కలిశారు... గెలిచారు!

ABN , First Publish Date - 2022-04-10T06:11:28+05:30 IST

గతంలో ఓ నిర్మాత భారీ సినిమా తీస్తున్నాడంటే మిగిలిన నిర్మాతలు తెర వెనుకే ఉంటూ అన్ని రకాలుగా సహకారాన్ని

కలిశారు... గెలిచారు!

చిత్ర పరిశ్రమలో కాంబినేషన్‌కు ఎప్పుడూ క్రేజ్‌ ఉంటుంది. ఎప్పుడూ కలవని ఇద్దరు కలసి ఓ చిత్రం చేస్తున్నారంటే అది కచ్చితంగా క్రేజీ వార్తే. ఇద్దరు హీరోలు కలసి ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేస్తున్నారంటే ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉంటుందో, ఇద్దరు ప్రముఖ నిర్మాతలు లేదా రెండు సంస్థలు తీసే సినిమాకు కూడా భారీ అంచనాలు ఉంటుంటాయి.  ఇద్దరు లేదా  ముగ్గురు అగ్ర హీరోలు కలసి నటించిన చిత్రాలు గతంలో కొన్ని వచ్చాయి కానీ ఇద్దరు ప్రముఖ నిర్మాతలు చేయి చేయి కలపి ముందుకు అడుగులు వేయడం అన్నది గతంలో చాలా తక్కువ. ఇప్పుడు అదే నయా ట్రెండ్‌! 


తంలో ఓ నిర్మాత భారీ సినిమా తీస్తున్నాడంటే మిగిలిన నిర్మాతలు తెర వెనుకే ఉంటూ అన్ని రకాలుగా సహకారాన్ని అందించేవారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మాట సాయం చేసేవారు. ఆ రోజుల్లోనే విడివిడిగా సినిమాలు తీసే నిర్మాతలు కె. మురారి , విజయబాపినీడు కలసి ‘జే గంటలు’(1981) సినిమా తీయడం చర్చనీయాంశం అయింది. అలాగే ముగ్గురు అగ్రనిర్మాతలు అశ్వనీదత్‌, దేవీవరప్రసాద్‌, త్రివిక్రమరావు కలసి దాసరి దర్శకత్వంలో ‘అమ్మ రాజీనామా’ పేరుతో ఓ చిన్న సినిమా తీశారు. అలాగే ‘పెళ్లి సందడి’, ‘పరదేశి’ వంటి చిత్రాలు కూడా ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలసి తీసిన చిత్రాలు.  ఆ రోజుల్లో అడపాదడపా ఇలా సంయుక్తంగా చిత్ర నిర్మాణం జరిగేది. కానీ ఇప్పుడు భారీ చిత్రాలు ఇలా సంయుక్త నిర్మాణంలో జరగడం సాఽధారణం అయింది. గతంలో కథ, తన నటన గురించి మాత్రమే పట్టించుకునే అగ్ర హీరోలు సైతం సినిమా బాగా రావడం కోసం  చిత్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. 




రేంజ్‌ పెరిగింది

‘బాహుబలి’ తర్వాత  ఆ స్థాయిలో బాలీవుడ్‌లో హల్‌చల్‌ చేసిన తెలుగు చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వై, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. ‘పుష్ప 2’ తో పాటు బాలకృష్ణ, గోపిచంద్‌ మలినేని కాంబినేషన్‌ చిత్రం, నాని ‘అంటే సుందరానికి’ కూడా వీరిద్దరే నిర్మాతలు. ఇదే బ్యానర్‌లో మహేష్‌బాబు హీరోగా వస్తున్న ‘సర్కారు వారి పాట’కు మాత్రం  నలుగురు నిర్మాతలు. నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ వై, రామ్‌ ఆచంట, గోపి ఆచంట కలసి నిర్మిస్తున్నారు. 


సోదర ద్వయం

చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్‌ బ్యానర్‌, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మాతలు. ఈ సోదర ద్వయం నుంచి గతంలో ‘అర్జున ఫల్గుణ’, ‘వైల్డ్‌డాగ్‌’, ‘ఘాజీ’ లాంటి ఆకట్టుకునే చిత్రాలు వచ్చాయి. ఇటీవలె తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ చిత్రానికి కూడా నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మాతలు. 





నిర్మాణ సంస్థలు కలసి

నిర్మాతలే కాదు కొన్ని నిర్మాణ సంస్థలు, స్టూడియోలు కూడా చేతులు కలుపుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌, బెంచ్‌మార్క్‌ స్టూడియోస్‌ సంస్థతో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఆ కోవలోదే. సుధీర్‌బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్నారు. మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మాతలు. నాగార్జున హీరోగా నటిస్తున్న యాక్షన్‌ మూవీ ‘ది ఘోస్ట్‌’.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్పీ, నార్త్‌స్టార్‌ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్లపై నారాయణ్‌దాస్‌ కె నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ కలసి నిర్మిస్తున్నారు. ఆదిత్యా మూవీస్‌ అండ్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌తో కలసి శ్రేష్ట్‌ మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్‌ హీరో. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మాతలు. 


సక్సెస్‌ జోడీ

టాలీవుడ్‌లో ప్రొడ్యూసర్లుగా అగ్రస్థానంలో ఉన్న మరో  సోదర ద్వయం దిల్‌ రాజు, శిరీష్‌.   శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై వారిద్దరూ కలసి సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం  రామ్‌చరణ్‌తో పాన్‌ ఇండియా చిత్రం నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు శంకర్‌ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ కలసి పలు చిత్రాలు నిర్మిస్తున్నారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ ‘ఎఫ్‌ 3’, తమిళ హీరో విజయ్‌తో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో  చేస్తున్న సినిమాలు లైనప్‌లో ఉన్నాయి. శిరీష్‌ తనయుడు ఆశిష్‌రెడ్డి హీరోగా నటిస్తూ నిర్మాణ కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నాడు. దిల్‌రాజు తనయ హన్షితా రెడ్డి ‘ఏటీఎం’ వెబ్‌సిరీస్‌తో నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. 

చాలాకాలంగా టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్నారు రాధాకృష్ణ (చినబాబు), సూర్యదేవర నాగవంశీ. సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూపర్‌ హిట్లు అందించారు. సూర్యదేవర నాగవంశీతో కలసి నిర్మించిన ‘భీమ్లానాయక్‌’ చిత్రంతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. రాధాకృష్ణ గతంలో డివివి దానయ్యతో ‘జులాయి’, అల్లు అరవింద్‌తో ‘అల వైకుంఠపురం’ చిత్రాలను కలసి నిర్మించారు. అవి రెండూ పెద్ద హిట్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆయన దిల్‌రాజు, అమన్‌ గిల్‌, అల్లు అరవింద్‌తో కలసి, హిందీ ‘జెర్సీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌, అమన్‌ గిల్‌తో కలసి ‘అల వైకుంఠపురం’ చిత్రాన్ని కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. 

అలాగే ఇటీవల విడుదలైన వరుణ్‌తేజ్‌ ‘గని’కి కూడా ఇద్దరు నిర్మాతలు. అల్లు అరవింద్‌ తనయుడు బాబీ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమయ్యారు. సిద్ధు ముద్దతో కలసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. సామాజిక సమస్యలను ఆధారంగా చేసుకొని వినోదాత్మకంగా సినిమాలను మలుస్తాడని పేరు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఉడుగుల నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు.దీనికి కూడా నిర్మాతలు ఇద్దరు. నిర్మాతలుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డి. సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి కలసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలె విడుదలైన ప్రభాస్‌ పాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’ చిత్రానికి వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మాతలు. 


Updated Date - 2022-04-10T06:11:28+05:30 IST