God Father Review: బాస్‌కి ఏమైంది?

ABN , First Publish Date - 2022-10-05T18:59:43+05:30 IST

చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు..

God Father Review: బాస్‌కి ఏమైంది?

సినిమా: ‘గాడ్‌ఫాదర్’ (God Father)

నటీనటులు: చిరంజీవి, నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సముద్రఖని, సునీల్, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: ఎస్. థమన్

సినిమాటోగ్రఫీ: నీరవ్ షా

డైలాగ్స్: లక్ష్మీ భూపాల్

ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్

నిర్మాతలు: ఆర్.బి. చౌదరి, ఎన్వీ ప్రసాద్

దర్శకత్వం: ‘జయం’ మోహన్ రాజా 


  -సురేష్ కవిరాయని


చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మీద మొదటి నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు దీనికి ముందు సినిమా ‘ఆచార్య’ (Acharya) ఫ్లాప్ అవడంతో.. చిరంజీవి ఒక మంచి సినిమాతో వస్తున్నాడని అంతా భావించారు. అందుకు ఈసారి చిరంజీవి మలయాళం సినిమా ‘లూసిఫర్’ రీమేక్ ఎంచుకున్నాడు. ఆ సినిమా కథ ఆధారంగా ‘గాడ్‌ఫాదర్’ అనే టైటిల్‌తో నేడు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇందులో ప్రముఖ హిందీ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఒక కామియో చేశాడు. మోహన్ రాజా (Mohan Raja) ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..


కథ:

ముఖ్యమంత్రి పికెఆర్ చనిపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మొదలవుతాయి. చనిపోయిన ముఖ్యమంత్రి అల్లుడు జయదేవ్ (సత్యదేవ్) ముఖ్యమంత్రి కావడానికి పావులు కదుపుతూ ఉంటాడు. అపోజిషన్ లీడర్ వర్మ.. జయదేవ్‌కి సపోర్టుగా ఉంటాడు. జయదేవ్‌కి అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ ట్రెజరర్ మరియు చనిపోయిన ముఖ్యమంత్రి పెద్ద కుమారుడు అయిన బ్రహ్మ (చిరంజీవి) ఎంటర్ అవుతాడు. జయదేవ్‌ని ముఖ్యమంత్రి కాకుండా పావులు కదుపుతాడు. బ్రహ్మని కట్టడి చేయడానికి జయదేవ్ కుతంత్రాలు పన్నుతాడు.. కానీ బ్రహ్మ వాటిని తిప్పి కొడతాడు. చనిపోయిన ముఖ్యమంత్రి కుమార్తె, జయదేవ్ భార్య అయినటువంటి సత్యప్రియ (నయనతార).. పార్టీ అధ్యక్ష పదవి చేపడుతుంది.. ఆమెకి ‘గాడ్‌ఫాదర్’ బ్రహ్మ అంటే పడదు.. జయదేవ్ చేస్తున్న అరాచకాలు సత్యకి తెలుస్తాయి. సత్య ఏం చేసింది? బ్రహ్మ.. జయదేవ్‌ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా సినిమా కథ. (God Father Review)


విశ్లేషణ: 

దర్శకుడు మోహన్ రాజా ఒరిజినల్ మలయాళం సినిమా ‘లూసిఫర్’ (Lucifer)ని చాలా మార్పులు చేశాడు.. అయితే ఆ మార్పుల వల్ల కథ దెబ్బతింటుందని కూడా ఆలోచించలేదు. చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ మార్చాడు. ఒక మంచి కథని తీసుకొని మార్పులు చేసి.. పాడు చేశాడేమో అనిపిస్తుంది. మలయాళంలో మోహన్ లాల్ (Mohanlal) వేసిన రోల్‌ని చిరంజీవి తెలుగులో వేయడం జరిగింది. అయితే అందులో భావోద్వేగాలు బాగుంటాయి. మోహన్‌లాల్ అందులో ఒక అద్భుతమైన, గంభీరమైన ప్రదర్శనను చూపిస్తే.. తెలుగులో చిరంజీవి రోల్‌ను తగ్గించి.. కథకు అనుగుణంగా కాకుండా.. చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా మలిచారు. అందువల్ల కథలో ఆసక్తి చాలా తగ్గిపోతుంది మోహన్‌రాజా చేసిన పెద్ద తప్పిదమే ఇది. రీమేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి.. అందులో ముఖ్యమైన పాయింట్లను కచ్చితంగా వదలకూడదు. కానీ మోహన్ రాజా అసలుది వదిలేసి చిరంజీవి మీద బాగా దృష్టి పెట్టడంతో కథలో పట్టు పోయింది. ఎంతసేపూ చిరంజీవిని ఎలా ఎలివేట్ చేయాలి అనే దాని మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో.. కథ మీద పట్టు తప్పింది. మలయాళంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగులోకి వచ్చేసరికి ఆ ఆసక్తి కాస్త నిరాసక్తి అయిపోయింది. ఒక రీమేక్ చేసినప్పుడు రెండు సినిమాలకి కంపేరిజన్ వస్తుందని తెలుసు.. కచ్చితంగా చేస్తారు కూడా. అలాంటప్పుడు నేటివిటీ పోకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇమేజ్ పక్కన పెట్టి కథలో క్యారెక్టర్‌ని చూపించాలి.. కానీ మోహన్ రాజా అలా చేయకుండా కేవలం చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కథ మార్చేశాడు. దీంతో ఇది అంతగా అలరించదు. నేను మలయాళం ఒరిజినల్ చూశా.. కాబట్టి నాకు ఇదంతా పెద్దగా నచ్చలేదు. (Megastar Chiranjeevi God Father Movie Review)


ఇక నటీనటుల విషయానికొస్తే చిరంజీవి తన ఇమేజ్‌ని చూస్తున్నాడు గానీ కథ మీద దృష్టి పెట్టలేదు. ఇలాంటి క్యారెక్టర్లు ఆయన ఎన్నో చేశాడు. ఆయనకి ఇదేమి కష్టతరమైన పాత్ర కాదు కానీ, చిరంజీవితో కంపేర్ చేస్తే మోహన్ లాల్ బాగా చేశాడనిపిస్తుంది. ఇంకా సత్యదేవ్ (Satya Dev) ఈ సినిమాకి హైలెట్. అతని కోసం ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అతను చాలా బాగా చేశాడు. సత్యదేవ్ కెరీర్లో ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. నయనతార (Nayanthara) ఉన్నంతలో బాగా చేసింది. సునీల్, బ్రహ్మాజీ బాగా సపోర్ట్ చేశారు. సముద్రఖని కూడా చిన్న నెగటివ్ పాత్రలో కనబడతాడు. సల్మాన్ ఖాన్ కేమియో చేశాడు కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఊరికే కొద్ది నిమిషాల పాటు స్క్రీన్ మీద అలా కనబడతాడు. సల్మాన్ ఖాన్ (Salman Khan) చివరిలో చిరంజీవితో కలిపి ఒక ఒక పాటకు డాన్స్ చేస్తాడు.. అది అనవసరం కూడా. తమన్ మ్యూజిక్ గోలగోలగా ఉంటుంది.. పాటలు, పదాలు అర్థం కావు అర్థంలేని మ్యూజిక్ ఉంటుంది.. సినిమాటోగ్రఫీ పరవాలేదు.. మాటలు బాగున్నాయి. (Chiranjeevi GodFather Review)


చివరగా ‘గాడ్‌ఫాదర్’ మనం అనుకున్నంత విధంగా లేదు. కథ మొత్తం మార్చడంతో ఈ సినిమాలో కేవలం అక్కడ చిరంజీవిని ఎలివేట్ చేస్తూ ఉన్న మూడు నాలుగు సీన్లు తప్పితే విషయం లేదు. దసరా పండగ కాబట్టి ఈ మూడు రోజులు కలెక్షన్స్ వస్తే రావచ్చు కానీ చిరంజీవి నుండి మనం ఏమి ఆశిస్తామో.. అవన్నీ లేకపోవడంతో కొంచెం నిరాశ పడక తప్పదు. దానికి తోడు ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండడంతో.. సినిమా దానికి తగ్గట్టుగా లేదనిపిస్తుంది. చిరంజీవి తదుపరి చేసే సినిమాలను ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.. తన అభిమానులకు ఏం కావాలో అలాంటివి సినిమాలు ఉండేటట్టు చూసుకుంటే మంచిది. (GodFather Talk)


ట్యాగ్‌లైన్: బాస్‌కి ఏమైంది?

Updated Date - 2022-10-05T18:59:43+05:30 IST