ఆ పట్టణానికి సినిమా థియేటర్‌ కల నెరవేరింది.. తొలి చిత్రం ‘రాధేశ్యామ్‌’

ABN , First Publish Date - 2022-03-13T00:30:17+05:30 IST

గతంలో ఇక్కడ ఉన్న ఏకైక సినిమా థియేటర్‌ మూడు దశాబ్దాల క్రితం మూతబడింది. అప్పటి నుంచి పట్టణ, సమీప ప్రాంతాల ప్రజలకు సినిమా చూడటం కష్టంగా మారింది. జిల్లా కేంద్రమైన తర్వాత.. వేలాది మంది ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు

ఆ పట్టణానికి సినిమా థియేటర్‌ కల నెరవేరింది.. తొలి చిత్రం ‘రాధేశ్యామ్‌’

సర్కార్ వారి సినిమా థియేటర్...! ఇదేంటని ఆశ్చర్య పోతున్నారా....! మీరు వినేది నిజమే! ప్రజల వినోదం కోసం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఓ సినిమా థియేటర్ నిర్మించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఒక సినిమా థియేటర్ రావడంతో స్థానికులు.. ఆ థియేటర్‌కు క్యూ కడుతున్నారు. కొమురం భీం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో 30 ఏళ్ల నుంచి సినిమా థియేటర్ లేదు. అధికారుల చొరవతో సినిమా థియేటర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రభుత్వ భాగస్వామ్యంతో స్థానికులకు వినోదం పంచే మినీ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన పిక్చర్​ టైమ్ అనే ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో.. ఆధునిక పరిజ్ఞానంతో, అతి తక్కువ సమయంలో థియేటర్​ను ఏర్పాటు చేశారు. 


50 లక్షల రూపాయల బడ్జెట్‌లో ఈ థియేటర్‌ను నిర్మించారు. డీఆర్​డీఏ పర్యవేక్షణలోని కొమురం భీం మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ.. వసతుల కల్పన కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. మిగతా 25 లక్షలతో.. పిక్చర్ టైమ్ సంస్థ తాత్కాలిక సినిమా థియేటర్​, ప్రొజెక్టర్, 120 కుర్చీలు, 35ఎంఎం తెర, అధునాతన యంత్ర పరికరాలు సమకూర్చింది. ఎకరం స్థలం, ప్రహరీ, ప్లాట్ ఫామ్, ట్రాన్స్​ఫార్మర్, నీటి వసతులను సొసైటీ కల్పించింది. పూర్తిగా గాలి బెలూన్​లా కనిపించే ఈ థియేటర్‌లో ఏసీ సదుపాయం, ఫ్యాన్లు కూడా ఉన్నాయి. ఇందులో 120 మంది కూర్చొని సినిమాను వీక్షించవచ్చు. ఎంత గాలి వీచినా చెక్కుచెదరని విధంగా నిర్మించారు. 


గతంలో ఇక్కడ ఉన్న ఏకైక సినిమా థియేటర్‌ మూడు దశాబ్దాల క్రితం మూతబడింది. అప్పటి నుంచి పట్టణ, సమీప ప్రాంతాల ప్రజలకు సినిమా చూడటం కష్టంగా మారింది. జిల్లా కేంద్రమైన తర్వాత.. వేలాది మంది ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో పట్టణ జనాభా పెరుగుతోంది. కానీ ఇందుకు అవసరమైన వినోదం, ఆహ్లాదం మాత్రం కొరవడింది. ప్రజలకు వినోదం అందించడంతో పాటు ఆదాయం సమకూర్చుకునేందుకు జిల్లా అధికారులు చొరవ చూపారు. ఆలోచన వచ్చిందే తడవుగా థియేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. 'అమ్మ' చిత్ర ట్రైలర్‌తో ప్రారంభమైన ఈ థియేటర్‌లో విడుదలైన తొలి చిత్రం 'రాధేశ్యామ్'. మహిళా దినోత్సవం రోజున ఈ థియేటర్‌ని అధికారులు ప్రారంభించారు.



Updated Date - 2022-03-13T00:30:17+05:30 IST