MAA Election : కౌగిలింతలు.. కొరుకులాటల మధ్య ‘మా’ ఎన్నికలు!

ABN , First Publish Date - 2021-10-10T17:40:32+05:30 IST

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు) రసవత్తరంగా సాగుతున్నాయి...

MAA Election : కౌగిలింతలు.. కొరుకులాటల మధ్య ‘మా’ ఎన్నికలు!

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు) రసవత్తరంగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం ‘కౌగిలింతలు’తో మొదలైన ఎన్నికలు.. ‘కొరుకులాటలు’తో కొనసాగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ నిమిషం ముందు వరకు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. సవాళ్లు, ప్రతి సవాళ్లు జరిగాయి. అయితే.. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. పోటీలో ఉన్న మంచు విష్ణు-ప్రకాష్‌రాజ్‌ను కలిపి కరచాలనం చేయించారు. ఇది జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ‘రిగ్గింగ్’ గొడవ.. ఆ తర్వాత మోహన్ బాబు ఒక్కసారిగా రెచ్చిపోయి నటుడు బెనర్జీని చంపేస్తానంటూ బెదరింపులకు పాల్పడటం జరిగింది. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొని కాసేపు పోలింగ్ కూడా ఆగిపోయింది. పోలీసులు రంగంలోకి దిగడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అనంతరం ఎన్నికల అధికారులు కూడా ఇరు ప్యానెళ్లతో మాట్లాడి వివాదానికి ఫుల్‌‌స్టాప్ పెట్టేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది.


ఇటు కౌగిలింతలు..!

ఓటేయడానికి వచ్చిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మంచు మనోజ్‌ చేయి కలిపి కౌగిలించుకున్నారు. ఆ తర్వాత మెగా హీరో రామ్ చరణ్.. విష్ణుతో ఆప్యాయంగా మాట్లాడి హగ్ చేసుకున్నారు. ఇలా చాలా మంది నటీనటులు ఓటేయడానికి ముందు.. ఆ తర్వాత మంచు మోహన్ బాబు, విష్ణును పలకరించుకున్నారు. అంతా సాఫీగానే పోలింగ్ జరుగుతోందనుకున్న టైమ్‌కు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడం.. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం.. కొరుకులాటలు మొదలయ్యాయి.


అటు కొరుకులాటలు!

నటుడు శివ బాలాజీ.. నటి హేమ చేయి కొరికారని మొదట వార్తలు వచ్చాయి. అయితే అక్కడ జరిగింది రివర్స్.. హేమనే శివ బాలాజీ చేయి కొరికారు. అసలేం జరిగిందనే విషయాన్ని చెబుతూ ఇదిగో.. హేమే.. ఈయన చేయి కొరికిందని చెబుతూ.. మీడియాకు చేయి చూపించారు. దీనిపై మళ్లీ హేమ రియాక్ట్ అవుతూ ఒకింత కౌంటరిచ్చారు. లోపల చాలా గొడవగా ఉంది. ఆయన ఏం చేయకుండానే కొరికేస్తామా..?. శివ బాలాజీ చేతులు వేయడం వల్లనే నేను ఆయన్ను కొరికాను. ఎన్నికలు అయ్యాక ఏం జరిగిందో మీడియాకు చెబుతాను’ అని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల ముందు.. ఎన్నికల రోజే కాదు.. ఫలితాల తర్వాత కూడా రసవత్తరంగానే ఉండబోతోందన్న మాట.


హేమే కొరికారు..!

అంతకుముందు ఈ విషయంపై ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. శివబాలాజీ మాట్లాడుతూ..నేను బారికేడ్స్ పట్టుకుని ఉంటే వెనుక హేమగారు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి వాళ్ల మనిషి కాబట్టి నేను చేయి ఎత్తకూడదని కోపంలో కొరికారు. ఆమె ఏ మూడ్‌లో కొరికారన్నది నేను సరిగ్గా గమనించలేదు. నా ఎడమచేతికి పంటిగాట్లు పడ్డాయిఅని చెప్పారు.


ఇంకా ఓటేయని ప్రముఖులు..!

కాగా ఇప్పటి వరకూ 'మా' ఎన్నికల్లో కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, పవన్, నాగబాబు, మురళీమోహన్, రోజా, రామ్‌చరణ్, నరేష్, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, శివబాలాజీ, జెనీలియా, నిత్యామీనన్, సాయికుమార్, ఆది, తనికెళ్ల భరణి, వడ్డే నవీన్, బ్రహ్మానందం, పోసాని, మంచు మనోజ్, లక్ష్మీప్రసన్న, నిఖిల్, సప్తగిరి, వేణు, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, రాఘవతో పాటు పలువురు ప్రముఖులు ఓటేశారు. అయితే అక్కినేని, దగ్గుబాటి, నందమూరి హీరోలు ఇంకా ఓటేయడానికి రాలేదు. మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. 8 గంటల తర్వాత ‘మా’ కింగ్ ఎవరో తేలిపోనుంది.

Updated Date - 2021-10-10T17:40:32+05:30 IST