PS-1 film review: ఇది ఒక కలగూర గంప

ABN , First Publish Date - 2022-09-30T19:45:37+05:30 IST

మనిరత్నం 'పి ఎస్ -1' (PS-1) లేదా 'పొన్నియన్ సెల్వన్ 1' (Ponniyan Selvan) అనే ఒక కల్పిత చారిత్రక సినిమా తో మన ముందుకు వచ్చాడు . ఇది కల్కి కృష్ణమూర్తి (Kalki Krishnamurthi) అనే అతను కొన్ని దశాబ్దాల క్రితం రాసిన కల్పిత తమిళ్ చారిత్రక నవల ఆధారంగా తీసిన సినిమా.

PS-1 film review: ఇది ఒక కలగూర గంప

సినిమా: పొన్నియన్ సెల్వన్ -1

నటీనటులు: చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయి, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, పార్థిపన్ తదితరులు 

సినిమాటోగ్రాఫర్: రవి వర్మన్ (Ravi Varman)

సంగీతం: ఏ ఆర్ రహమాన్ 

దర్శకుడు: మణిరత్నం 

నిర్మాత: మణిరత్నం 


సురేష్ కవిరాయని 


భారత దేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం (Mani Ratnam) ఒకరు. అతని స్ఫూర్తితో ఎందరో సినిమా పరిశ్రమకి వచ్చిన వారు కూడా వున్నారు. అలాగే ఇతని సినిమాలు అంటే అది ఏ భాషలో వచ్చినా చూసే ప్రేక్షకులు చాలామంది వున్నారు. సినిమా బాగోలేకపోయిన, ఆ సినిమా సాంకేతికత బాగుందనో, పాటలు బాగున్నాయనో, ఇలా ఎదో ఒకటి బాగుంది అని చెప్తారు మనిరత్నం సినిమా చూసి.  అటువంటి మనిరత్నం 'పి ఎస్ -1' (PS-1) లేదా 'పొన్నియన్ సెల్వన్ 1' (Ponniyan Selvan) అనే ఒక కల్పిత చారిత్రక సినిమా తో మన ముందుకు వచ్చాడు . ఇది కల్కి కృష్ణమూర్తి (Kalki Krishnamurthi) అనే అతను కొన్ని దశాబ్దాల క్రితం రాసిన కల్పిత తమిళ్ చారిత్రక నవల ఆధారంగా తీసిన సినిమా. ఇది కేవలం తమిళులకు మాత్రమే చెందిన కథ కానీ మణిరత్నం ఈ సినిమాని అన్ని భాషల్లోకి విడుదల చేసాడు. తెలుగులో కూడా విడుదలైంది. ఇందులో తమిళ్ సినిమా పరిశ్రమకు చెందిన చాలామంది నటులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు విక్రమ్ (Chiyan Vikram), జయం రవి (Jayam Ravi), కార్తీ (Kaarthi), శరత్ కుమార్ (Sarath Kumar), ప్రకాష్ రాజ్(Prakash Raj), త్రిష (Trisha), పార్థిపన్ (Parthipan) ఇలా అందరూ ఉంటారు. ఐశ్వర్య రాయి (Aishwarya Rai) కూడా ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఏ ఆర్ రెహమాన్ (A R Rahaman music) సంగీతం అందించాడు. ప్రమోషన్స్ లో ఈ సినిమాని మన రాజమౌళి (director SS Rajamouli) తీసిన 'బాహుబలి' (Baahubali) తో పోల్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందొ, బాహుబలి కి మించి వుందా తగ్గి ఉందా అనేది చూద్దాం. 


కథ:

తెలుగు వాళ్ళకి (అందరికీ అంటే ఊరుకోరు కదా, నాలాంటి వాళ్ళకి) ఈ కథ సరిగ్గా అర్థం కాదు. ఇది మొత్తం తమిళ్ చరిత్రకి సంబందించినది. ఇది కొంత నిజం ఉన్నప్పటికీ, చాలా మట్టుకు కల్పితం కూడా వుంది. కల్కి రాసిన 'పొన్నియన్ సెల్వన్' చదివితే కొంచెం అర్థం అవుతుంది తెలుగు వాళ్ళకి అని అన్నారు. కానీ అది కూడా కష్టమే. నాకు అర్థం అయిన విధంగా చెప్తా, కానీ.. పేర్లు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. ఆదిత్య కరికలన్  (విక్రమ్) పాండ్య రాజు వీరపాండ్యన్ ని ఓడించి చోళ రాజ్యాన్ని మరింత పటిష్ఠం చేస్తాడు. ఆదిత్య స్నేహితుడు కార్తీ అతనికి యుద్ధంలో సహాయపడతారు. ఆదిత్య తమ్ముడు పొన్నియన్ సెల్వన్ (జయం రవి) శ్రీలంకలో చోళ రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. వీరిద్దరికి ఒక చెల్లెలు కూడా ఉంటుంది ఆమె పేరు కుందయవి (త్రిష). వీరి నాన్న (ప్రకాష్ రాజ్) ముసలి రాజు తంజావూరు లో ఉంటాడు. ఈ చోళ రాజ్యాన్ని కబళించడానికి కోటలో కుట్రలు జరుగుతూ ఉంటాయి. కోశాధికారి (శరత్ కుమార్) తన భార్య అయిన నందిని (ఐశ్వర్య రాయి) ఇలా మరి కొందరు కుట్రలు చేస్తూ ఈ తండ్రి కొడుకులను అంతం చెయ్యాలని చూస్తూ వుంటారు. వీరి కుట్రలను, ఈ అన్నదమ్ములు ఎలా భగ్నం చేసారు, చివరికి ఏమైంది అన్నదే మొదటి భాగం. 


విశ్లేషణ:

మొట్ట మొదట ఇది నేను తెలుగు సినిమా చూస్తున్నాను అన్న భావనే కలగలేదు నాకు. ఎందుకంటే పేర్లు అన్నీ తమిళ్, చాలామంది నటులు కూడా తమిళ్ వాళ్ళు అవటం, ఇవన్నీ కాకుండా, ఈ కథ పూర్తిగా తమిళ్ చరిత్ర, వారికి సంబందించినది. ఎప్పుడో కల్కి రాసిన నవలని అదే పేరుతో మణిరత్నం ఈ 'పొన్నియన్ సెల్వన్ 1' తీసాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది అందరికి అర్థం అయ్యే రీతిలో మణిరత్నం కథని చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆలా చెప్పలేదు. ముక్కలు ముక్కలుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రేక్షకుడికి ఏమి జరిగిందో అర్థం  అయ్యేలోపు ఆ సీన్ అయిపోతుంది, మళ్లీ ఇంకో కొత్త క్యారెక్టర్ వస్తుంది. అయిపోయిన సీన్స్ లో క్యారెక్టర్ పేర్లు గురుపెట్టుకోవటం కష్టం అయిపోతుంది. ఇలా రావటం వల్ల ఏమవుతుంది అంటే, ప్రేక్షకుడికి సినిమా అర్థం కాకుండా పోతుంది. నువ్వు సినిమా ఎంత బాగా తీసినా అది ప్రేక్షకుడికి అర్థం కాకపోతే అది వేస్ట్. మణిరత్నం గొప్ప దర్శకుడే, అతన్ని కించ పరిచే ఉద్దేశం ఏ మాత్రం కాదు, కానీ ఈ 'పొన్నియన్ సెల్వన్' మాత్రం మన తెలుగు వాళ్ళకి ఎక్కదు అని మాత్రం అర్థం అవుతోంది. సినిమాలో చాలా మంది నటులు, ప్రదేశాలు, ఎవరు ఏ రాజ్యాన్ని ఏలుతున్నారో ఇవన్నీ గుర్తు పెట్టుకోవటం కష్టమే.


ఇంకా సాంకేతిక పరంగా చూస్తే, మణిరత్నం సినిమాల్లో నటీనటుల హావభావాలు చాల దగ్గరగా చూపిస్తాడు. ఇందులో కూడా అలాగే వున్నాయి. రాజుల కోటలు, బురుజులు, ఆ రాజులనాటి వాతావరణం, ఆర్ట్ వర్క్ బాగుంది. తోట తరణి (Thota Tharani) కదా మరి, అతని ఆర్ట్ వర్క్ ఎప్పుడూ బాగుంటుంది. అతనే డిజైన్ చేసాడు, అందుకని బాగున్నాయి. ఇంకా రహమాన్ సంగీతం అంతగా ఏమి లేదు. బయటకి వచ్చాక మనకి 'అబ్బ ఎంత బాగుందిరా సంగీతం' అని అనిపించాలి కదా, ఆలా లేదు మరి. మామూలుగా వుంది. ఆ పాటలు అయితే, ఆరవ పాటలో, మలయాళం పాటలో, తెలుగు పాటలో అర్థమే కాలేదు. దానికి తోడు,  ఈ పాటలు పాడేవాళ్లు వొత్తులు, దీర్ఘాలు అన్నీ తీసి పాడతారు కదా, అందుకని అస్సలు అర్థం కాలేదు. దానికి ఇది డబ్బింగ్ సినిమా, అంటే తమిళ్ లిప్ సింక్ కి తెలుగు పదం కదా, ఇంకా వేరే చెప్పాలా, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు పాటలు. సినిమాటోగ్రఫీ (Cinematography) బాగుంది. గ్రాఫిక్స్ మీద ఇంకా కొంచెం దృష్టి పెడితే ఈ సినిమా ఇంకా బాగుందేమో చూడటానికి. 

ఇంకా నటీ నటుల విషయానికి వస్తే, సినిమా మొత్తం మీద కార్తీ ఫుల్ మార్కులు కొట్టేసాడు. అతని రోల్ చాలా పెద్దది. దానికి తోడు అతను తన గొంతు తానే వినిపించుకున్నాడు కాబట్టి అతని డైలాగ్స్ కొంచెం సరదాగా వున్నాయి. అతని రోల్ కూడా చలాకీగా ఉంటుంది. బాగుంది. తరువాత జయం రవి. సెకండ్ హాఫ్ లో వస్తాడు, అతనే పొన్నియన్ సెల్వన్ రోల్ ప్లే చేసింది. బాగా చేసాడు అనిపించింది. తరువాత విక్రమ్, శరత్ కుమార్ ఇలా చాలామంది వస్తారు. ఇంకా ఐశ్వర్య రాయి చాల అందంగా వుంది, అంతే అందంగా కూడా చేసింది. ఆమెకి కూడా మంచి పాత్ర దొరికింది. అలాగే త్రిష కూడా బాగుంది కానీ ఆమెకి అంత పెద్దగా రోల్ లేదు. శోభిత ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి ఇద్దరూ గ్లామరస్ గా వున్నారు. 

చివరగా, 'పొన్నియన్ సెల్వన్' సినిమా తెలుగు వాళ్ళకి అంతగా నచ్చక పోవచ్చు. ఎందుకంటే చాల ఎక్కువ కేరక్టర్స్ ఉండటం, ఆ పేర్లు, ఆ చరిత్ర అస్సలు తెలియక పోవటం. దానికి తోడు, మణిరత్నం అర్థ్యం అయ్యే రీతిలో సినిమా నేరేట్ చేయకపోవటం. మధ్యలో చాల సన్నివేశాలు సాగ దీయటం. పాన్ ఇండియా కథ అయితే కాదు ఇది, ఒక కలగూర గంప ల తీసాడు. కానీ ఓటిటి లో వస్తే మాత్రం నిమ్మదిగా చూసుకుంటూ, అర్థం చేసుకోవచ్చు ఏమో. అప్పుడు కూడా కల్కి రాసిన ఒరిజినల్ కథ కొంచెం చదివితే, అర్థం అవుతుందేమో. ఇంత చెప్పాక  కూడా చూడటం, చూడకపోవటం  మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. చివరగా బాహుబలికి దీనికి పోలికే లేదు. బాహుబలి ఒక జానపద కథ, అందరికి నచ్చేలా తీసాడు రాజమౌళి, ఈ 'పొన్నియన్ సెల్వన్' చారిత్రక కల్పిత కథ, ఒక్క తమిళులకు మాత్రమే నచ్చుతుందేమో! బాహుబలి ది బెస్ట్!

Updated Date - 2022-09-30T19:45:37+05:30 IST