టికెట్ల ధరల జీవోని మంత్రి మృతికి లింక్ పెట్టిన పేర్ని నాని

ABN , First Publish Date - 2022-02-25T23:07:15+05:30 IST

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒక రోజు వాయిదా వేసుకున్నవాడు.. సినిమాని కొత్త జీవో వచ్చే వరకు వాయిదా వేసుకోలేకపోయాడా? అంటూ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. శుక్రవారం మీడియా..

టికెట్ల ధరల జీవోని మంత్రి మృతికి లింక్ పెట్టిన పేర్ని నాని

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒక రోజు వాయిదా వేసుకున్నవాడు.. సినిమాని కొత్త జీవో వచ్చే వరకు వాయిదా వేసుకోలేకపోయాడా? అంటూ పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పేర్ని నాని. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై పలు ఆరోపణలు చేశారు. టికెట్ల ధరల కొత్త జీవో 23 లేదంటే 24వ తేదీ రావాల్సి ఉంది కానీ, మంత్రి గౌతమ్ రెడ్డి చనిపోవడంతో.. ఆలస్యమైందని ఆయన వెల్లడించారు.


ఆయన మాట్లాడుతూ..

‘‘మా మంత్రి ఆకస్మికంగా చనిపోయి ఉంటే.. మేమంతా ఆ పనిలో ఉంటే.. అందులో కూడా దిక్కుమాలిన రాజకీయాలు వెతుక్కుంటున్నారు చంద్రబాబు నాయుడుగారు. సినిమా ఇంకా విడుదల కాలేదు.. లోకేశ్ బాబుగారు ట్విట్టర్‌లో ‘భీమ్లా నాయక్’పై వేసే ట్వీట్లు చూస్తుంటే.. వారి కపట ప్రేమ స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైనా ఆ ఫ్యామిలీనే నమ్ముకుని ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఇలా ట్వీట్లు చేశారా?.  


చిరంజీవిగారు, మహేష్‌గారు, ప్రభాస్‌గారు, రాజమౌళిగారు వీళ్లంతా వచ్చినప్పుడు కొత్త జీవో ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు అని కొందరు మాట్లాడుతున్నారు. ఎంత కిరాతకంగా మాట్లాడుతున్నారు. 21వ తేదీన రేట్లను ఫైనల్ చేయాల్సిన కమిటీ కూర్చుంది. 22వ తేదీన సినిమాటోగ్రఫీ హోం సెక్రటరీ జీవోకి డ్రాఫ్ట్ తయారు చేసి లా డిపార్ట్‌మెంట్‌కి పంపించడం జరిగింది. 23 లేదంటే 24న జీవో రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వంలోని బాధ్యత గల ఒక యువ మంత్రి దురదృష్టవశాత్తూ ఆకస్మికంగా చనిపోవడం జరిగింది. దీనిని కూడా రాజకీయానికి వాడుకుంటున్నారు. సినిమాని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు.  


జగన్ మోహన్‌రెడ్డిగారు సినిమా ఇండస్ట్రీకి మంచి చేస్తాం అని చెప్పారు.. ఖచ్చితంగా చేస్తారు. కమిటీ నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని సాధ్యమైనంత తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. చట్టాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తారా?. థియేటర్లు అనేవి ప్రభుత్వ లైసెన్స్‌ల ప్రకారం నడవాలి. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు నడుపుకుంటాం అంటారా? జనాల్లో ఆకర్షణ ఉందని మితిమీరిన రేట్లతో అమ్మి దోచుకుంటానంటే, దోపిడీ చేస్తానంటే.. ప్రభుత్వం నియంత్రించకుండా ఉండాలా? చంద్రబాబునాయుడుగారు ఇలాంటివి మాట్లాడుతారా? కొత్త జీవో వచ్చిన తర్వాత విడుదల చేసుకోవచ్చు కదా. ఎవరు వద్దని చెప్పారు? ఇప్పటికి ఎన్నిసార్లు సినిమాని వాయిదా వేసుకుంటూ వచ్చారు. మూడు, నాలుగు రోజులలో జీవో వస్తుంది. అప్పుడు రిలీజ్ చేసుకోవచ్చు కదా!. వాళ్ల మంత్రి చనిపోయి ఉన్నాడని, వారు బాధలో ఉన్నారనే విషయం గమనించలేరా? మేము బాధలో ఉన్నాం కాబట్టే.. ఎవరెన్ని అవాకులు, చెవాకులు మాట్లాడినా.. ప్రభుత్వం స్పందించలేదు. ఈ సమావేశానికి కూడా గతిలేక రావాల్సి వచ్చింది. చంద్రబాబు నాయుడుగారు దిక్కుమాలిన రాజకీయాలు మాట్లాడుతుంటే.. గతిలేక వచ్చా..’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2022-02-25T23:07:15+05:30 IST