‘భీమ్లా నాయక్’.. ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు: కేటీఆర్

ABN , First Publish Date - 2022-02-24T04:21:46+05:30 IST

ఒక మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. నాకు తెలిసి సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు కానీ.. కల్ట్ ఫాలోయింగ్ ఉండే విలక్షణ నటుడు..

‘భీమ్లా నాయక్’.. ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు: కేటీఆర్

‘ఒక మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. నాకు తెలిసి సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు కానీ.. కల్ట్ ఫాలోయింగ్ ఉండే విలక్షణ నటుడు పవన్ కల్యాణ్‌’.. అని అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు కేటీఆర్. ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ..


‘‘చాలా సమయం అయింది. అయినా సరే ఓపిక వేచి చూస్తున్న తమ్ముళ్లందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్ కల్యాణ్‌గారి సోదరుడిగా వచ్చాను. ఒక మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, విలక్షణమైన శైలి. నాకు తెలిసి సూపర్ స్టార్లు, సినిమా స్టార్లు చాలా మంది ఉంటారు కానీ.. కల్ట్ ఫాలోయింగ్ ఉండే విలక్షణ నటుడు పవన్ కల్యాణ్‌గారు. మేమంతా ఆయన ‘తొలిప్రేమ’ సినిమా చూసిన వాళ్లమే. అప్పటి నుండి ఇప్పటి వరకు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అనేది ఒక అసాధారణమైన విజయం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. హాజరైన ప్రతి ఒక్కరికీ అభినందనలు. మంత్రి తలసానిగారు చెప్పారు..  8 ఏళ్లుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు.. భారత చలనచిత్ర పరిశ్రమకి ఒక సుస్థిరమైన కేంద్రంగా హైదరాబాద్‌ని రూపొందించాలనే ధృడసంకల్పంతో తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవనీయులు కేసీఆర్‌గారి నాయకత్వంలో పురోగమిస్తున్న క్రమంలో మాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కల్యాణ్‌గారి లాంటి పెద్దలందరూ అండగా ఉంటే.. తప్పకుండా హైదరాబాద్‌ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కేంద్రంగా మారుతుందనే విశ్వాసం నాకు ఉంది. ఈ రోజు సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కి ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు గోదారమ్మకి కూడా భూదారి చూపెట్టిన కేసీఆర్‌గారికి మనందరం ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. కల్యాణ్‌‌గారిని కోరుతున్నా.. మీరు షూటింగ్స్ గోదావరి జిల్లాలలోనే కాదు తెలంగాణలో కూడా ఇప్పుడు కాళేశ్వరం పుణ్యమా అని చెప్పి మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లో కూడా చేయవచ్చు. ప్రపంచంలోని అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ని ఇక్కడ మూడున్నర సంవత్సరాలలోనే పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌గారిది. ఇక్కడ మీరు షూటింగ్స్ చేసి, తెలంగాణ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం తీసుకువస్తారని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను. ‘భీమ్లా నాయక్’ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాత సూర్యులని బయటికి తీసుకువచ్చినందుకు పవన్ కల్యాణ్ గారికి, చిత్రయూనిట్‌కి అభినందనలు. హాజరైన ప్రతి ఒక్కరికీ, అలాగే సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు..’’ అని తెలిపారు.   



Updated Date - 2022-02-24T04:21:46+05:30 IST