Mahesh - Vijay ఫ్యాన్స్ వార్ రచ్చ..

ABN , First Publish Date - 2022-07-07T20:52:08+05:30 IST

అభిమానుల్ని తెరపై అలరించే అగ్రతారలు.. తెరవెనుక ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే అలాంటి స్నేహం వారి అభిమానుల మధ్యే కరువవుతోంది. తమ అభిమాన హీరోల్ని ఆకాశానికెత్తేస్తూ.. ఇతర అభిమానుల హీరోల్ని చిన్నచూపు చూసే చెడు సంస్కృతి ఎప్పటినుంచో ఉన్నా.. ఇప్పుడిది మరీ ఎక్కువయింది.

Mahesh - Vijay ఫ్యాన్స్ వార్ రచ్చ..

అభిమానుల్ని తెరపై అలరించే అగ్రతారలు.. తెరవెనుక ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. అయితే అలాంటి స్నేహం వారి అభిమానుల మధ్యే కరువవుతోంది. తమ అభిమాన హీరోల్ని ఆకాశానికెత్తేస్తూ.. ఇతర అభిమానుల హీరోల్ని చిన్నచూపు చూసే చెడు సంస్కృతి ఎప్పటినుంచో ఉన్నా.. ఇప్పుడిది మరీ ఎక్కువయింది. ముఖ్యంగా తమిళనాట ఈ తరహా ఫ్యాన్స్ వార్ పీక్స్ లో ఉంటుంది. నిన్న మొన్నటి వరకూ దళపతి విజయ్, అజిత్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఒకరి హీరోల్ని మరొకరు తిట్టడం.. అవమాన పరిచేలా మాటల యుద్ధాలు సాగించడం చేసేవారు. ఆయా హీరోల సినిమాల విడుదలైన సందర్భంలో ఇది ఎక్కువగా బైటపడుతూ ఉంటుంది. ఇప్పుడది హద్దులు చెరిపేసి.. సరిహద్దులు దాటి.. రాష్ట్రాలు దాటింది. 


ప్రస్తుతం సోషల్ మీడియాలో  మహేశ్ అండ్ దళపతి విజయ్ అభిమానుల మధ్య జరుగుతూండడం గమనార్హం. పూర్వం సోషల్ మీడియా లేనప్పుడు ఈ తరహా ఫ్యాన్స్ వార్.. కేవలం మాటలవరకే పరిమితం అయ్యేది. ఇప్పుడది ట్రోలింగ్స్, మీమ్స్ వరకూ పాకింది. మా హీరో మహేశ్ గొప్పంటూ.. దళపతి విజయ్ ను కించపరుస్తూ మహేశ్ అభిమానులు మీమ్స్ తో, ట్రోల్స్ తో రెచ్చిపోతున్నారు. కొన్ని వీడియోల్లో విజయ్ బాల్డ్ హెడ్ కనిపించేలా మార్ఫింగ్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఎదురు దాడికి దిగుతున్నారు. ఈ ఇద్దరి హీరోల ఫ్లాప్ సినిమాల క్లిప్స్ వాడుతూ.. ఒకిరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. విజయ్‌ను మించిన స్టార్ లేడంటూ మహేశ్ ను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు.


దానికి గట్టికౌంటర్ ఇస్తూ మహేశ్ ఫ్యాన్స్ విజయ్ వీడియోల్ని మార్ఫింగ్ చేస్తూ వదులుతున్నారు. అంతేకాకుండా.. ఇద్దరు యువకులు కొట్టుకుంటున్న వీడియోను షేర్ చేసి.. హీరో మహేశ్ విజయ్ ను కొడుతున్నాడంటూ.. కామెంట్స్ పెట్టి రెచ్చగొడుతున్నారు. నిజానికి మహేశ్ నటించిన ‘ఒక్కడు, పోకిరి’ లాంటి సినిమాల్ని తమిళంలో విజయ్‌తో రీమేక్ చేశారు. ఈ సినిమాలు రెండు చోట్లా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇదే విషయాన్ని ఇండైరెక్ట్ గా గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు మహేశ్ ఫ్యాన్స్. మా హీరో సినిమాల వల్లే  మీ హీరో స్టార్ అయ్యాడని కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల అభిమానులు చేస్తున్న రచ్చకు.. పిచ్చి పీక్స్ చేరిందా అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి గొడవను ఆపడానికి ఆ హీరోలిద్దరూ రంగంలోకి దిగితే బాగుంటుందని నెటిజెన్స్ భావిస్తున్నారు. మరి దీనికి మహేశ్, విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Updated Date - 2022-07-07T20:52:08+05:30 IST