లాడరు? అంటూ అదే వేదికపై పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత మోహన్ బాబు స్పందిస్తూ.. ‘నా బిడ్డ మా ఎన్నికలలో నిలబడుతున్నాడు. ఎన్నికలు అయిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రశ్నకి సమాధానమిస్తాను..’ అని ‘మా’ ఎన్నికలకు సంబంధించిన ఓ మీడియా సమావేశంలో తెలిపారు. 


అయితే ‘మా’ ఎన్నికలు ముగిసి సుమారు 3 నెలలు కావస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించని మోహన్ బాబు.. నేడు (ఆదివారం) సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాస్తానని ప్రకటించినట్లుగా వార్తలు వచ్చిన కాసేపటికే.. ‘రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం’ అంటూ ఓ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. కొన్ని నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏపీలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే.. ఇప్పటి వరకు మాట్లాడని మోహన్ బాబు.. ఇవాళ ఇలా లేఖని విడుదల చేయడంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కి బదులిస్తానని చెప్పింది ఎప్పుడు? స్పందించింది ఎప్పుడు? అంటూ మోహన్ బాబు లేఖను పోస్ట్ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

Updated Date - 2022-01-03T02:37:31+05:30 IST