రష్యన్లు శత్రువులు కాదంటోన్న ఉక్రెయిన్ నటి

ABN , First Publish Date - 2022-03-12T23:05:15+05:30 IST

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా అదే హాట్ టాపిక్ అయిపోయింది. అయితే, దేశదేశాల రాజకీయ నాయకులతో పాటూ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉక్రెయిన్ సంక్షోభం గురించి చురుగ్గా స్పందిస్తున్నారు...

రష్యన్లు శత్రువులు కాదంటోన్న ఉక్రెయిన్ నటి

ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అంతర్జాతీయంగా అదే హాట్ టాపిక్ అయిపోయింది. అయితే, దేశదేశాల రాజకీయ నాయకులతో పాటూ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉక్రెయిన్ సంక్షోభం గురించి చురుగ్గా స్పందిస్తున్నారు. ‘టైటానిక్’ స్టార్ లియోనార్డో డికాప్రియో లాంటి వారైతే మరో అడుగు ముందుకేసి ఉక్రెయిన్‌కు కోట్లాది రూపాయల విరాళం ప్రకటిస్తున్నారు. డికాప్రియో అమ్మమ్మగారు పుట్టింది ఉక్రెయిన్‌లోనేనట!


ఉక్రెయిన్‌తో సంబంధమో, అనుబంధమో ఉన్న హాలీవుడ్ స్టార్స్ చాలా మందే ఉన్నారు. తాజాగా నటి మిలా క్యునిస్ తన ఉక్రెయిన్ మూలాల గురించి ప్రస్తావించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తాను 1983లో అక్కడే పుట్టానని చెప్పింది. ఏడేళ్ల వయస్సులో ఉక్రెయిన్ నుంచీ అమెరికాకు కుటుంబంతో సహా వలస వచ్చిందట. అప్పట్లో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉండేది ఉక్రెయిన్. 


పుట్టుకతో మిలా క్యునిస్ ఉక్రెయినియన్ అయినప్పటికీ నిన్న మొన్నటి వరకూ తనని తాను ‘రష్యన్’ అనే చెప్పుకునేదట. రష్యా, ఉక్రెయిన్‌కి మధ్య వైరుధ్యాన్ని ఆమె పట్టించుకునేది కాదట. కానీ, తాజా యుద్ధం ఆ పరిస్థితిని మార్చేసింది. మిలా ఇప్పుడు తాను రష్యన్ కాదు ఉక్రెయినియన్ అంటోంది. అదే సమయంలో, రష్యన్ ప్రజలందరూ  దుర్మార్గులు కాదని కూడా స్పష్టం చేస్తోంది. వారు తమ శత్రువులు కాదని వ్యాఖ్యానించింది. అయితే, రష్యాలో అధికారం వెలగబెడుతోన్న వారు మాత్రం మారణకాండకి కారకులంటోంది. అంతే కాదు, మిలా తన భర్త యాష్టన్ కుచర్‌తో కలిసి మాతృదేశం ఉక్రెయిన్ కోసం 30 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేసేందు కోసం కృషి చేస్తోంది.   

Updated Date - 2022-03-12T23:05:15+05:30 IST