గిన్నిస్‌ బుక్‌లో లత.. సవాల్‌ చేసిన మహమ్మద్‌ రఫీ!

ABN , First Publish Date - 2022-02-07T23:01:52+05:30 IST

బాలీవుడ్‌ గాయకుడు మహమ్మద్‌ రఫీకి రికార్డ్‌ స్థాయిలో పాటలు పాడిన గౌరవం, ఘనత సంపాదించాలనే కోరిక ఉండేది. అయితే 1977లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లతా మంగేష్కర్‌ పేరు ఉందని తెలియగానే..

గిన్నిస్‌ బుక్‌లో లత.. సవాల్‌ చేసిన మహమ్మద్‌ రఫీ!

బాలీవుడ్‌ గాయకుడు మహమ్మద్‌ రఫీకి రికార్డ్‌ స్థాయిలో పాటలు పాడిన గౌరవం, ఘనత సంపాదించాలనే కోరిక ఉండేది. అయితే 1977లో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లతా మంగేష్కర్‌ పేరు ఉందని తెలియగానే ఆయన నిరాశ చెందారు. వాస్తవానికి లత అంటే రఫీకి ఎటువంటి అసూయ లేదు. కానీ ఆమె కంటే ముందు తనకే గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కాలనీ, ఆ అర్హత తనకే ఉందనీ ఆయన అనేవారు.


వివాదం ఇలా మొదలైంది

‘గ్రామ్‌ఫోన్‌ సినిమా’ అనే కేటగిరిలో అత్యధిక పాటలు పాడిన గాయని లతా మంగేష్కర్‌ అని 1977 ఎడిషన్‌లో గిన్నిస్‌బుక్‌ పేర్కొంది. 1948-74 మధ్య కాలంలో ఆమె 25 వేలకు తక్కువ కాకుండా పాటలు పాడారనీ.. సోలో, డ్యూయెట్‌, కోరస్‌, గ్రూప్‌ సాంగ్స్‌ను 20 భారతీయ భాషల్లో ఆమె పాడారనీ అందులో పేర్కొన్నారు. రోజుకి ఆమె ఐదు షిఫ్టుల చొప్పున పాటలు పాడారనీ, 1974లోనే దాదాపు 1800 పాటలు పాడారని కూడా ఆ బుక్‌లో పేర్కొన్నారు.


ఈ రికార్డ్‌ను సవాల్‌ చేస్తూ రఫీ గిన్నిస్‌ బుక్‌ ప్రచురణ కర్తలకు 1977, జూన్‌ 11న ఓ లేఖ రాశారు. ‘‘1944 నుంచి సినీ రంగానికీ, భారతీయ సినీ సంగీతానికీ నేను చేసిన సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలని కోరడం అత్యాశ కాదనుకుంటున్నాను. నా కెరీర్‌ 1944లో మొదలైంది. రికార్డ్‌ అయిన పాటల సంఖ్య 23 వేలు. దానికి తగిన ఆధారాలు కూడా జత చేస్తున్నాను. లత పాట 1947-48లో ప్రథమంగా రికార్డ్‌ అయింది. నాకన్నా జూనియర్‌ అయిన గాయని నా కంటే ఎక్కువ పాటలు ఎలా పాడగలదు? ఆమె రోజుకి ఐదు షిఫ్టుల్లో పాటలు పాడే వారన్న మాట కూడా వాస్తవం కాదు. ఆమె పాటలు రోజుకి ఒకటి కన్నా ఎక్కువ రికార్డ్‌ అయిన సందర్భాలు చాలా అరుదు. లత తన 31 ఏళ్ల కెరీర్‌లో 25 వేలకు తక్కువ కాకుండా పాటలు పాడారన్న విషయం కూడా వాస్తవం కాదు. ఆదివారాలు, సెలవు రోజులు మినహాయించి, ఆమె రోజుకి ఒక పాట చొప్పున పాడినా, సంవత్సరానికి 300 పాటల చొప్పున 31 ఏళ్లకు 9,300 పాటలు అవుతాయి. నేను రోజుకి రెండు పాటలు పాడాను. కొన్ని సందర్భాల్లో రోజుకి 5 పాటలు కూడా పాడానని రుజువు చేయగలను. అందువల్ల పక్షపాతం లేని ఓ భారతీయ ఏజెన్సీ ద్వారా నిజానిజాలు తేల్చాలి. అది తేలేవరకూ ఈ రికార్డ్‌కు సంబంధించిన పేజీని ఖాళీగా ఉంచాలని కోరుతున్నాను’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు రఫీ.


‘మీరు పేర్కొన్న విషయం పరిశీలిస్తాం’ అని గిన్సిస్‌ బుక్‌ సంస్థ రఫీకి హామీ ఇచ్చింది కానీ ఆ తర్వాత రెండు సార్లు ప్రచురించిన పుస్తకంలో కూడా లత పేరే ఉంది. రఫీ తన పాటల వివరాలు పంపిస్తూ రెండు, మూడు సార్లు లేఖలు రాసినా గిన్సిస్‌ బుక్‌ సంస్థ నుంచి ఎటువంటి ప్రత్యుత్తరం రాలేదు. ఈ వివాదం తేలకుండానే 1980 జూలై 31న రఫీ కన్నుమూశారు. 1984 ఎడిషన్‌లో అత్యధిక పాటలు పాడిన గాయనిగా లత పేరుని ఉంచుతూ.. 11 భాషల్లో 1944- 80 మధ్య కాలంలో 28 వేల పాటలు మహమ్మద్‌ రఫీ పాడారని ఆయనే పేర్కొన్నారని గిన్నిస్‌బుక్‌ వెల్లడించింది. అయితే 1991 ఎడిషన్‌లో లత, మహమ్మద్‌ రఫీ.. ఇద్దరి పేర్లనూ తొలగించింది.

-వినాయకరావు

Updated Date - 2022-02-07T23:01:52+05:30 IST