Love Today film review: నవ్వులే నవ్వులు

ABN , First Publish Date - 2022-11-26T21:21:12+05:30 IST

'లవ్ టుడే' (Love Today film) అనే సినిమా తమిళనాడు లో ఒక సంచలనం క్రియేట్ చేసింది. సుమారు 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇంచుమించు 50 కోట్లు కలెక్ట్ చేసింది అని, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందని చెప్తున్నారు.

Love Today film review: నవ్వులే నవ్వులు

సినిమా : లవ్ టుడే

నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులు

సంగీతం: యువన్ శంకర్ రాజా

సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్

నిర్మాతలు: కలపతి ఎస్ అఘోరం, కలపతి ఎస్ గణేష్, కలపతి ఎస్ సురేష్


-- సురేష్ కవిరాయని

'లవ్ టుడే' (Love Today film) అనే సినిమా తమిళనాడు లో ఒక సంచలనం క్రియేట్ చేసింది. సుమారు 4 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇంచుమించు 50 కోట్లు కలెక్ట్ చేసింది అని, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిందని చెప్తున్నారు. చిన్న సినిమా అంత పెద్ద విజయం సాధించటం తో అందరి దృష్టి ఈ సినిమా మీదే పడింది. (All eyes are on this Love Today film, because it shakes the box office) ఈ సినిమాను డబ్బింగ్ చేసి తెలుగు లో విడుదల చేసారు. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని కేవలం డిస్ట్రిబ్యూషన్ మాత్రం చేసాడు. చిత్ర ప్రమోషనల్ వీడియోస్ చాలా ఆకట్టుకున్నాయి. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan is the director) దీనికి దర్శకుడు, అలాగే ఇందులో లీడ్ యాక్టర్ గా కూడా చేసాడు. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం. (Ivana)



Love Today story కథ:

ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత (ఇవానా) ఒకరినొకరు ప్రేమిచుకుంటారు పెళ్లి చేసుకుందాం అనుకుంటూ వుంటారు. కానీ ప్రదీప్, నిఖిత, ఇద్దరూ ఎప్పుడూ ఫోన్ తో ఎక్కువ సమయం గడుపుతూ వుంటారు. ప్రదీప్ తల్లికి నిఖిత అంటే ఇష్టమే కానీ, నిఖిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) మాత్రం ఒక షరతు పెడతాడు. అందుకని నిఖితతో తాను ప్రదీప్‌ను కలవాలని, ఇంటికి రమ్మని చెప్పమంటాడు. అయితే నిఖిత, ప్రదీప్ కి తన తండ్రి ఏమి ప్రశ్నలు అడగవచ్చో ముందో ఊహించి అతనికి చెపుతుంది. భయపడవద్దు అని కూడా చెపుతుంది. కానీ ఏవో తిక్క ప్రశ్నలు అడుగుతాడని ఊహించుకుని వచ్చిన ప్రదీప్‌కు వేణు శాస్త్రి పెద్ద షాక్ ఒకటి ఇస్తాడు. అతను పెట్టిన షరతు ఏంటి అంటే ప్రదీప్, నిఖితలు వారి వారి ఫోన్లను ఒకరోజు మార్చుకోవాలని, తర్వాతి రోజు అదే సమయానికి వారిద్దరూ ఇష్టపడితే, పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తాడు. దీంతో వారిద్దరూ తమ ఫోన్లు మార్చుకుంటారు. ఆలా మార్చుకున్నాక ఏమి జరిగింది? నిఖిత ఫోన్ లో ప్రదీప్ ఏమి చూసాడు, అలాగే ప్రదీప్ రహస్యాలు అతని ఫోన్ లో నిఖిత కి ఏమి కనపడ్డాయి, ఇంతకీ ఈ ఫోన్ల మార్పిడి వాళ్ళ ఏమి జరిగింది? వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? లేదా అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


విశ్లేషణ:

ఈ 'లవ్ టుడే' తమిళనాడు లో సంచలనం సృష్టించిన సినిమా. తెలుగులో కూడా అదే పేరుతో విడుదల అయింది. ఈ సినిమా కథ స్మార్ట్ ఫోన్స్ గురించి వాటిని ఇప్పటి యువత ఎలా వాడుతున్నారు అన్న విషయం మీద తీసింది. అయితే ఈ సినిమా కథలో ట్విస్ట్ ఏంటి అంటే, ఇద్దరు ఘాడంగా ప్రేమిచుకున్న జంట తమ ఫోన్లను మార్పిడి చేసుకోవటం ద్వారా ఒకరి రహస్యాలు ఇంకొకరికి తెలిసి అవి వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు సృష్టిస్తాయో అన్నది చాలా అద్భుతంగా, హాస్యాస్పదంగా చిత్రీకరించాడు దర్శకుడు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి దర్శకుడే కాకుండా లీడ్ యాక్టర్ గా చేసాడు. ప్రదీప్ ప్రస్తుతం యువత ఎలా వున్నారు, వాళ్ళు ఫోన్స్ ఎలా వాడుతున్నారు అన్న పాయింట్ బాగా పట్టాడు.


అయితే రెండున్నర గంటల కథగా చెప్పాలంటే దాన్ని ఆసక్తిగా తీయాలి. ప్రదీప్ రంగనాథన్ ఆ చెప్పడం లో పూర్తిగా సఫలీకృతుడు అయ్యాడనే చెప్పాలి. ఎందుకంటే సినిమా మొత్తం సరదాగా, నవ్వులతో సాగిపోతుంది. సినిమా మొదలవడం లీడ్ యాక్టర్లను పరిచయం చెయ్యడం, వాళ్ళ తల్లి దండ్రులు ఎలా వుంటారు అన్న విషయం అయ్యాక, ఎప్పుడయితే ఇద్దరూ ఫోన్లు మార్చుకుంటారో అక్కడ నుండి ఇక అసలు కథ మొదలవుతుంది. అక్కడ నుండే నవ్వులు కూడా మొదలవుతాయి. ఇంకో విషయం ఏంటి అంటే, ఈ కథ, ఆ ఫోన్ల మార్పిడి వాళ్ళ రహస్యాలు ఒకరివి ఇంకొకరికి తెలియటం అనేది ఇప్పుడు యువతకి కనెక్టు అయ్యే పాయింట్. ఇప్పుడు యువత ఎలా వున్నారు, ఎలా ఫేక్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు, లైక్స్ కొట్టడం, మెసేజెస్ ఇవ్వటం, ఒకటేంటి వాళ్ళు ఎన్ని ఎదవ వేషాలు వేస్తారో అన్నీ చూపిస్తాడు.

ఆలా ఒకరి రహస్యాలు ఒకరికి తెలియచెప్పే సన్నివేశాల్లో హ్యూమర్, కోపం, నిరాశ ఇలాంటివి ఎన్నో చూపిస్తాడు. కొన్ని సన్నివేశాల్లో అయితే ఆలా చెప్పేవి నిజం అనిపిస్తాయి కూడా. అలాగే సెకండ్ హాఫ్ లో చాల భావేద్వేగ సన్నివేశాలు కూడా వున్నాయి. లీడ్ యాక్టర్ అక్క పెళ్లి ఒక డాక్టర్ తో ఒప్పుకుంటుంది. అతను చూడటానికి బాగోడు, కానీ అక్క ఒప్పుకుంది. ప్రదీప్ తన ఫోన్ల మార్పిడి తరువాత అక్కని కూడా చేసుకోబోయే అతని ఫోన్ అడిగి చూడు అని అంటాడు. కానీ అతను ఇవ్వడు. అతను ఎందుకు ఇవ్వదు, వాళ్ళ అక్క ఎలా స్పందించింది అని ఆలా వాళ్ళిద్దరి కథ కూడా ఇందులో పెడతాడు. అలాగే సత్యరాజ్, ప్రదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు అయితే నవ్వులు పండిస్తాయి. దర్శకుడు ప్రదీప్ ఈ సినిమాలో అన్నీ అంటే హ్యూమర్, భావోద్వేగాలు, కోపం, నిరాశ, కొన్ని సున్నితమయిన అంశాలను సమ పాళ్ళలో చూపిస్తాడు. ప్రేక్షకులు అన్నిటికీ కనెక్టు అయ్యారు కాబట్టే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయింది తమిళ నాడులో. కథ కూడా ఒక్క తమిళనాడు ప్రాంతానికే కాకుండా, అన్ని ప్రాంతాలకి చెందినది. ఫోన్ ఉపయోగిస్తున్న వారందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.


ఇక నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమా విజయానికి కారణం ఏకంగా ప్రదీప్ రంగనాథన్ కి ఇవ్వొచ్చు. ఎందుకంటే అతను ఈ కథను తయారుచేసుకోవడమే కాకుండా, అందులో నటించాడు కూడా. చాల సహజంగా నటించి అందరిని ఆకట్టుకున్నాడు. కామెడీ చెయ్యడం, అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా చాల బాగా చేసాడు. ఇప్పుడున్న యువతకి తగ్గట్టుగా కథని ఎంచుకోవటమే కాకుండా, వాళ్ళ సహజత్వానికి దగ్గరగా నటించాడు. కథానాయిక ఇవానా ప్రదీప్ తో సమానంగా నటించి చూపించింది. ఆమెకు ఇది రెండో సినిమా అయినా, మంచి ప్రాధాన్యం ఉన్న రోల్ దొరికింది. నిఖిత అనే పాత్రలో చక్కగా వొదిగిపోయింది, సహజంగా నటించింది. అన్ని భావాలు అద్భుతంగా పలికించింది. ఈ అమ్మాయికి చాల మంచి ఫ్యూచర్ వుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాలో మరో మంచి పాత్రలో యోగిబాబు కనిపిస్తాడు. ఇతను తమిళ సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తాడు కానీ, ఇందులో మాత్రం వాటికి భిన్నంగా వుండే పాత్ర చేసాడు. అతను ఆఖరున చేసే సన్నివేశాలు చాల బాగా ఆకట్టుకుంటాయి. అలాగే కథానాయకుడు స్నేహితులుగా అందరూ బాగా నటించారు, వాళ్ళ వాళ్ళ పాత్రలను చక్కగా పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది, పాటలు కూడా ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి సన్నివేశాన్ని ఎలేవేట్ చేసే విధంగా సంగీతం ఉంటుంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది, అన్ని సన్నివేశాలను అందంగా చూపించాడు.

చివరగా, 'లవ్ టుడే' అనే సినిమా నవ్వులు కురిపిస్తుంది. సినిమా అంతా ఇప్పుడు యువత ఫోన్ లను ఎలా వాడుతున్నారు అనే విషయం అయినా, అంతర్లీనంగా ఒక మంచి కథను చెప్పి, అందులోనే అన్ని రసాలను పండించేలా చూపించాడు దర్శకుడు ప్రదీప్ రంగనాథన్. తప్పకుండా చూడాల్సిన సినిమా. ఈ సినిమా చూసి బయటకి వచ్చాక తప్పకుండా ఫోన్ గురించి అయితే ఆలోచనలో పడతారు.



Updated Date - 2022-11-26T21:21:12+05:30 IST