‘కత్తి’ కాంతారావుకు తీరని మూడు కోరికలు ఇవే!

ABN , First Publish Date - 2022-03-23T01:51:50+05:30 IST

‘ఎన్టీఆర్‌, ఏయన్నార్‌.. తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లయితే, ఆ రెంటి మధ్య ఉండే తిలకం .. కాంతారావు’ అని ఓ సందర్భంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ప్రశంసించారు. సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం...

‘కత్తి’ కాంతారావుకు తీరని మూడు కోరికలు ఇవే!

‘ఎన్టీఆర్‌, ఏయన్నార్‌.. తెలుగు సినీ కళామతల్లికి రెండు కళ్లయితే, ఆ రెంటి మధ్య ఉండే తిలకం .. కాంతారావు’ అని ఓ సందర్భంలో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు ప్రశంసించారు. సాంఘికం, జానపదం, పౌరాణికం, చారిత్రాత్మకం... ఏ తరహా చిత్రమైనా, ఎటువంటి పాత్రయినా అది కాంతారావు పోషిస్తే దానికి ఓ ప్రత్యేకత ఉండేది. తెలుగు సినిమా శివుడికి ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ రెండుకళ్లయితే మూడో కన్ను కాంతారావు అనేవారు. వాళ్లతో సమానంగా ఒకప్పుడు గొప్పగా వెలిగిన హీరో కాంతారావు చివరిరోజుల్లో దీనావస్థకు గురికావడానికి కారణాలేమిటి? కాంతారావుకు చెడు అలవాట్లు కూడా ఏమీ లేవు.. ఇది ఆయనకు వరమైతే, లౌక్యం లేకపోవడం ఆయనకి శాపంగా మారిందని ఆయన గురించి తెలిసిన వాళ్లంతా అనుకుంటూ ఉంటారు.


తను నటించిన సినిమాలు హిట్ అయినా కూడా పారితోషికం పెంచేవారు కాదు. ఎవరు ఎంతిచ్చినా తీసుకునేవారు. దాంతో కాంతారావు పారితోషికం ఇంతే అని నిర్మాతలు తీర్మానించుకుని, అంతకుమించి ఇచ్చేవారు కాదు. అదేమిటని కాంతారావు అడిగేవారు కాదు. ఆయన ఐదు సినిమాలు తీస్తే అందులో ఒక్క ‘గండరగండడు’ తప్ప తక్కినవన్నీ అపజయం పాలయ్యాయి. దాంతో తనకు మిగిలి ఉన్న ఆస్తులన్నీ అమ్మి, ఉన్న అప్పులన్నీ తీర్చారు. చిట్టచివరి ప్రయత్నంగా తీసిన ‘స్వాతిచినుకులు’ చిత్రం కూడా భారీ పరాజయం పాలు కావడంతో ఒక్కసారిగా ఆయన వీధిన పడాల్సివచ్చింది. ఆయన దీనావస్థ గురించి తెలుసుకున్న తర్వాత, హీరో రజనీకాంత్ నెలానెలా ఐదువేలు పంపించేవారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తొమ్మిదేళ్లపాటు నెలకు ఐదువేల రూపాయలు పంపించారు. 


పెద్దపెద్ద కార్లలో తిరిగిన కాంతారావు చివరికి ఆటోల్లో టీవీ షూటింగ్స్‌కి వెళ్లాల్సి వచ్చింది. టి. సుబ్బరామిరెడ్డి సన్మానం చేయించి, పదిలక్షలిస్తే అప్పటికే ఆయనకు కేన్సర్ సోకినట్లు తెలిసింది. ఆ డబ్బంతా వైద్యచికిత్సలకే సరిపోయింది. సొంత ఇంట్లో అట్టహాసంగా నివసించిన కాంతారావు, హైదరాబాద్‌లో నెలకు పదివేల రూపాయల అద్దె ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది. చివరిరోజుల్లో ఆయన చిన్నదే అయినా ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆశించారు. తను స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తనను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తించాలని ఆశించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ జాతీయ అవార్డు తనకూ వస్తుందని ఎదురు చూశారు. ఈ మూడు కోరికలు తీరకుండానే ఆయన కన్నుమూశారు. సినిమాల్లో కాంతారావు కత్తివీరుడే.. కానీ జీవనసమరాన్ని మాత్రం జయించలేకపోయారు.

Updated Date - 2022-03-23T01:51:50+05:30 IST