Kaali Poster row: నరేంద్ర మోదీపై Leena Manimekalai చేసిన పాత పోస్ట్ వైరల్

ABN , First Publish Date - 2022-07-07T18:20:47+05:30 IST

డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai)‌ విడుదల చేసిన ‘కాళీ’ పోస్టర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే...

Kaali Poster row: నరేంద్ర మోదీపై Leena Manimekalai చేసిన పాత పోస్ట్ వైరల్

డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ లీనా మణిమేకలై (Leena Manimekalai)‌ విడుదల చేసిన ‘కాళీ’ పోస్టర్ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాళీమాత సిగరెట్ తాగుతున్నట్లు, ఎల్‌జీబీ‌టీక్యూ (LGBTQ) కమ్యూనిటీ జెండా పట్టుకున్నట్లు ఆ పోస్టర్‌లో ఉంది. ఇది చూసి ఎంతోమంది హిందువులు తమ మనోభావాలను కించపరిచారంటూ కోపంతో ఊగిపోయారు. దీంతో ఈ డైరెక్టర్‌కి వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. మరికొందరైతే లీనాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖలు సైతం రాశారు.


అయితే.. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి లీనా ఓ ట్వీట్ చేసింది. కాళీ (Kaali) పోస్టర్ వివాదం చేలరేగిన ఈ తరుణంలో ఆ పాత పోస్ట్ తాజాగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో.. ‘నా జీవితంలో ఎప్పుడైనా నరేంద్ర మోదీ ప్రధానైతే.. నేను వెంటనే నా పాస్‌పోర్ట్, రేషన్ కార్డు, పాన్ కార్డుతోపాటు నా పౌరసత్వాన్ని వదిలేసుకుంటాను. ప్రమాణం చేస్తున్నాను’ అని రాసుకొచ్చింది. ఆ ట్వీట్‌ని అశోక్ పండిట్ అనే నెటిజన్ తాజాగా షేర్ చేశాడు. దానికి.. ‘మేడం లీనా మణిమేకలై.. మీరు ఈ దేశానికి చేసిన వాగ్దానానికి కట్టుబడి లేరు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యి ఇప్పటికే 8 ఏళ్లు అయ్యింది. అయినా.. మీరు మీ బ్యాగ్‌లను ప్యాక్ చేసుకొని చైనా లేదా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. మీరు బాధ్యతగా వ్యవహరించాలి’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా.. అరెస్ట్ లీలామణిమేకలై యాష్‌ట్యాగ్‌ని సైతం దానికి జోడించాడు.


వైరల్ అవుతన్న లీనా పాత పోస్ట్‌పై పలువురు నెటిజన్లు స్పందించారు. ఆమెని విమర్శిస్తూ కామెంట్స్ చేయడమే కాకుండా.. ఆ పోస్ట్ రీ ట్వీట్ సైతం చేస్తున్నారు. ఈ వివాదంపై లీనా స్పందిస్తూ.. ‘నేను కోల్పోయేది ఏమీ లేదు. నేను జీవించి ఉన్నంత వరకు, నేను నమ్మినదాన్ని నిర్భయంగా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాను. దానికోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను’ అని ఓ ట్వీట్ సైతం చేసింది. కాగా.. పోస్టర్ వెనుక ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి డాక్యుమెంటరీని చూడాలని చిత్రనిర్మాత జనాలను కోరారు.



Updated Date - 2022-07-07T18:20:47+05:30 IST