టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), ఆయన సతీమణి నమ్రత (Namratha) ప్రపంచంలోనే గొప్పవ్యక్తులలో ఒకరైన బిల్ గేట్స్ (Bill Gates)ను కలిశారు. ప్రపంచ మొత్తం సుపరిచితుడయిన మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్ర స్థానంలో ఉండే బిల్ గేట్స్ తన దాతృత్వాన్ని ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటారు. ఇప్పటికే ఆయన వేల కోట్ల ఛారిటీ కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతలు ఆయనను కలిసి కాసేపు ముచ్చటించారు.
మహేశ్ ఫ్యామిలీ ప్రస్తుతం హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అమెరికాలోని న్యూజెర్సీలో బిల్ గేట్స్‌ను కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయనతో పలు విషయాలను మాట్లాడినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో తాజా ఫోటోను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'బిల్ గేట్స్ వంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది'.. అంటూ పోస్ట్‌లో కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.
ఇక మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'సర్కారు వారి పాట' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సాధించింది. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాను చేయబోతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతుండగా, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్‌పైకి తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.