Jean-Luc Godard: శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసిన ఈ గొడార్డ్ ఎవరు..? తన చావును తానే రాసుకున్న ఈ మహా దర్శకుడి కథేంటంటే..!

Twitter IconWatsapp IconFacebook Icon
Jean-Luc Godard: శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసిన ఈ గొడార్డ్ ఎవరు..? తన చావును తానే రాసుకున్న ఈ మహా దర్శకుడి కథేంటంటే..!

ప్రపంచ సినిమా స్థితిగతుల్ని, రూపురేఖల్ని మార్చేయడంతో పాటు ప్రపంచ సాహిత్యరంగం మీద కూడా తన ప్రభావం చూపించిన మహా దర్శకుడు, ఫ్రెంచ్ న్యూ వేవ్ (Nouvelle Vague) సినిమా కి ఆద్యుడైన దర్శకుడు గొడార్డ్ (Jean-Luc Godard ఝా-లుక్ గోడా) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 91 ఏళ్ల గొడార్డ్ సహాయక ఆత్మహత్య (assisted suicide) ద్వారా మంగళవారం స్విట్జర్లాండ్ లోని తన నివాసంలో చివరిశ్వాస తీశారు. "వయసు పైబడి వచ్చే అనేక అనారోగ్య సమస్యలతో తీసుకుంటున్న గొడార్డ్ హుందాగా నిష్క్రమించాలని కోరుకున్నారు. భార్య, సన్నిహితుల మధ్య ఆయన తనువు చాలించారు.." అని ఆయన అధికారిక సలహాదారు ప్రకటించారు (Assisted suicide స్విట్జర్లాండ్ దేశంలో చట్టబద్ధమే). 


ప్రపంచ సినిమాలో ‘నవతరంగం’:

గొడార్డ్ ఆలోచనలు విప్లవాత్మకం.. కథనాలు నిత్యనూతనం... నిర్మాణ పద్ధతులు అపూర్వం... ఆయన కెమెరా నిరంతర చలనశీలం! ప్రపంచ సినిమాకు కొత్త భాషనీ, భాష్యాన్నీ, వ్యాఖ్యానాన్నీ,  వ్యాకరణాన్ని అందించిన దిగ్దర్శకుడు గొడార్డ్. ఫ్రెంచ్ న్యూ వేవ్ (Nouvelle Vague) - అంటే కొత్త కెరటం అని, నవతరంగం అనీ అనవచ్చు. సినిమా నిడివి, నిర్మాణ వ్యయం, బాక్సాఫీసులు బద్దలు కావడం, రికార్డుల మోత వంటి  లాభనష్టాలకి సంబందించిన అంశాలు కాకుండా సృజనాత్మకత మీద దృష్టి పెట్టి సినిమా తీయడమే ఆ న్యూవేవ్ ఉద్యమ లక్ష్యం. ఆ కొత్త సినీ ఉద్యమకాలం అతి తక్కువే కావొచ్చు గానీ, ప్రపంచవ్యాప్తంగా అది చూపిన ప్రభావం ఇప్పటికీ ఉంది అంటారు సినీ పండితులు.


“Der alte Film ist tot. Wir glauben an den neuen" అని 1960లలో జర్మన్ దర్శకుల ప్రకటన చాలా ప్రాచుర్యం పొందింది. అంటే, "పాతసినిమా చచ్చింది, కొత్త సినిమానే మేము శ్వాసిస్తాం.." అని అర్థం.  పాతది బాలేదని, కొత్తదాని కోసం ఆ తరం ప్రపంచ దర్శకులు అన్వేషించడానికి ప్రేరణ గొడార్డ్, ఆయన సినిమాలే.  

Jean-Luc Godard: శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసిన ఈ గొడార్డ్ ఎవరు..? తన చావును తానే రాసుకున్న ఈ మహా దర్శకుడి కథేంటంటే..!

సినిమా కాదు దృశ్యకావ్యం: 

న్యూ వేవ్ ధోరణికి శ్రీకారం చుట్టిన గొడార్డ్ సినిమా ‘బ్రెత్ లెస్’ (À bout de souffle (Breathless). ఒక సెకండ్ కి 24 ఫ్రేముల చొప్పున నిజాన్ని చూపుతుంది అని న్యూవేవ్ సినిమా గురించి గొడార్డ్ ఇచ్చిన నిర్వచనానికి నిలువెత్తు దృశ్యరూపం ‘బ్రెత్ లెస్ 'అని ప్రశంసించింది ప్రపంచ వీక్షక లోకం.  కథ- కథనం రెంటిలోనూ కొత్తదనానికి దారులు వేశారు గొడార్డ్. కథపరంగా కార్ల్ మార్క్స్ ప్రభావం,  జీన్ పాల్ సార్త్రే అస్తిత్వ వాద చాయలు, అనార్క్సిస్టు నీడలు కనిపిసాయి. ఈ సినిమా వొక డాక్యుమెంటరీ లాగా తీయాలని మొదలు పెట్టి, ఓ హాండ్ కెమెరాతో తీశారట ఆయన. హ్యాండ్ హెల్డ్ కెమెరా వర్క్, సౌండింగ్, జంప్ కట్స్, సరికొత్త సంభాషణలతో మేకింగ్ లోనూ కొత్త మార్గం ప్రారంభించారు.  


సినిమా షూటింగ్ మధ్యలోనే అప్పటికప్పుడు సంభాషణలు రాయడం గొడార్డ్ శైలి. కానీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకి అలా అనిపించదు. ఎంత మథనపడితే, ఎంత నలిగిపోతే, ఎంత  వేదన అనుభవిస్తే ఈ డైలాగ్స్ రాసి ఉంటాడో కదా అనిపిస్తుంది. నోబెల్ సాహిత్య పురస్కారానికి పరిశీలనలో ఉన్న ప్రఖ్యాత జపనీయ ఇంగ్లీషు రచయిత హరుకి మురకమి( Haruki Murakami) తన ప్రసిద్ధ కథాసంకలనం 'After the Quake'  కథలన్నింటికీ గొడార్డ్ 'Pierrot le Fou' సినిమాలోని ఒక సంభాషణే ఆధారం అంటే, గొడార్డ్ సంభాషణల ప్రభావాన్ని అర్థంచేసుకోవచ్చు. 

Jean-Luc Godard: శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసిన ఈ గొడార్డ్ ఎవరు..? తన చావును తానే రాసుకున్న ఈ మహా దర్శకుడి కథేంటంటే..!( Breathless చిత్రంలోని ఓ సన్నివేశం )

జపాన్ లో భూకంపం తర్వాత ధ్వంసమైన జీవితాల్ని కథలుగా రాసిన ఆ కథాసంపుటికి ముందుమాటగా  'Pierrot le Fou' సినిమాలోని నాల్గువాక్యాల సంభాషణని ప్రచురించుకున్నాడు హరుకి మురకమి. 1976లో శ్రీశ్రీ రాసిన ఒక వ్యాసంలో కూడా గొడార్డ్ న్యూవేవ్ ప్రభావం తన మీద పడినట్లు చెప్పుకున్నారు. ఆ విధంగా దేశాలకి, ఖండాలకీ అతీతంగా గోడార్డ్ సినిమా, సాహిత్య రంగాల్ని ప్రభావితం చేశారు. ఆయన సినిమాలు-  ఒక్కొక్క ఫ్రేమ్ ఏ తపస్సు చేస్తే తయారయ్యిందో అనిపిస్తుంది. అడుగడుగునా గొప్ప చిత్రీకరణలు, ఆశ్చర్యచకితుల్ని చేసే సన్నివేశ కల్పనా కనిపిస్తాయి.


`బ్రీత్లెస్ ( Breathless- À bout de souffle)  తర్వాత, `ది లిటిల్ సోల్జర్ (Le petit soldat - The Little Soldier),  `మై `లైఫ్ టూ లైవ్(Vivre sa vie - My Life to Live)’, ‘ది కరేబినీర్స్ (Les Carabiniers), `కాంటెంప్ట్` (Le Mépris -(Contempt), `ఏ మ్యారీడ్ ఉమెన్(Une femme mariée- A Married Woman)’, `బ్యాండ్ ఆఫ్ ఔట్ సైడర్స్ (  Bande à part - Band of Outsiders) వంటి అద్భుతమైన సినిమాలెన్నో తీశారు.   కొంత గ్యాప్ తర్వాత మళ్లీ 1980లో `ప్యాషన్`, `ఫస్ట్ నేమ్ కార్మెన్`, `హైల్ మేరీ`, `కింగ్ లీర్`, `కీప్ యువర్ రైట్ అప్` వంటి సినిమాలు చేశారు. ఒక్కొక్క సినిమా ఒక్కో సిలబస్ గా భావిస్తారు సినీ ప్రేమికులు. 

Jean-Luc Godard: శ్రీశ్రీని కూడా ప్రభావితం చేసిన ఈ గొడార్డ్ ఎవరు..? తన చావును తానే రాసుకున్న ఈ మహా దర్శకుడి కథేంటంటే..!

వ్యక్తిగత జీవితం:  

గొడార్డ్  మొదట 1961లో అప్పటి వెండితెర వేలుపు అన్నా కరీనాని పెళ్ళిచేసుకున్నారు. కానీ, ఆ జంట నాలుగేళ్లకే విడిపోయారు. తర్వాత 1967లో మరో స్టార్ అన్నే వియాజెమ్క్సీని పెళ్ళి చేసుకున్నారు గొడార్డ్.  పన్నెండేళ్ళ తర్వాత వారు విడిపోయారు.  ఆ తర్వాత ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ అన్నే మేరీ మియావిల్లేతో కలిసి జీవించారు. గోల్డెన్ లయన్, గోల్డెన్ బీర్ వంటి అనేక అంతర్జాతీయ పురస్కారాలు గెలుచుకున్న గొడార్డ్ ప్రపంచ సినీయవనిక మీద చెరగని సంతకం చేసి తిరిగిరాని లోకాలకి మరలిపోయారు. ఆయన మహాభినిష్క్రమణం ఫ్రెంచ్ సినిమాకే కాదు, ప్రపంచ ప్రత్యామ్యాయ సినిమాకి చీకటి రోజుగా అభివర్ణిస్తుంది ప్రపంచ మీడియా.

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.